ఇక్కడ వైఎస్ వ్యూహం ఉండాల్సిందే...!!!

Update: 2018-12-16 01:30 GMT

తూర్పు గోదావరి జిల్లా ప్రతి రాజకీయ పార్టీకి కీలకం. ఇక్కడ ఎవరు అత్యధిక స్థానాలను గెలుచుకుంటే వారే అధికార పీఠాన్నిఎక్కతారు. అందుకోసమే తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్, జనసేనపార్టీలు తూర్పులో పట్టు నిలుపుకునేందుకు విపరీతంగా శ్రమిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి తూర్పు గోదావరిజిల్లాకంచుకోట అనే చెప్పాలి. అక్కడ బలమైన కాపు సామాజిక వర్గం గెలుపోటములను ఖరారు చేస్తుంది. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఆదరణ లభించకపోవడం వల్లనే అధికారానికి దూరమయింది. అయితే జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రకు తూర్పు గోదావరి జిల్లాలో విశేష స్పందన లభించింది. రెండు నెలల పాటు తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన పాదయాత్ర సక్సెస్ కావడంతో వైసీపీ శ్రేణుల్లో గెలుపు ధీమా కన్పించింది.

వైఎస్ కు బలమైన అనుచరులు....

అయితే జగన్ తూర్పులో పట్టు కోసం అనుసరిస్తున్న వ్యూహాలు ఎంతమేరకు పనిచేస్తాయన్నది ఆ ప్రాంత నేతలకూ అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా కో-ఆర్డినేటర్లను, నియోజకవర్గ ఇన్ ఛార్జులను మారస్తుండటంతో కొంత అయోమయంలో ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2004, 2009, ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ కు ఈ జిల్లాలో ఆదరణ ఉంది. అయితే 2014 ఎన్నికల్లో మాత్రం వైఎస్ నాటి పరిస్థితులు వైసీపీకి ఇక్కడ లభించలేదు. తెలుగుదేశం పార్టీవైపే మొగ్గు చూపారు. వైఎస్ కు ఇక్కడ బలమైన అనుచరులుండేవారు. ఉండవల్లి అరుణ్ కుమార్, జక్కంపూడిరామ్మోహన్ వంటి నేతలు వైఎస్ ఆదేశాలతో జిల్లాలో పార్టీ నేతలను గాడిన పెట్టే వారు. కానీ ఇప్పుడు వైసీపీ లో ఆపరిస్థితిలేదు.

జనసేన ఎంట్రీతో....

వైఎస్ అందరితోనూ కలుపుకుని వెళుతూ విభేదాలున్నా సత్వరం పరిష్కరించేవారంటారు. 19 శాసనసభ నియోజకవర్గాలున్న జిల్లా కావడంతో ఆయన ప్రత్యేక దృష్టి పెట్టేవారంటారు. కాని ఇప్పుడు వైసీపీలో ఇక్కడ సరైన నేత కన్పించడం లేదు. జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కూడా పార్టీలో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ జిల్లాపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. తన సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో ఎక్కువ సీట్లు వస్తాయని భావిస్తూ ఆయన తరచూ జిల్లాకు వచ్చిపోతున్నారు.కాని వైసీపీలో మాత్రం ఇక్కడ భిన్నమైన పరిస్థితి కన్పిస్తోంది. ఈ జిల్లాలో వచ్చే ఎన్నికలలో త్రిముఖ పోటీ ఖాయంగా కన్పిస్తుంది.ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనే అన్నది పక్కా అని తేలిపోయింది.

డీలా పడిన నేతలను...

కానీ ఇప్పటికే ముత్తాకుటుంబం పార్టీని వీడి జనసేనలో చేరిపోయింది. మరోవైపు కో-ఆర్డినేటర్లను మార్చడంకూడా పార్టీకి తలనొప్పిగా మారింది. మండపేటలో వైసీపీ జెండా మోసిన వేగుళ్ల లీలాకృష్ణ, ముమ్మడివరంలో పితాని బాలకృష్ణలు కూడా జనసేనలో చేరిపోయారు. ఇక పెద్దాపురంలో తోట సుబ్బారావునాయుడును కో-ఆర్డినేటర్ పదవినుంచి తొలగించడంతో ఆయన కూడా పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆయనను పార్టీ అధిష్టానం చివరిక్షణాల్లో బుజ్జగించింది. జగన్ పాదయాత్రను సొమ్ము చేసుకోవాల్సిన నేతలు ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ డీలా పడ్డారు. ఇప్పటికైనా జగన్ ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే త్రిముఖ పోటీలో వెనకబడక తప్పదు.

Similar News