టీడీపీ సీనియర్ నేతల్లో ఒకరు అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్! పార్టీలో ఎన్టీఆర్ హయాం నుంచి ఈయన కొనసాగుతున్నారు. తనకు ప్రాధాన్యం ఉన్నా లేకపోయినా.. ఆయన ఏనాడూ పార్టీని విడిచి పెట్టకపోవడం గమనార్హం. ఆయనకు మంత్రిపదవిపై ఎనలేని మక్కువ. అయితే, ఇప్పటి వరకు ఆయనకు ఇది దక్కలేదు. అయినా కూడా పార్టీని మారకుండా పనిచేస్తూ పోతున్నారు. అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన పయ్యావుల కేశవ్ 1994లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత మళ్లీ 2004, 2009 ఎన్నికల్లోనూ ఆయన గెలుపొందారు. అయితే, విచిత్రంగా ఆయన గెలుపొందిన ప్రతిసారీ.. టీడీపీ ప్రతిపక్షంగా ఉండడమో.. లేదా ఏదైనా ప్రమాదంలో పడడమో జరిగింది. 1994లో పయ్యావుల ఉరవకొండ నుంచి గెలుపొందిన సమయంలో పార్టీలో తీవ్ర సంక్షోభం తలెత్తింది. అప్పటి సీఎం ఎన్టీఆర్ పదవీచ్యుతుడు అయ్యాడు. ఆ తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.
పార్టీ అధికారంలోకి వస్తే.....
1999లో చంద్రబాబు గెలిచి అధికారంలోకి వచ్చారు. అయితే పయ్యావుల మాత్రం ఉరవకొండలో ఓడిపోయారు. ఇక, 2004 ఎన్నికల్లో తిరుపతి నక్సల్స్ దాడి సెంటిమెంట్‌తో తిరిగి అధికారంలోకి వద్దామని ప్రయత్నించిన చంద్రబాబుకు ఎదురు దెబ్బతగిలింది. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన పయ్యావుల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక, ఆ తర్వత ఎన్నికల్లోనూ పయ్యావుల గెలిచాడు.. కానీ, టీడీపీ ప్రతిపక్షానికే పరిమితమైంది. 2004, 2009లో పయ్యావుల వరుసగా రెండుసార్లు గెలిచినా రెండు ఎన్నికల్లోనూ టీడీపీ అధికారంలోకి రాలేదు. 2009లో కేవలం 300 ఓట్లతో మాత్రమే ఆయన గెలిచారు.
గత ఎన్నికల్లో ఓటమిని చూసి.....
ఇక, గత 2014 ఎన్నికల్లో ఉరవకొండ నుంచి పోటీ చేసిన పయ్యావుల కేశవ్.. వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి పయ్యావులను ఓడించారు. ఇలా పయ్యావులకు ప్రతిసారీ.. మంత్రి పదవి గండంగా మారింది. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో అయినా గెలుపొంది.. తన కల సాకారం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన దైన శైలిలో ముందుకు పోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం శాసన మండలి సభ్యుడిగా, ప్రబుత్వ విప్‌గా ఉన్న ఆయన నియోజకవర్గంపై రోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. అదేసమయంలో ప్రజలతో మమేకం అయ్యేందుకు వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాడు.
శివరామిరెడ్డి సహకరిస్తారా?
పయ్యావుల విషయంలో ఇది ఒక భాగమైతే.. మరో కీలక భాగం కూడా ఆయనను గెలిపించే సూత్రంగా మారిందని అంటున్నారు పరిశీలకులు. ఇక్కడ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయన ఇదే టికెట్‌ను ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన పయ్యావులను ఓడించేందుకు నియోజకవర్గం వైసీపీ నేత, ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్న శివరామిరెడ్డి.. విశ్వేశ్వరరెడ్డికి పూర్తిగా సహకరించాడు. దీంతో విశ్వేశ్వరరెడ్డి గెలుపు నల్లేరుపై నడకలా సాగిపోయింది. అయితే, ఎన్నికల అనంతరం ఈ ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు నెలకొన్నాయి. దీనికి ప్రధాన కారణం.. 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి తాను పోటీ చేయాలని శివరామిరెడ్డి భావించడమే.
ఇద్దరి మధ్య విభేదాలతో....
అయితే, తాను అధికార పార్టీ నుంచి ఎన్నో ఎదురు దెబ్బలు తింటున్నానని, పార్టీ తరఫున గళం వినిపిస్తున్నానని, కాబట్టి తనకే మరోసారి టికెట్ ఇవ్వాలని విశ్వేశ్వరరెడ్డి బహిరంగంగానే పేర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరిపోయాయి. దీంతో ఈ పరిణామం వైసీపీలో చిచ్చు పెడుతోంది. కార్యకర్తలు, కేడర్ కూడా ఎవరికి మద్దతివ్వాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీనిని పయ్యావుల తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఆయనకు కలిసొచ్చే అవకాశమని అంటున్నారు పరిశీలకులు. మొత్తంగా పయ్యావుల గెలుపు మంత్రంలో 75% వైసీపీలో నెలకొన్న ఘర్షణలే ఉన్నాయని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.