చంద్రబాబునాయుడు నల్లధనం గురించి రెండు రోజులుగా ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. సహజంగానే అది పతాక శీర్షికల్లోకి వస్తోంది. హైదరాబాదులో ఒకే వ్యక్తి పదివేల కోట్ల నల్లధనం వైట్ గా మార్చుకున్నారనే అంశాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. అయితే ఆయన తమను ఉద్దేశించి, జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినట్లుగా వైకాపా శ్రేణులు మధనపడిపోవడం కూడా చాలా అసహజంగా జరిగింది.
అయితే మరొక పరిణామం విషయంలోనూ వైకాపా పోరుబాట ఎంచుకోవడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. ఇలాంటి పోరాటాన్ని ఎంచుకోవడం వల్ల తమ పార్టీ పరువు పోతుందేమో అనే చింత కూడా లేకుండా.. వైకాపా ఎందుకు ఈ విషయంలో పోరాటాన్ని ఆశ్రయిస్తున్నదో అర్థం కావడం లేదు.
వివరాల్లోకి వెళితే..
చంద్రబాబునాయుడు నల్లధనం ను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. జగన్ వర్గం దానికి కౌంటర్ ఇవ్వదలచుకుంటే.. అవును నల్లధనం కట్టడి చాలా అవసరం.. అదంతా తెదేపా వాళ్ల వద్దనే ఉంది.. లక్షల కోట్లు దోచేసుకుంటున్నారు.. అని ఎప్పటిలాగా నాలుగు విమర్శలు కురిపించేసి ఉంటే సరిపోయేది. అయితే నల్లధనానికి వ్యతిరేకంగా చంద్రబాబు పోరాడడమే తప్పు అన్నట్లుగా వారు ఇప్పుడు విమర్శిస్తున్నారు. 500, 1000 రూపాయల నోట్లను నిషేధించాలంటూ చంద్రబాబునాయుడు ప్రధానికి లేఖ రాశారు.
నిజానికి ఈ రెండునోట్లను నిషేధిస్తే నల్లదనం కట్టడి అవుతుందనే ఆలొచన చంద్రబాబు సొంతమేమీ కాదు. ఈ అంశాన్ని ప్రచారంలో పెడుతూ కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కలిగించడానికి, ప్రభుత్వం మీద ఒ త్తిడి తేవడానికి ఒక సంస్థ, కొందరు వ్యక్తుల ఆధ్వర్యంలో ప్రయత్నం కూడా జరుగుతున్నది. చంద్రబాబు ఆ డిమాండ్‌ను వినిపిస్తున్న మరొక వ్యక్తి మాత్రమే తప్ప.. తొలివ్యక్తి లేదా ఏకైక వ్యక్తి కాదు. అయితే వైకాపా నాయకులు చంద్రబాబు డిమాండ్ ను తప్పు పడుతూ.. ఆయనకు మరింత కీర్తిని కట్టబెట్టడానికి చూస్తున్నారు.
వైకాపా తరఫున పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షుడు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు రాస్తున్న లేఖతో తాము కూడా ఏకీభవిస్తామని అంటూనే.. ‘‘అయితే చంద్రబాబుకు ఇప్పుడే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఓటుకు నోటు కేసులో ఇచ్చినవి 500 నోట్లు గనుకనా? కోడెల చెప్పినట్లు ఎన్నికలకు ఖర్చు పెట్టిన 12 కోట్ల రూపాయలు అవే నోట్లు గనుకనా?’’ అంటూ వెటకారపు ప్రశ్నలు సంధించారు.
ప్రభుత్వం ఒక మంచి ఆలోచన లేదా మంచి ప్రయత్నం చేస్తే.. అందులో లోపాలుంటే మాట్లాడాలి.. మంచి ఉంటే హర్షించాలి. హర్షించడానికి మనసు రాకపోతే ఊరుకోవాలి. అంతే తప్ప.. ‘‘ఇప్పుడే ఎందుకు మంచి చేయాలనుకుంటున్నారు’’ అని ప్రశ్నిస్తే అర్థరహితంగా ఉంటుంది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పెట్టారనే అనుకుందాం. ఇప్పుడే ఎందుకు పెట్టాలి? కార్పొరేట్ హాస్పిటళ్లు నష్టాల్లో ఉన్నాయి గనుకనా? అని ప్రశ్నిస్తే ఎంత అసహనం కలుగుతుందో... ఇది కూడా అలాంటి ప్రశ్న.
తెలుగుదేశం పార్టీ ఎలా స్పందించినా కూడా.. ఇలాంటి చవకబారు విమర్శలకు దిగడాన్ని ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. వైకాపా ధోరణి పని గట్టుకుని మోకాలికి బోడిగుండుకి ముడిపెట్టేలా చీప్ ట్రిక్ లా ఉన్నదని వారు భావించారంటే అది పార్టీకి చేటు చేస్తుంది.