పెద్దిరెడ్డి త‌మ్ముడికి నాన్ లోక‌ల్ సెగ‌

Update: 2018-07-19 02:00 GMT

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ఎన్నికల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో వ్యూహ ప్ర‌తివ్యూహాల‌కు ప్రధాన రాజ‌కీయ పార్టీలు ప‌దును పెడుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ బ‌లంగా ఉన్న కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌పై టీడీపీ శ్రేణులు దృష్టిసారించాయి. ఆ పార్టీకి చెందిన కీల‌క నేత‌లే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్నాయి. జిల్లా రాజ‌కీయాల్లో వైసీపీకి పెద్ద‌దిక్కుగా ఉన్న పెద్దిరెడ్డికి ప్ర‌స్తుతం అటు పార్టీలోనూ, ఇటు బ‌య‌ట కొన్ని ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. కొడుకు మిధున్‌రెడ్డి టార్గెట్‌గా టీడీపీ ప్ర‌ణాళిక‌లు వేస్తుంటే మ‌రో ప‌క్క ఆయ‌న త‌మ్ముడికి పార్టీలో వ్య‌తిరేక‌ సెగ త‌గులుతోంది. ఈసారి టికెట్ ఆయ‌న‌కే కేటాయిస్తార‌ని భావిస్తున్న త‌రుణంలో ఆయ‌న నాన్ లోక‌ల్ అనే ప్ర‌చారంతో వ్య‌తిరేక‌వ‌ర్గం దూసుకెళ్ల‌డం.. మ‌రోప‌క్క మాజీ ఎమ్మెల్యేని పీకే టీమ్ క‌ల‌వ‌డం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది.

మాజీ ఎమ్మెల్యేను కలిసిన పీకే టీం

చిత్తూరు జిల్లా వైసీపీకి పెద్దిరెడ్డి అండ‌గా ఉంటున్నారు. పార్టీలో ఆయ‌న ఎంత చెబితే అంతే! ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి ఇప్ప‌టికే రాజంపేట ఎంపీగా గెలుపొందిన విష‌యం తెలిసిందే! ఆయ‌న త‌మ్ముడు ద్వార‌కానాథ్‌రెడ్డిని తంబ‌ళ్ల‌ప‌ల్లి నుంచి పోటీ చేయించేందుకు రెడీ అవుతున్నారు. అంతా స‌జావుగా జ‌రుగుతుందనుకున్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా జిల్లా రాజ‌కీయాలు హీటెక్కాయి. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో సీక్రెట్‌గా స‌ర్వేలు నిర్వ‌హిస్తూ.. అభ్య‌ర్థుల బ‌లాబ‌లాల‌పై అంచ‌నాలు వేస్తున్న పీకే టీంలోని కీల‌క స‌భ్యుడు మాజీ ఎమ్మెల్యే ప్ర‌వీణ్‌కుమార్‌ని క‌లుసుకోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 2009లో టీడీపీ నుంచి ప్ర‌వీణ్ తంబ‌ళ్ల‌ప‌ల్లి నుంచి పోటీచేసి గెలుపొందారు. 2014లో వైసీపీలో చేరారు. త‌ర్వాత అక్క‌డి నుంచే పోటీచేసి ఓడిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ నుంచి పోటీ చేసిన శంక‌ర్‌యాద‌వ్ గెలిచారు. అయితే రాజ‌కీయంగా పెద్దిరెడ్డిని ఎదుర్కోలేక పార్టీకి దూరంగా ఉంటున్నారు.

ఆయన నాన్ లోకల్ అంటున్న నేతలు

ఇదే స‌మ‌యంలో వైసీపీలో కీల‌క సామాజిక‌వ‌ర్గం లోక‌ల్, నాన్ లోక‌ల్ అంశం తెర‌పైకి తీసుకొచ్చింది. ద్వార‌కానాథ్‌రెడ్డి లోకల్ కాద‌ని పార్టీలో మ‌రో వ‌ర్గం బ‌లంగా ప్ర‌చారం చేస్తోంది. పార్టీలోని సీనియ‌ర్ నాయ‌కుడు మ‌ధుసూధ‌న్‌రెడ్డి.. ఈ అంశాన్ని బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళుతున్నారు. ప్ర‌స్తుతం ఇది ద్వార‌కానాథ్ రెడ్డికి మైన‌స్‌గా మారుతోంది. జిల్లాలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ హ‌వా ఎక్కువ‌వుతోందని...త‌మ‌కు అదే ఫ్యామిలీ నుంచి మ‌రో వ్య‌క్తిని రుద్ద‌డం ఎంత వ‌ర‌కు స‌మంజసం అని పార్టీలో కొంద‌రు అసంతృప్తి గ‌ళం విప్పుతున్నారు. దీంతో వైసీపీలో పెద్ద‌ గంద‌ర‌దోళం నెల‌కొంది.

Similar News