జంకే వెంకటరెడ్డి. ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై విజయం సాధించిన నాయకుడు. అవినీతి రహితుడిగా ముద్ర వేసుకున్న ఈయనకు స్థానికంగా మంచి పేరుంది. పైగా పెద్దాయనగా స్థానికులు ప్రేమగా పిలుచుకుంటున్నారు. అయితే, ఏది ఎలా ఉన్నా.. వచ్చే ఎన్నికలు మాత్రం సామాన్యంగా లేవు. రాష్ట్రంలో ప్రతి సీటును ప్రాణ సమానంగా పార్టీలు భావిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ మరింత తీవ్రంగా తీసుకుంటోంది. దీంతో ప్రకాశంలో ఆపరేషన్ వైసీపీని రెండు మూడు రోజుల్లోనే ప్రారంభించాలని జగన్ భావిస్తున్నారు. ఈక్రమంలో కీలకమైన స్థానాల్లో వైసీపీని బలోపేతం చేయడం, కుదిరితే జిల్లా వ్యాప్తంగా కూడా బలాన్ని చూపించేందుకు కూడా జగన్ భావిస్తున్నారు.
చురుకుదనం లేకపోవడంతో....
ఈ క్రమంలోనే కొందరు సిట్టింగులకు కూడా ఆయన శ్రీముఖం చూపించాలని ఇప్పటికే నిర్ణయించారు. నిజానికి జంకేను పరిగణనలోకి తీసుకుంటే.. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ నేత కందుల నారాయణ రెడ్డిపై దాదాపు 9 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. ఎప్పుడో 1994లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన జంకే 20 ఏళ్లకు తిరిగి 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, ప్రజల్లో మాత్రం ఈయన పెద్దగా చురుకుదనం ప్రదర్శించలేకపోతున్నారు. పార్టీ కార్యక్రమాలు కానీ, ప్రభుత్వాన్ని విమర్శించడంలోనూ వెనుకబడ్డారనే విషయం జగన్ చేయించిన సర్వేల్లోనూ స్పష్టమైంది. దీంతో ప్రజల్లో ఒకింత వ్యతిరేకత కనిపిస్తోంది.
నిధులన్నీ టీడీపీ ఇన్ ఛార్జికే....
దీనికి తోడు ఇక్కడ టీడీపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన కందుల నారాయణ రెడ్డి బలంగా ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈయనే అప్రకటిత ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారు. అయినా కూడా జంకే మాత్రం ఈయనకు అడ్డుకట్ట వేయలేక పోతున్నారు. ఎమ్మెల్యే నిధులను కూడా కందులకే ప్రభుత్వం ఇటీవల కేటాయించింది. దీంతో ఆయన గ్రామాల్లో రోడ్లు వేయించి వాటిని ఆయనే ప్రారంభించారు. ఇదిలావుంటే, మంత్రి శిద్దా రాఘవరావు కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నిక్లలో ఆయన కుమారుడిని కుదిరితే ఇక్కడ నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు.
అందుకే ఆయనను పక్కన పెడతారా?
ఆర్థికంగా శిద్ధా ఫ్యామిలీ బలంగా ఉంది. మార్కాపురంలో 20 వేల పై చిలుకు ఉన్న వైశ్య సామాజికవర్గం ఓటర్లతో పాటు టీడీపీ సాంప్రదాయ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని వచ్చే ఎన్నికల్లో ఇక్కడ శిద్ధా తనయుడు సుధీర్ అయితే గెలుస్తాడని టీడీపీ లెక్కలు వేసుకుంటోంది. ఇదే జరిగితే.. జంకేకు గెలుపు సులువు కాదు. జంకే ఆర్థికంగా స్ట్రాంగ్‌గా లేరన్న టాక్ కూడా ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న జగన్ .. ఇక్కడ మార్పు ఖాయమనే సంకేతాలు పంపారు. అయితే, ఎవరు రంగంలోకి దిగుతారనే విషయం ఇప్పటికిప్పుడు తెలియక పోయినా.. జంకేకు రిటైర్ మెంట్ ప్రకటించి.. ఆయనకు ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం మాత్రం జరుగుతోంది. దీంతో ఇక్కడ వైసీపీ నాయకులు క్యూకడుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.