ఐదేళ్ల వరకూ వారు అంతేనట

అవును! రాజ‌కీయాల్లో అధికారం ఉన్నప్పుడు మాత్రమే తెర‌మీదికి వ‌చ్చే క‌రెంటు పురుగులు చాలా మందే నేటి రాజ‌కీయాల్లో ఉన్నారు. పార్టీలు ఇబ్బందుల్లో ఉన్నా.. ఆ క‌ష్టాలు పంచుకుని [more]

Update: 2019-10-07 14:30 GMT

అవును! రాజ‌కీయాల్లో అధికారం ఉన్నప్పుడు మాత్రమే తెర‌మీదికి వ‌చ్చే క‌రెంటు పురుగులు చాలా మందే నేటి రాజ‌కీయాల్లో ఉన్నారు. పార్టీలు ఇబ్బందుల్లో ఉన్నా.. ఆ క‌ష్టాలు పంచుకుని పార్టీల‌ను నిల‌బెట్టుకునే సంస్కృతి దాదాపు నేటి నేత‌ల్లో చాలా చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తోంది. ఒక‌ప్పుడు పార్టీ అంటే.. ప్రాణం ఇచ్చే నాయ‌కులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌నిపించారు. త‌మ ఇంటి పేరులోనే పార్టీల పేర్లు చేర్చుకున్న నాయ‌కులు కూడా ఉన్నారు. అలాంటి తెలుగు నేల‌పై ఇప్పుడు వ‌చ్చిన నూత‌న త‌రం నాయ‌కులు పార్టీల‌ను శాసించే స్థాయికి ఎదిగారు.

భజన చేసిన వారు….

నిన్న మొన్నటివ‌ర‌కు టీడీపీ భ‌జ‌న చేసిన చాలా మంది త‌మ్ముళ్లు.. ఇప్పుడు ప‌త్తా లేకుండా పోయారు. నిజానికి పార్టీకి అండ‌గా ఉంటామ‌ని, క‌ష్టాల్లో చంద్ర‌బాబును ఆదుకుంటామ‌ని, పార్టీని నిల‌బెట్టుకుంటామ‌ని చెప్పిన వారే.. త‌ర్వాత కాలంలో జ‌గ‌న్ సునామీ ముందు క‌కావిక‌ల‌మైపోయిన పార్టీని ప‌ట్టించుకోవ‌డం మానేశారు. వీరిలో ప్రతి జిల్లాకు క‌నీసం ఒక‌రు చొప్పున క‌నిపిస్తున్నారు. వీరంతా చంద్రబాబు అధికారంలో ఉండ‌గా ఆయ‌న‌కు ఎన‌లేని భ‌జ‌న చేసిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. కొంద‌రైతే.. చంద్రబాబు నుంచి ప‌ద‌వులు ద‌క్కించుకున్న వారు కూడా ఉన్నారు. కానీ, ఇప్పుడు పార్టీ క‌ష్టాల్లో ఉండ‌డంతో వీరంతా ముఖం చాటేస్తున్నారు.

వీరంతా ఎక్కడ?

వీరిలో ప‌ల‌మ‌నేరు మాజీ ఎమ్మెల్యే అమ‌ర‌నాథ్‌రెడ్డి, ఆదినారాయ‌ణ‌రెడ్డి, జేసీ బ్రద‌ర్స్ స‌హా గుంటూరులోని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్‌, పితాని స‌త్యనారాయ‌ణ‌, జ‌లీల్‌ఖాన్‌, ప‌రిటాల కుటుంబం ఇలా చెప్పుకొంటూ పోతే చాలా మంది టీడీపీలో ఇప్పుడు ఉండడం వృధా అనే తీర్మానానికి వ‌చ్చేశారు. నిజానికి వీరంద‌రినీ చంద్రబాబు న‌మ్మారు. అధికారం అనేది వ‌స్తుంది .. పోతుంది.. కానీ, పార్టీ, సిద్దాంతాలు ప్రధానం అనుకున్నారు. కానీ, ఈ నాయ‌కులు మాత్రం చంద్రబాబుకు ఇప్పుడు హ్యాండిచ్చారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొంద‌రు ఇప్పటికే పార్టీలు మారిపోయేందుకు ప‌క్కచూపులు చూస్తున్నారు.

పదవులు పొంది మరీ…..

ఇక జ‌లీల్‌ఖాన్ అస‌లు త‌న‌కు రాజ‌కీయం ఎందుకు ? అన్నట్టుగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఆదినారాయ‌ణ‌రెడ్డి చంద్రబాబు అధికారంలో ఉండ‌గా మంత్రి ప‌ద‌వి చేప‌ట్టడంతో పాటు క‌డప జిల్లా రాజ‌కీయాల‌ను శాసించారు. ఇప్పటి సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై తీవ్రమైన విమ‌ర్శలు చేసేవారు. అలాంటి నేత ఇప్పుడు టీడీపీకి గుడ్ బై చెప్పేసి బీజేపీలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇక పితాని చూపులు వైసీపీ మీద ఉన్నాయి. ప‌రిటాల కుటుంబానికి చంద్రబాబు రాఫ్తాడుతో పాటు ధ‌ర్మవ‌రం రెండు నియోజ‌క‌వ‌ర్గాలు బంప‌ర్ బొనంజాగా ఇచ్చినా వాళ్లు కూడా ఇప్పటి నుంచే బ‌య‌ట‌కు వ‌చ్చి ఆప‌సోపాలు ప‌డ‌డం ఎందుకు ? అన్నట్టుగా ఉన్నారు.

ఐదేళ్లు వెయిట్ చేయడం..?

ఇక న‌రేంద్ర పార్టీ అధికారంలో ఉండ‌గా తాను ఎంత‌గా ఫైట్ చేసినా చంద్రబాబు ప‌ద‌వులు ఇవ్వక‌పోవ‌డంతో తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. ఇక జేసీ బ్రద‌ర్స్‌కు అధికారం లేక‌పోతే నిద్ర ప‌ట్టదు. గ‌త 15 ఏళ్లుగా 10 ఏళ్లు కాంగ్రెస్‌లో.. ఆ త‌ర్వాత టీడీపీలో అధికారం వెల‌గ‌పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు మ‌ళ్లీ అధికారం కోసం అర్రులు చాస్తున్నారు. ఇలా వీరే కాదు టీడీపీలో చాలా మంది ఇప్పుడు ఐదేళ్లు ప్రతిప‌క్షంలో ఉండి రాజ‌కీయం చేయ‌డం ఇష్టం లేక బ‌య‌ట‌కు రాక‌పోవ‌డ‌మో ? లేదా ప‌క్కదారులు చూడ‌డ‌మో చేస్తున్నారు.

Tags:    

Similar News