ముందస్తు వ్యూహాలతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూసుకుపోతున్నారు. మరో రెండు నెలల్లోనే ఎన్నికలు అంటూ పార్టీ శ్రేణులను పరుగులు పెట్టిస్తున్నారు. గులాబీ దండు గ్రామాల్లోనే ఉండటంతో.. టీఆర్ఎస్ జెండాలతో పల్లెలు రెపరెపలాడిపోతున్నాయి. ఇక ప్రతిపక్షాలు కూడా 'మహా కూటమి'గా ఒకే గొడుగు కిందకు చేరిపోతున్నాయి. కాంగ్రెస్ మినహా.. మిగిలిన పార్టీలకు ఉన్నది అంతంతమాత్రమైన బలమే! టీడీపీ, సీపీఎం, సీపీఐ, ఉద్యమ నేత కోదండరామ్ టీజేఎస్ పేర్లు వినిపిస్తున్నా.. వాటికి క్షేత్ర స్థాయిలో అంత బలం లేదనే చెప్పుకోవాలి. కానీ మహా కూటమి పేరు చెబితేనే టీఆర్ఎస్ కీలక నేతలు మండిపడుతున్నారు. కూరలో కరివేపాకులా తీసిపారేసిన పార్టీలపై ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్, హరీశ్‌రావ్, కవిత విమర్శలు గుప్పిస్తున్నారు. మహాకూటమి అదో దుష్టచతుష్టయం అంటూ ఎద్దేవా చేస్తున్నారు. మహాకూటమిగా కట్టినా కనీస సీట్లు కూడా రావంటూ ఆరోపిస్తున్నారు. తమ సర్వేల్లోనూ టీఆర్ఎస్‌కే 100 సీట్లు కంటే ఎక్కువే వస్తాయని తేలినప్పుడు.. వీరంతా ఎందుకు మహాకూటమిని టార్గెట్ చేస్తున్నారనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది.
పెద్దన్నలా వ్యవహరిస్తూ.......
కాంగ్రెస్.. మహాకూటమికి పెద్దన్నలా వ్యవహరిస్తున్న పార్టీ! టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇస్తున్నది ఇదొక్కటే! ఇక మహాకూటమిలో రెండో పెద్ద పార్టీ టీడీపీ. 'టీడీపీనా..ఆ పార్టీ ఉందా తెలంగాణలో? ఏ సర్వే చేసినా కూడా ఒక శాతం కూడా లేదు ఆ పార్టీకి ఓటింగ్' అంటూ కూరలో కరివేపాకులా.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ రద్దు తర్వాత టీఆర్ఎస్ భవన్‌లో విలేకరులతో చేసిన వ్యాఖ్య! సీపీఐ, సీపీఎం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కొన్ని ప్రాంతాల్లో మినహా.. వారి బలం అంతంతమాత్రమే! ఇక మిగిలింది కోదండరాం.. తెలంగాణ జనసమితి-టీజేఎస్. 'కోదండరాం ఏ నాడు అయినా సర్పంచ్ గా గెలిచిండా?. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. నేను నాయకుడిని చేసినా' ఇవీ కొద్ది కాలం క్రితం ప్రస్తుత టీజెఎస్ అధ్యక్షుడు కోదండరాంనుద్దేశించి టీఆర్ఎస్ అధినేత చేసిన వ్యాఖ్యలు. సరే ఇవన్నీ నిజమే అయితే టీఆర్ఎస్ నేతల్లో ఎందుకు అంత ఆందోళన కనిపిస్తోందనేదే ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న!
అనైతిక పొత్తు అంటూ......
మహాకూటమి టార్గెట్‌గా కేటీఆర్, కవిత, హరీశ్‌రావ్, ఇతర కీలక నేతలు వరుసగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అనైతిక పొత్తులు పెట్టుకుంటున్నాయని, ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించిన టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటోందంటూ ఊదరగొడుతున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నందుకు కాంగ్రెస్‌కు కార్నర్ చేసి.. దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి అసలు ఏ మాత్రం బలం లేని పార్టీలని చూసి వీరంతా ఎందుకు అంత కంగారు పడుతున్నారు? ఒక శాతం కూడా ఓటు బ్యాంకులేని టీడీపీ మహాకూటమిలో ఉంటే టీఆర్ఎస్ కు వచ్చే నష్టమేంటి? మహాకూటమి కచ్చితంగా టీఆర్ఎస్ గెలుపు అవకాశాలను భారీగా దెబ్బతీసే అవకాశం ఉండటంతోనే గత కొన్ని రోజులుగా కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ కవితలు కోదండరామ్ తో పాటు టీడీపీని టార్గెట్ చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కోదండరాంకు చెందిన టీజేఎస్, టీడీపీలతో కాంగ్రెస్ పొత్తునే ఓ పెద్ద అస్త్రంగా చేసుకుని టీఆర్ఎస్ విమర్శల స్పీడ్ పెంచింది.
అంత భయం లేకపోతే......
కేసీఆర్ చెప్పినట్లు సర్పంచ్ గా గెలవలేని కోదండరాం ఎవరితో పొత్తు పెట్టుకుంటే టీఆర్ఎస్ కు ఏమి అవుతుంది? ఒక్క శాతం ఓటు కూడా లేని టీడీపీ కాంగ్రెస్ తో కలిస్తే టీఆర్ఎస్ కు జరిగే నష్టం ఏముంటుందనేది విశ్లేషకుల ప్రశ్న! నిజంగా ఈ మహాకూటమిపై ఏ మాత్రం భయం లేకపోతే ఏ మాత్రం బలం లేదని భావిస్తున్న పార్టీలను టార్గెట్ చేయటం వెనక మతలబు ఏమిటి? క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ కు పరిస్థితి ఏ మాత్రం అనుకూలంగా లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మరోసారి సెంటిమెంట్లను రాజేసి ఎన్నికల్లో గెలించేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది గులాబీ పార్టీ. అందుకే కాంగ్రెస్ గెలిస్తే ఢిల్లీకి గులాంలు..టీడీపీ గెలిస్తే అమరావతికి గులాంలు అంటూ కొత్త పల్లవి అందుకుంది. మరి కూటమి బలం గులాబీ నేతలకు అర్థమయ్యే ఇలా.. సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఇది ఎంత వరకూ ఫలితాన్నిస్తుందో వేచిచూడాల్సిందే!