జగన్ మళ్లీ మొదలుపెట్టారా.....?

Update: 2018-12-19 01:30 GMT

ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాలు వెలువడ్డాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు సిద్దమవుతోంది. ఈనేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారనున్న ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరోమారు తలకెత్తుకోవాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ చేసింది ఒక ఎత్తు ఈ నాలుగైదు నెలలు ప్రజల్లోకి వెళ్లేది మరో ఎత్తుగా జగన్ భావిస్తున్నారు.

తొలినుంచి ఉద్యమిస్తున్నా.....

వాస్తవానికి తొలినుంచి ప్రత్యేక హోదా ఉద్యమం కోసం వైసీపీ పోరాడుతూనే ఉంది. వివిధ ప్రాంతాల్లో ధర్నాలు,జగన్ ఆమరణదీక్షలు, యువభేరిలు వంటి ఈ ప్రత్యేక హోదా కోసమే చేశారు. అయితే ఆ తర్వాత జగన్ పాదయాత్ర చేయడం ప్రారంభించడంతో దాదాపు ఏడాదికిపైగా హోదాపై ఉద్యమాన్ని వైసీపీ పక్కనపెట్టిందనే చెప్పాలి. అడపా దడపా వంచనపై దీక్షలంటూ హడావిడి చేయడం తప్ప జగన్ గైర్హాజరులో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని సీనియర్ నేతలు తీసుకెళ్లలేకపోయారన్నది వాస్తవం. దీంతో జగన్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు.

టీడీపీ, జనసేన దూకుడుకు.....

ఒకవైపు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదాను హైజాక్ చేసింది. బీజేపీతో నాలుగున్నరేళ్లు కలసి ఉండి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి గుడ్ బై చెప్పి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఆ పార్టీ ఉధృతం చేస్తోంది. ధర్మ పోరాట దీక్షల పేరిట హోదా వస్తేనే ఏపీ బాగుపడుతుందన్న నినాదాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అందుకున్నారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ మరింత ఉథృతం చేసేందుకు రెడీ అయ్యారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సయితం ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని నిర్ణయించారు. ఆయన రెండు రోజుల పాటు ఇదే అంశంపై నిరాహార దీక్షకు దిగే అవకాశముంది.

ఢిల్లీలో మహా ధర్నా....

ఈ నేపథ్యంలో జగన్ పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక హోదాతో పాటు విభజనచట్టంలో ఉన్న హామీలన్నింటినీ అమలుపర్చాలని ఢిల్లీ కేంద్రంగా ధర్నా చేయాలని జగన్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఇప్పటికే ప్రత్యేక హోదాకోసం ఆపార్టీ ఎంపీలు ఐదుగురు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని జగన్ భావిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంటుశీతాకాల సమావేశాలు జరుగుతున్నందున ఢిల్లీ వేదికగా మహాధర్నాకు ప్లాన్ చేయాలని జగన్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఈ నెల 28వ తేదీ ఈ ధర్నా ఢిల్లీలో చేపట్టే అవకాశముంది. ఈ ధర్నాకు రాజీనామా చేసిన ఎంపీలతో పాటు సీనియర్ నేతలు, నియోజకవర్గ ఇన్ ఛార్జులు హాజరుకావాలని జగన్ ఆదేశించారు.

Similar News