ఒకేసారి జగన్ ఆ పనిచేస్తే...??

Update: 2018-12-29 01:30 GMT

జగన్ ఒకేసారి 175 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారా? విడతలు వారీగా కాకుండా మొత్తం ఒకేసారి అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. ఇప్పటికే జగన్ 175 నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపికపై ఒక అవగాహనకు వచ్చారని చెబుతున్నారు. గతనాలుగున్నరేళ్లుగా పార్టీకోసం శ్రమిస్తూ, ప్రజల్లో చురుగ్గా పాల్గొంటున్న నేతలకే వైసీపీ టిక్కెట్లు ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారు. పాదయాత్ర ముగిసిన వెంటనే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశముందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

వచ్చే నెల మొదటి వారంలో....

జగన్ ప్రస్తుతం ప్రజాసంకల్ప పాదయాత్ర చివరి అంకంలోకి వచ్చేశారు. జనవరి మొదటి వారంలో పాదయాత్రను ముగించనున్నారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో భారీ బహిరంగ సభను నిర్వహించి ఎన్నికల శంఖారావాన్ని అక్కడి నుంచే పూరించనున్నారు. ఇచ్ఛాపురం నుంచి నేరుగా బయలుదేరి తిరుపతి వెళ్లనున్నారు. అక్కడ శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కడప జిల్లాలోని అమీన్ పీర్ దర్గాకు చేరి ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. తర్వాత ఇడుపులపాయకు వెళ్లి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు.

నియోజకవర్గాల వారీ సమీక్షలు...

ఇడుపల పాయలో రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత జగన్ నియోజకవర్గాల వారీగా సమీక్ష జరుపుతారంటున్నారు. తన పాదయాత్రలో కొన్ని నియోజకవర్గాలు తప్ప దాదాపు అన్ని నియోజకవర్గాల్లో జగన్ పర్యటించారు. అక్కడి పరిస్థితులు, నాయకత్వంపై ఆయనకు ఒక అవగాహన వచ్చింది. నియోజకవర్గాల సమీక్షల్లో జగన్ స్వయంగా ఆశావహులందరితో మాట్లాడతారని చెబుతున్నారు. మిడిల్ మెన్ జోక్యం లేకుండా తానే ఆశావహులతో మాట్లాడాలనుకుంటున్నారు. ఎందుకు టిక్కెట్ ఇస్తుందీ? ఎందుకు ఇవ్వలేకపోతుందీ? సవివరంగా వారికి చెప్పి అసంతృప్తులు తలెత్తకుండా తానే బాధ్యత తీసుకోవాలని జగన్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

అసంతృప్తి తలెత్తకుండా....

ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు నుంచి ముగ్గురు పోటీ పడుతున్నారు. దీంతో పాటు గత కొన్నేళ్లుగా ఒక నియోజకవర్గానికి ఒక ఇన్ ఛార్జి, ఒక కో ఆర్డినేటరు ఉన్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ టీం సర్వేలతో పాటు, మరో రెండు సంస్థల ద్వారా అందిన సర్వేల ఆధారంగా జగన్ అభ్యర్థులను ఎంపిక చేస్తారంటున్నారు. ఎన్నికలకు దాదాపు రెండు నెలల ముందుగానే ఆయన అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. అభ్యర్థులకు ప్రచారం చేసుకోవడానికి తగిన సమయం ఉండాలని భావిస్తున్న జగన్ ఫిబ్రవరి నెలాఖరుకల్లా జాబితాను ప్రకటించే యోచనలో ఉన్నట్లు సమాచారం. దాదాపు పది రోజులపాటు దీనిపై కసరత్తుచేసిన తర్వాత తిరిగి బస్సు యాత్ర ప్రారంభిస్తారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి.

Similar News