అనుమతి కోరడానికి ముద్రగడకు ఇబ్బందేమిటి?

Update: 2016-11-21 06:00 GMT

అనుమతి కోరడానికి ముద్రగడకు ఇబ్బందేమిటి?వ్యవస్థను గౌరవించకుండా చేసే పోరాటానికి సరైన ఫలితం లభించాలని గానీ, ప్రజల మన్నన దక్కాలని గానీ... ఏ ఉద్యమకారుడయినా ఎలా కోరుకుంటారనేది అసలు అర్ధం కాని సంగతి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం సంకల్పిస్తున్న కాపు సత్యాగ్రహ పాదయాత్ర విషయంలో సామాన్యులకు అచ్చంగా ఇలాంటి సందేహాలే కలుగుతున్నాయి.

ముద్రగడ తలపెట్టిన పాదయాత్ర ఆయన హౌస్ అరెస్ట్ నేపధ్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఆ పాదయాత్ర విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభన, ఆందోళనాత్మక వాతావరణం మాత్రం తొలగిపోలేదు.ఒకవైపు ఆయన ఎప్పుడు పాదయాత్ర చేయదలచుకున్నా సరే ముందుగా అనుమతి తీసుకుని తీరాల్సిందేనని సాక్షాత్తూ హోమ్ మంత్రి చిన రాజప్ప చెబుతున్నారు. ముద్రగడ మాత్రం నా యాత్రకు మాత్రమే అనుమతి ఎందుకు? అంటూ , అదేదో అవమానకరంగా భావిస్తున్నారు. ససేమిరా అంటున్నారు. ఆ విధంగా వ్యవస్థను గౌరవించడానికి ఆయన నిరాకరిస్తున్నారు.

ముద్రగడ యాత్ర చేసినా, దీక్ష చేసినా అది కాపేతర కులాల వారు కూడా సహేతుకమయినదిగా ఎంచి హర్షించేలా ఉండాలి. కానీ స్వజనుల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యేలా ఆయన ఇలాంటి ధిక్కార ధోరణిలో ఎందుకు వెళుతున్నారో అర్ధం కాని సంగతి. కేవలం అనుమతి ద్వారా మొత్తం ప్రతిష్టంభన మబ్బు తెరల్లా విడిపోయేప్పుడు ఇక ఆలస్యం ఎందుకని పలువురు భావిస్తున్నారు

Similar News