ఎన్నికల్లో గెలవడానికి ఎన్నో చేయాలి. అన్నింటికంటే ముందు సమర్ధులైన అభ్యర్ధులను ఎంపిక చేయడం సవాల్ తో కూడుకున్న వ్యవహారం. ఇందుకోసం ప్రధాన పార్టీలు పలు రకాలైన మార్గాలను అన్వేషిస్తూంటాయి. వైసీపీ విషయానికి వస్తే ఎమ్మెల్యే అభ్యర్ధుల ఎంపిక కోసం పరిశీలకులను పంపబోతోందట. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పరిశీలకుడు త్వరలో రాబోతున్నారు. వీరు కొన్నాళ్ళ పాటు అక్కడ ఉండి పరిస్థితిని అధ్యయనం చేసి అధినేతకు సమగ్ర నివేదిక ఇస్తారని చెబుతున్నారు.
ఎవరికీ గ్యారంటీ లేదు...
ఇపుడున్న ఇంచార్జులతో సహా ఎవరికీ సీటు విషయంలో గ్యారంటీ లేదని వైసీపీ అధినాయకత్వం అప్పుడే స్పష్టంగా చెప్పేస్తోంది. దీంతోఎన్నికల నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యే వరకూ గెలుపు గుర్రాల వేట సాగుతూనే ఉటుందని కూడా వైసీపీ నేతలకు అర్ధమవుతోంది. ఈ సారి ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా ఉండడంతో వైసీపీ హైకమాండ్ ఆచీ తూచీ వ్యవహరిస్తోంది. ఎక్కడ తప్పటడుగు వేసినా అది వ్యతిరేక ఫలితాలను ఇస్తుందని భావిస్తోంది. అందువల్లనే కచ్చింతంగా గెలుస్తాడు అన్న వారే తమ ఎమ్మెల్యే అభ్యర్ధులని చెబుతోంది.
రేసులో ఎందరో...
వైసీపీ టికెట్ కోసం ఇపుడు విశాఖ జిల్లాతో సహా ఉత్తరాంధ్రలో ప్రతి అసెంబ్లీ సీటుకు కనీసం నలుగుగు పోటీ పడుతున్నారు. అవసరమైతే ఇంచార్జిలను సైతం తప్పిస్తామని అధినాయత్వం చెబుతూండంతో ఎవరికి వారు ప్రయత్నాలు గట్టిగా చేసుకుంటున్నారు. దీంతో పరిశీలకులకు తలకు మించిన భారమే పడనుందంటున్నారు. ఇంచార్జితో పాటు, రేసులో ఉన్న వారి జాతకాలు అన్నీ జత చేసి మరీ నివేదిక ఇవ్వాల్సివస్తోంది. ఇక పరిశీలకుడి మీద ఆశావహులు వత్తిడి తెచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి.
ఇంఛార్జుల్లో కలవరం....
అధినాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రస్తుతం ఉన్న వైసీపీ ఇంచార్జుల్లో కలవరం రేపుతోంది. తామే రేపటి ఎమ్మెల్యే అభ్యర్ధులమని వారంతా భావిస్తున్నారు. ఇపుడు మళ్ళీ బయోడేటాలు, జాతకాలు అంటూ పరిశీలకులను రంగంలోకి దింపితే తమకు చాన్స్ వస్తుందా అని వారు తల్లడిల్లుతున్నారు. తామే పోటీ చేస్తామని భావించి ఇబ్బడి ముబ్బడిగా పెడుతున్న ఖర్చు కూడా వృధా అయిపోతుందని మధనపడుతున్నారు. మరో వైపు తరచూ ఇంచార్జులను మార్చడం, కొత్త వారిని ఎన్నికల వేళ ఎమ్మెల్యే అభర్ధులుగా పెట్టడం వల్ల ఆశించిన ప్రయోజనం సమకూరకపోగా చేదు ఫలితాలు వస్తాయని కూడా పార్టీ నాయకులు అంటున్నారు.