రాజకీయాల్లో వివిధ రంగాల వారి రాక బాగా ఎక్కువ అవుతోంది. డాక్టర్లు ఇపుడు పాలిటిక్స్ వైపు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. విశాఖ జిల్లాలో ఇప్పటికే ఓ ప్రముఖ డాక్టర్ వైసీపీ తరఫున విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీకి రెడీ అవుతూంటే కొత్తగా పెట్టిన జనసేన నుంచి మరో మహిళా డాక్టర్ పొలిశెట్టి సునీత పోటీ చేయాలనుకుంటున్నారు. ఆమె విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలో ఉండాలనుకుంటున్నారు. ఆ మధ్యన పవన్ ఉత్తరాంధ్ర టూర్లో భాగంగా విశాఖలో విడిది చేసినపుడు ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. పవన్ ఆ తరువాత ఆమెకు పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ పదవి ఇచ్చి గుర్తింపు కూడా ఇచ్చారు. పార్టీలో ఆమె చురుకుగా ఉంటూ ఎమ్మెల్యే సీటును ఆశిస్తున్నారు.
ఇద్దరు బలమైన ప్రత్యర్ధులు....
విశాఖ పశ్చిం విషయానికి వస్తే ఇద్దరు బలమైన ప్రత్యర్ధులను జనసేన నాయకురాలు డాక్టర్ పొలిశెట్టి సునిత ఎదుర్కోవాల్సి ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే , అధికార టీడీపీకి చెందిన ప్రభుత్వ విప్ గణబాబు నియోజకవర్గంలో బాగానే ఆధిపత్యం సంపాదించారు. తన తండ్రి నుంచి రాజకీయ వారసత్వం పుచ్చుకున్న గణబాబు రెండు మార్లు ఎమ్మెల్యేగా నెగ్గి పట్టు సంపాదించుకున్నారు. ఇక ఆయన ప్రత్యర్ధిగా ఉన్న వైసీపీ నగర అధ్యస్ఖుడు మళ్ళ విజయప్రసాద్ ఒకమారు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. నియోజకవర్గంలో ఆయనకూ సొంత బలం ఉంది. ఈ ఇద్దరినీ ఎదుర్కోవడం కష్టమైన వ్యవహారమే. పైగా బలమైన సామాజిక వర్గాలు కూడా ఈ ఇద్దరూ కావడం, అర్ధబలం లో కూడా డీ కొట్టే స్థాయి ఉండడం తో జనసేన నాయకురాలు సునీత ఎంత వరకూ పై చేయి సాధిస్తారన్నది చూడాలి.
కాంగ్రెస్ నుంచి చూపు...
ఇక్కడ సీటు కోసం కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బెహరా భాస్కర రావు కూడా రుమాలు వేశారని, జనసేనాని ఓకే అంటేనే పార్టీ తీర్ధం పుచ్చుకుంటారని కూడా టాక్ నడుస్తోంది. ఇక సునీత జనాలకు పెద్దగా పరిచయం అయిన మనిషి కాదన్న వాదన ఉంది. ఆమె డాక్టర్ గా తన పరిధిలో మాత్రమే పరిచయాలు కలిగి ఉన్నారని, ఆమెను ఎమ్మెల్యేగా ప్రమోట్ చేసి టికెట్ ఇచ్చినా ఆశించిన ఫలితాలు వస్తాయాన అన్న సందేహం పార్టీలోనూ ఉందని అంటున్నారు.
గ్లామర్ తో గెలవాలనుకుంటే....
ఇక ఆరు నెలల క్రితం ఆమెకు రాష్ట్ర స్థాయిలో కీలకమైన పదవి ఇచ్చినా ఇంతవరకూ నగరంలో కాదు కదా తన నియోజకవర్గంలోనూ పార్టీని బలోపేతం చేయలెదని ఆరోపణలు ఉన్నాయి. పవన్ గ్లామర్ తో గెలవాలనుకుంటే కుదిరే వ్యవహారం కాదని, అంగ బలం, అర్ధ బలం ఉండాలని, అలాంటి వారి కోసమే జనసేన వెతుకులాటలో ఉందని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. అయితే డాక్టరమ్మ గారికి మాత్రం ఎలాగైనా టికెట్ తెచ్చుకుని ఎమ్మెల్యే అయిపోవాలని ఉంది మరి. యాక్టర్ పార్టీలో ఈ డాక్టర్ కి చోటు ఉంటుందా అన్నది చూడాల్సిందే.