వైసీపీకి కన్ను కొడుతున్నారే...??

Update: 2018-12-31 15:30 GMT

వచ్చే ఎన్నికల్లో ఏలాగైనా టికెట్ సంపాదించాలి. ఎమ్మెల్యేగా పోటీ చేసి నెగ్గాలి. ఇది ఆయన స్ట్రాటజీ, తన సోదరుడు ఉన్న పార్టీలో నుంచి ప్రత్యర్ధి వైసీపీలోకి చేరేందుకు రాయబేరాలు నడిపిస్తున్నారు. అవకాశం ఇస్తే చాలు పోటీ చేసి ఎమ్మెల్యెగా గెలిచొస్తానని హామీ ఇస్తున్నారట. అంగబలమే కాదు. అర్ధబలం కూడా తనకు ఉందని గట్టిగా చెబుతున్నారట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి, ఏమా కధ అంటే అది విశాఖ రూరల్ జిల్లా మాడుగుల అసెంబ్లీ సీటు, అక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే సోదరుడొకరు ఫ్యాన్ నీడన చేరేందుకు పరితపిస్తున్నారు.

టికెట్ డౌటట....

రానున్న ఎన్నికల్లో మాడుగుల మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత పార్టీ ఇంచార్జి గవిరెడ్డి రామానాయుడు టీడీపీ తరఫున పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే అధినాయకత్వం ఆయనకు టికెట్ ఇస్తుందో లేదోనని డౌట్ ఉంది. ఎందుచేతనంటే ఇక్కడ సీటుపై మంత్రి అయ్యన్నపాత్రుని కుమారుడి తో పాటు, మాజీ ఎంపీ ఒకరు కన్నేశారు. అంతే కాదు, ప్రవాసాంధ్రుడు అయిన పైలా ప్రసాదరావు కూడా ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. ఇంతటి పోటీని తట్టుకుని సీటు తెచ్చుకోవడం కష్టమేనని రామానాయుడు భావిస్తున్నాడు. ఒకవేళ సీటు రాకపోతే ఆయన తమ్ముడు గవిరెడ్డి సన్యాసినాయుడు వైసీపీలోకి వెళ్తారని అంటున్నారు. ఇందుకోసమే తెరవెనక చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

సిట్టింగ్ కి ఫిట్టింగేనా..?

ఇకపోతే వైసీపీకి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఉన్నారు. ఆయన జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అప్పట్లో టీడీపీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా ఆయన పార్టీని అట్టిపెట్టుకుని ఉన్నారు. అయితే ఆయనకు అర్ధబలం లేదు. ఇది మైనస్ పార్టీగా పరిగణిస్తే మాత్రం సన్యాసినాయుడుకి వైసీపీకి చోటు, సీటు ఉంటుందని అంటున్నారు. అయితే జగన్ తనను నమ్ముకుని పార్టీలో కొనసాగిన ముత్యాలనాయుడుకు అన్యాయం చేస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే గెలుపు గుర్రం కావాలంటే మాత్రం అర్ధబలం ముఖ్యమని పార్టీలో ఇతర నేతలు అంటున్నారు. మరి వైసీపీలోకి వచ్చి పోటీ చేయాలనుకుంటున్న టీడీపీ తమ్ముడి విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది అధినేతనేనని అంటున్నారు.

Similar News