గులాబీ ఎమ్మెల్యేల‌కు స‌రికొత్త టెన్ష‌న్‌

Update: 2018-05-19 04:30 GMT

గులాబీ బాస్, సీఎం కేసీఆర్ తీరుతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కేసీఆర్ షాకింగ్ నిర్ణ‌యాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ? కూడా ఎవ్వ‌రికి అర్థం కావ‌న్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస స‌ర్వేల‌తో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల‌ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోన్న కేసీఆర్ కొద్ది రోజుల క్రితం ప‌నితీరు స‌రిగా లేని వారికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్లే ఉండ‌వ‌ని చెప్పారు. ఈ లిస్టులో మంత్రులు కూడా ఉన్నట్టు లీకులు ఇచ్చారు. త‌ర్వాత ఏమైందో గాని నూటికి నూరుశాతం వ‌చ్చే ఎన్నిక‌ల్లో సిట్టింగుల‌కే సీట్ల‌ని మ‌ళ్లీ వాళ్ల‌లో ఆశ‌లు రేపారు. ఇక ఇప్పుడు మ‌రోసారి ఎమ్మెల్యేల గుండెళ్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి.

ఊపిరి పీల్చుకున్న తర్వాత....

సిట్టింగుల‌కే టికెట్లు ఇస్తానంటూ కేసీఆర్ ప్ర‌క‌టించగానే.. హ‌మ్మ‌య్యా.. అంటూ ఊపిరిపీల్చుకున్న ఎమ్మెల్యేల‌కు మ‌రో కొత్త టెన్ష‌న్ ప‌ట్ట‌కుంది. సిట్టింగులంద‌రికీ టికెట్లు ఇస్తామ‌ని కేసీఆరే స్వ‌యంగా చెప్పిన త‌ర్వాత వారికి టెన్ష‌న్ ఎందుక‌ని అనుకుంటున్నారా..? నిజంగానే వారికి పంచాయ‌తీ ఎన్నిక‌ల రూపంలో మ‌రో ప‌రీక్ష పెట్టేందుకు సీఎం కేసీఆర్ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఇలా మొద‌టి నుంచీ స‌ర్వేలు, గ్రేడింగ్స్‌.. త‌దిత‌ర అంశాల‌తో సీఎం కేసీఆర్ ఏదోఒక ప‌రీక్ష పెడుతూనే ఉన్నారు. ఓవైపు అంద‌రికీ టికెట్లు ఇస్తామ‌ని పైకి చెబుతూనే లోలోప‌ల ఆయ‌న చేసేదంతా చేస్తున్నారు.

పంచాయతీ ఎన్నికలకు సిద్ధం....

తెలంగాణ ప్ర‌భుత్వం అనేక సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంది. వ‌చ్చే జూలై నాటికి పంచాయ‌తీ పాల‌క‌వ‌ర్గాల గ‌డువు ముగుస్తుండ‌డంతో ఈ లోపే పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. అయితే ఈ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి, వచ్చే అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు మార్గం సుగ‌మం చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్నారు. కానీ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం కేసీఆర్ నిర్ణ‌యాన్ని అస‌లే ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కంటే ముందే పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని వారు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు.

ఈ ఎన్నికలు సవాల్.....

పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల ఎంపిక ఆయా నియోజ‌క‌వ‌ర్గా ఎమ్మెల్యేల‌కు అగ్ని ప‌రీక్ష లాంటిదే. ఇప్ప‌టికే మంచి జోష్ మీదున్న టీఆర్ఎస్ పార్టీ నుంచి బ‌రిలోకి దిగేందుకు విప‌రీత‌మైన పోటీ ఉండ‌డం ఖాయం. ఈ నేప‌థ్యంలో ఆశావ‌హులంద‌రినీ ఒప్పించ‌డం చాలా క‌ష్ట‌మైన విష‌యం. ఒక‌రికి టికెట్ ఇస్తే మ‌రొక‌రు పార్టీకి ముఖ్యంగా ఎమ్మెల్యేకు దూర‌మ‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. అంతేగాకుండా.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ఎస్ బ‌ల‌రిచిన, తాము ప‌ట్టుబ‌ట్టి టికెట్లు ఇప్పించుకున్న అభ్య‌ర్థులు ఓడిపోతే.. అది వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని ఎమ్మెల్యేలు ఆందోళ‌న చెందుతున్నారు. అంతేగాకుండా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ టికెట్ల‌కు పంచాయ‌తీ ఎన్నిక‌లు ఎస‌రు పెడుతాయ‌ని కూడా ప‌లువురు గులాబీ ఎమ్మెల్యేలు తీవ్ర ఒత్తిడికి గుర‌వుతున్నారు. సాధార‌ణ ఎన్నిక‌ల త‌ర్వాత పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కోరుతున్న‌ట్లు తెలుస్తోంది.

Similar News