తెలుగు సినిమా పరిశ్రమను రక్షించడానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన అనేక అంశాలు ఉన్నాయి. వేల ఎకరాల విస్తీర్ణంలో చిత్రనగరి నిర్మాణం వంటివి కూడా అందులో ఉన్నాయి. నిజానికి అవన్నీ భారీ ఖర్చుతో కూడుకున్నవి. తక్షణం అవి లేకపోయినా సరే.. సినీ పరిశ్రమ ఇప్పుడున్న జోరుతోనే పరిఢవిల్లగలదనే గ్యారంటీ కూడా ఉంది. అయితే.. చిన్న సినిమాలు బతికి బట్టకట్టడమే గగనం అయిపోతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో... తెలంగాణ పరిధిలో అయిదో ఆట కూడా ఉండేలా.. అది కేవలం చిన్న సినిమాలకు మాత్రమే కేటాయించేలా కొత్త నిబంధనలు తెస్తాం అని కేసీఆర్ సర్కారు చాలా కాలం కిందటే ప్రకటించింది.
ప్రభుత్వానికి నయాపైసా ఖర్చు లేకుండా అమలు చేయదగిన ఈ నిర్ణయం గురించి సీరియస్ గా ఎందుకు పట్టించుకోవడం లేదో తెలియదు గానీ.. ఈ మధ్యలోనే అనేకానేక చిన్న చిత్రాలు విడుదల కావడమూ.. థియేటర్ల సదుపాయం , ప్రేక్షకులకు రీచ్ అయ్యేందుకు సరైన అవకాశం లేకుండా సర్వనాశనం అయిపోవడం జరుగుతూనే ఉంది.
ఇప్పుడు కూడా.. దాదాపుగా ప్రతి శుక్రవారమూ ఒక్కటైనా పెద్దచిత్రం విడుదల అవుతుంటుంది. సినిమా ఎలా ఉన్నప్పటికీ ఓపెనింగ్స్ ద్వారానే లాభాలు మొత్తం పిండేయాలనే ఉద్దేశంతో.. పెద్ద నిర్మాతలు.. వందల థియేటర్లలో రిలీజ్ చేసేస్తున్నారు. ఈ క్రమంలో చిన్న చిత్రలు థియేటర్లు దొరక్క విలవిల్లాడుతున్నాయి.
నిజానికి పెద్ద చిత్రాలు మాత్రం ఒకదాని వలన మరొకదానికి పోటీలేకుండా చాలా సౌకర్యంగా అడ్జస్ట్ మెంట్ లు చేసుకుంటున్నారు. ధ్రువ కు రన్నింగ్ టైం టూవీక్స్ వరకూ ఉండడానికే సింగం 3 వెనక్కి వెళ్లడమే ఇందుకు ఉదాహరణ. ఆ రకంగా పెద్ద నిర్మాతల మధ్య థియేటర్ల దందాలు నడిపించడానికి ఓ అండర్ స్టాండింగ్ ఉంటున్నది గానీ.. చిన్న చిత్రాలు సర్వనాశనం అయిపోతున్నాయి.
కేసీఆర్ సర్కారు ప్రకటించిన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9 గంటలకు ప్రదర్శించేలా అయిదో ఆటను కూడా తీసుకువస్తారు. రోజులో ఒక ఆటను చిన్న చిత్రాలకు ప్రత్యేకిస్తారు. ఆ రకంగా చిన్న చిత్రాలకు ఎప్పటికీ థియేటర్ల కొరత అనేదే లేకుండా చేస్తారు. ఈ పద్ధతి అమల్లోకి వస్తే.. చాలా చిత్రాలకు ఊపిరి వస్తుంది.. కానీ రోజులు గడుస్తున్నా ఇది ఆచరణ రూపం దాల్చడం లేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం సినీ అవార్డులకు సంబంధించి చేస్తున్న కసరత్తు గురించి మీడియాకు వివరిస్తూ.. మంత్రి తలసాని అయిదో ఆట కు త్వరలోనే అనుమతి ఇస్తాం అంటున్నారు. ఆయన ఎంత త్వరగా ఆ చొరవ చూపిస్తే అంత త్వరగా చిన్న చిత్రాల్ని రక్షించిన వారవుతారని నిర్మాతలు భావిస్తున్నారు. లేదా, పెద్ద నిర్మాతల మాఫియా ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తున్నదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.