బాబుకు...నెల్లూరు వర్రీ....!

Update: 2018-05-02 12:30 GMT

రాజ‌కీయాల‌న్నాక అధికారం, ఆ వెంట‌నే ప‌ద‌వులు.. కామ‌న్‌గా జ‌రిగేది, జ‌రుగుతోంది ఇదే! రాజ‌కీయాల్లోకి ఎందుకొచ్చారు? అంటే ప్రజాసేవ అని పొర‌పాటున చెబుతున్నా.. దాని అసలు రంగు మాత్రం స్వసేవ‌! ఈ సేవ‌లో త‌రించేందుకు నేత‌ల మ‌ధ్య పోటీ తీవ్రంగానే క‌నిపిస్తోంది. నేత‌లు ఒక‌రిని మించి మ‌రొక‌రు పోటీ కూడా ప‌డుతున్నారు. నువ్వా.. నేనా అని త‌న్నుకుంటున్నారు కూడా! ఒక్క సీటు కోసం.. అధికార టీడీపీలో త‌న్నులాట‌లు .. కుమ్ములాట‌లు కూడా పెరిగిపోయాయి. మ‌రో ఏడాదిలోనే ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ ఎన్నిక‌ల‌ను అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీలు చాలా సీరియ‌స్‌గా తీసుకున్నాయి. అయితే, ఈ పార్టీల్లోని నేత‌లు మ‌రింత సీరియ‌స్‌గా తీసుకున్నార‌న‌డానికి నెల్లూరు ప‌ట్టణ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గమే తార్కాణంగా క‌నిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ భారీ స్థాయిలో సీట్లను కొల్లగొట్టింది. నేత‌లు అనుకున్న దాని క‌న్నా ఎక్కువ‌గానే ఫ్యాన్ గాలీ వీచింది. ఈ క్రమంలోనే నెల్లూరు అర్బన్‌, రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాలు రెండింటినీ కూడా వైసీపీ త‌న ఖాతాలో వేసుకుంది.

గతంలో మూడు సీట్లు....

గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో టీడీపీ కేవ‌లం వెంక‌ట‌గిరి, ఉద‌య‌గిరి, కోవూరు సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఈ మూడు సీట్లూ కూడా చాలా త‌క్కువ మెజార్టీతో మాత్రమే టీడీపీ గెలుచుకుంది. జిల్లాలో నెల్లూరు ఎంపీ సీటుతో పాటు 7 ఎమ్మెల్యే సీట్లు, నెల్లూరు మేయ‌ర్ సీటు కూడా వైసీపీ ఖాతాలో ప‌డ్డాయి. నెల్లూరు రూర‌ల్ విష‌యాన్ని ప‌క్కన‌పెడితే.. అర్బన్‌లో మాత్రం ఇప్పుడు అధికార పార్టీ నేత‌ల కుమ్ములాట‌లు, సీటు కోసం ఫీట్లు పెరిగిపోయాయి. నెల్లూరు అర్బన్‌లో అడుగు పెడితే.. త‌మ‌కు తిరుగు ఉండ‌ద‌ని, జిల్లా మొత్తంగా త‌మ ఆధిప‌త్యం చూపించుకోవ‌చ్చని నేత‌లు భావిస్తుండ‌డ‌మే దీనికి ప్రధాన రీజ‌న్‌గా క‌నిపిస్తోంది.

అనేక మంది పోటీ.....

ముఖ్యంగా నెల్లూరుకు చెందిన మంత్రి పొంగూరు నారాయ‌ణ‌.. త‌న ప్రాణాల‌న్నీ ఈ సీటుపైనే పెట్టుకున్నారు. గ‌త కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న త‌న గ్రాఫ్ ఎలా ఉందో కూడా ఇక్కడ త‌న అనుచ‌రుల‌తో స‌ర్వే కూడా చేయించుకున్నార‌ని వార్తలు వ‌చ్చాయి. అయితే, ఈ సీటుకు టీడీపీ నుంచి ఆయ‌న ఒక్కడే పోటీ ప‌డుతున్నాడంటే.. కుద‌ర‌దు.. మ‌రికొంత‌మంది టీడీపీ రాజ‌కీయ నారాయ‌ణులు ఈ టికెట్ కోసం త‌హ‌త‌హ లాడిపోతున్నారు. ప్రస్తుతం ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే పీ అనిల్ కుమార్ య‌ద‌వ్ ఉన్నారు. ఈయ‌న‌కు ప్రజాభిమానం, ప్రజ‌ల్లో ప‌లుకుబ‌డి, ప్రజ‌ల్లో సింప‌తీ కూడా బాగానే ఉన్నాయి. దీంతో ఈయ‌న‌ను ఓడించేందుకు, ఈ సీటును కైవ‌సం చేసుకునేందుకు స్థానిక టీడీపీ నేత‌లు క‌న్నేశారు.

ఒకరు కాదు...ఇద్దరు కాదు....

అయితే, ఈ టికెట్ కోసం ఒక‌రిద్దరు పోటీ ప‌డితే.. బాగుండేది. కానీ, టీడీపీ నుంచి నెల్లూరు అర్బన్ టికెట్ ఆశిస్తున్న వారి జాబితా రోజు రోజుకూ పెరుగుతోంది. మంత్రి పొంగూరు నారాయ‌ణ ప్రధాన పోటీదారుగా పైకి క‌నిపిస్తున్నా.. నెల్లూరు కార్పొరేష‌న్ మేయ‌ర్ అబ్దుల్ అజీజ్‌, మాజీ ఎమ్మెల్యే ముంగ‌మూరు శ్రీధ‌ర్ కృష్ణారెడ్డి, ఇటీవ‌ల మ‌ర‌ణించిన ఆనం వివేకానంద రెడ్డి కుమారుడు సుబ్బారెడ్డి, మాజీ మంత్రి తాళ్లపాక ర‌మేష్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డిలు తీవ్రంగా ఈ సీటు కోసం ప్రయ‌త్నాలు చేస్తున్నారు. దీంతో వీరిలో వీరికి విభేదాలు తార‌స్థాయికి చేరుతున్నాయి. ఒక‌రిపై ఒక‌రు యాంటీ ప్రచారానికి కూడా వెర‌వ‌ని ప‌రిస్థితి ఇక్కడ నెల‌కొందంటే.. ప‌రిస్థితి ఎంత సీరియ‌స్‌గా ఉందో ఇట్టే అర్దమ‌వుతుంది.

ఎవరికీ అంత సీన్ లేదా....?

అయితే, వీరిలో వారి వారి రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసుకుంటే గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ఆనం కుమారుడు సుబ్బారెడ్డి క‌నీసం డిపాజిట్ కూడా ద‌క్కించుకోలేని ప‌రిస్థితి ఉంది. ఆయ‌నకు కేవ‌లం 2 వేల ఓట్లే వ‌చ్చాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేయ‌డంతో ఆయ‌న్ను జ‌నాలు ప‌ట్టించుకోలేదు. ఇక‌, మంత్రి నారాయ‌ణ‌కు వ్యతిరేక ప‌వ‌నాలు బాగానే వీస్తున్నాయి. ఈయ‌న ఎవ‌రినీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, పార్టీ కేడ‌ర్‌ను బ‌లోపేతం చేయ‌కుండా కేవ‌లం ప్రజ‌ల‌నే న‌మ్ముకున్నార‌ని అంటున్నారు త‌మ్ముళ్లు. ఇక‌, మిగిలిన వారిలో ఒక‌రిద్దరిని ప్రజ‌లు ఎప్పుడో మ‌రిచిపోయార‌ని కూడా చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఒక్కసీటు కోసం ఐదుగురుకు మించి త‌న్నుకోవ‌డం ఎంత మేర‌కు సమంజ‌స‌మ‌నే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మ‌రి చంద్రబాబు ఎవ‌రిని డిసైడ్ చేస్తారో చూడాలి.

Similar News