మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఆయన సర్వే ఇప్పుడు తెలంగాణాలో కాక రేపుతోంది. ప్రజాకూటమికే విజయావకాశాలు ఉంటాయని పోలింగ్ కు 96 గంటల ముందు చెప్పడం స్ట్రాటజీలో భాగమేనంటున్నారు. లగడపాటి ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు టూల్ గా మారారన్న విమర్శలు సర్వత్రా విన్పిస్తున్నాయి. ప్రజాకూటమి విజయం కోసమే లగడపాటి తాను సర్వే చేయించిన వివరాలను కొద్దిగా బయటపెట్టారంటున్నారు విశ్లేషకులు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నా.....
లగడపాటి సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నేత. ఆయన రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ఆయనకు ఎన్నికల స్ట్రాటజీ అనేది క్షుణ్ణంగా తెలుసు. గత కొద్ది నెలల క్రితం లగడపాటి తెలంగాణలో అధికార పార్టీకే విజయావకాశాలుంటాయని చెప్పారు. అయితే చివరి నిమిషంలో ఆయన సర్వేలు వెల్లడించడం అనేక అనుమానాలకు తావిస్తుంది. రాజకీయ అనుభవం ఉన్న లగడపాటికి తన సర్వే ఫలితాలు వెల్లడిస్తే అది ప్రభావం చూపుతుందన్నది తెలియంది కాదు. గతంలోనూ లగడపాటి అనేక సర్వేలు చేయించారు. వివిధ రాష్ట్రాల్లో లగడపాటి చేయించిన సర్వేలు ఆయనకు మంచిపేరును తెచ్చిపెట్టాయి.
గతంలో ఎన్నడూ.....
అయితే గతంలో చేయించిన సర్వేల ఫలితాలను లగడపాటి పోలింగ్ కు ముందు ఎప్పుడూ ప్రకటించలేదు. పోలింగ్ రోజు సాయంత్రం ఆయన తన ఫలితాలను వెల్లడించేవారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా లగడపాటి ఢిల్లీ తదితరరాష్ట్రాల్లో తాను చేయించిన సర్వే ఫలితాలను అంతర్గతంగా పార్టీ అధిష్టానానికి ఇచ్చారు తప్పించి పోలింగ్ కు ముందు బయటకు వెల్లడించలేదు. అయితే ఈసారి లగడపాటి సర్వే ఫలితాలను వెల్లడించడం వెనక చంద్రబాబు "హస్తం" ఉందన్న ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి.
పదే పదే తాను చెప్పుకోవడం వెనక?
తాను ఏ పార్టీకి చెందని వాడినని లగడపాటి పదే పదే మీడియా సమావేశంలో చెప్పుకోవడం కూడా ఇందులో భాగమేనంటున్నారు. ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని ప్రకటించిన లగడపాటి, మిగిలిన ముగ్గురు పేర్లను వెల్లడించలేదు. దీనికి కారణం ఆయనే చెప్పారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు తన స్నేహితులని వారి కోరిక మేరకు వెల్లడించడం లేదని ఆయన చెప్పడం ఈ సందర్భంగా గమనార్హం. ప్రకటించిన అయిదుగురు స్వతంత్ర అభ్యర్థుల్లో ముగ్గురు కాంగ్రెస్ రెబెల్స్ కావడం విశేషం. నిజంగా లగడపాటి ఏదైనా రాజకీయ పార్టీలో ఉంటే సర్వే ఫలితాలను వెల్లడించవచ్చు. ఆయన తాను ఏపార్టీలో లేనని చెప్పుకుంటున్నారు. ఏ పార్టీలో లేనప్పుడు ఆయన పోలింగ్ కు ముందు సర్వే వివరాలను వెల్లడించడం నైతికతా? అన్న ప్రశ్న ను నెటిజన్లు లేవనెత్తుతున్నారు. మరోవైపు టీఆర్ఎస్ కూడా లగడపాటి సర్వేపై మండిపడుతుంది. దీనివెనక చంద్రబాబు ఉన్నారంటూ ఫైరవుతుంది. లగడపాటి సర్వే వెనక రహస్య అజెండా ఉందన్నారు. మొత్తంమీద లగడపాటి మరోసారి జగడపాటి అయ్యారు.