కీలకమైన ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో మంత్రి వర్గ విస్తరణ అనే తేనెతుట్టెను కదిపేందుకు సీఎం చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారా? అంచనాలు అందుకోని కొందరిని ఇంటికి పంపి.. ఇన్నాళ్లూ మంత్రి పదవి కోసం వేచిచూస్తున్న ఆయా వర్గాలను కేబినెట్లోకి తీసుకుంటారా? రాజకీయ, సామాజికపరంగా లెక్కలు వేసి.. ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులతో పాటు మరికొన్నింటినీ భర్తీ చేయబోతున్నారా? అంటే ఏపీ టీడీపీ వర్గాల్లో కేబినెట్ ప్రక్షాళన ఉండొచ్చన్న చర్చే ప్రధానంగా నడుస్తోంది. ఇంకా ఎన్నికలకు 8-9 నెలల టైం ఉంది. ఈ క్రమంలోనే కులాల ఈక్వేషన్ బ్యాలెన్స్ చేస్తూ కేబినెట్‌ను మార్చి ఎన్నికలకు వెళితే వచ్చే ప్రయోజనాలపై బాబు పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు.
సమగ్ర ప్రక్షాళనకే....
బీజేపీతో కటీఫ్ తర్వాత.. అప్పటివరకూ కేబినెట్‌లో ఉన్న ఇద్దరు బీజేపీ మంత్రులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే! వీటిని ఎప్పుడు భర్తీ చేస్తారనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. అయితే ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వీటి భర్తీపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇంకో ఆసక్తికర, సంచలన విషయమేంటంటే.. ఈ రెండు స్థానాల భర్తీతోపాటు సమగ్రంగా కేబినెట్ ప్రక్షాళన చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఒకటి మైనారిటీలకు....
కేబినెట్ ప్రక్షాళనకు ఏపీ సీఎం చంద్రబాబు శరవేగంగా పావులు కదుపుతున్నారనే చర్చ టీడీపీలో మొదలైంది. ఎవరిని కొత్తగా మంత్రి వర్గంలోకి తీసుకోవాలి.. ఎవరిని తప్పించాలనే విషయాలపై సుదీర్ఘంగా సీనియర్లతో మంతనాలు జరుపుతున్నారట. అయితే ఇప్పటికే ఇద్దరి ఆశావహుల పేర్లు వినిపిస్తున్నాయి. ఖాళీగా ఉన్న రెండు మంత్రి స్థానాల్లో ఒకటి మైనారిటీలకు ఇస్తారని ఆ వర్గం బలంగా నమ్ముతోంది. అంతేగాక ఆ కోటాలో ఎమ్మెల్సీ షరీఫ్ పేరు కూడా వినిపిస్తోంది. ఇప్పటి వరకూ మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆ వర్గం కొంత గుర్రుగా ఉంది. దీంతో పాటు బీజేపీ ఎఫెక్ట్ కూడా ఒక కారణమని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు.. మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు.
ఎష్టీ కోటాలో....
ఇక రెండో సీటు కోసం పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. రాష్ట్రంలో ఉన్న ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది ఒకే ఒక్కటి. అది కూడా పోలవరమే! మిగిలిన వన్నీ వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎస్టీ కోటాలో ఈసారి ఆయనకు ప్రాధాన్యం దక్కడం ఖాయమని ఆయన సన్నిహితులు బలంగా విశ్వసిస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణ జరిగిన ప్రతిసారీ ఆయన పేరు వినిపించడం తర్వాత ఆయనకు పదవి రాకపోవడం ఇవన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం ఆయనకు కచ్చితంగా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గట్టెక్కిస్తుందని అధినేత చంద్రబాబు బలంగా నమ్ముతున్న.. పోలవరం ప్రాజెక్టు కూడా ముడియం నియోజకవర్గంలోనే ఉంది. అన్ని అంశాలనూ దృష్టిలో ఉంచుకుని ఈసారి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు.
వీరిని తీసుకున్నా....
ఖాళీ అయిన రెండు స్థానాలు ఒకటి కమ్మ, కాపు వర్గాలకు చెందిన వారివే. అయితే ఇప్పటికే కేబినెట్ ఈ రెండు వర్గాలకు చెందిన మంత్రులు ఉండడంతో మళ్లీ ఈ వర్గాలకు చెందిన వారినే తీసుకున్నా కొత్తగా వచ్చే ప్రయోజనం లేదని కూడా బాబు డిసైడ్ అయినట్టే తెలుస్తోంది. వాస్తవంగా చూస్తే బాబు సొంత సామాజికవర్గం నుంచి కేబినెట్ బెర్త్ కోసం చాలా మంది సీనియర్లు చకోరపక్షుల్లా కాచుకుని కూర్చొని ఉన్నారు. అయితే మైనార్టీ, ఎస్టీలకు బెర్త్‌లు లేకపోవడంతో బాబు ఈ రెండు వర్గాలకు బెర్త్‌లు ఇచ్చే కసరత్తులు చేస్తున్నారు. వీరిద్దరితో పాటు ఒకటి రెండు మార్పులు కూడా చోటుచేసుకోబోతున్నాయని తెలుస్తోంది.
అంచనాలు అందుకోలేని....
కొంతమంది మంత్రులు అంచనాలు అందుకోవడం లేదని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. మంత్రి పదవి ఇచ్చినా.. ఆయా శాఖలపై అవగాహన పెంచుకోవడంలోనూ, ఆయా శాఖలపై వస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం ఇవ్వడంలోనూ కొంత వెనుక బడిన వారితో పాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కూడా మంత్రి వర్గం నుంచి తప్పించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఒకవేళ ఇప్పుడు పాత మంత్రులను తొలగిస్తే ఆ ప్రభావం కచ్చితంగా వేరే అంశాలపై పడుతుందని విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు. మరి ఎవరు ఇన్ అవుతారో.. ఎవరు అవుట్ అవుతారో వేచిచూడాల్సిందే!