కేంద్ర మాజీ మంత్రి గతంలో కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడుగా పేరు తెచ్చుకున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త.. పశ్చిమ గోదావరికి చెందిన కావూరి సాంబశివరావు ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నారు. ఆయన ఏ పార్టీలోనూ ఉన్నట్టుగా కనిపించడం లేదు. గత రెండున్నరేళ్లుగా కూడా ఆయన ఎక్కడా మీడియా ముఖం చూడలేదు. పైగా కాపు ఉద్యమం, ప్రత్యేక హోదా ఉద్యమాలు, ప్యాకేజీ పోరు, అవిశ్వాసం వంటివి ఎన్నో తెరమీదికి వచ్చినా.. కూడా కావూరి ఎక్కడా మీడియా కంట పడిందిలేదు.. పన్నెత్తు వ్యాఖ్యలు చేసింది కూడా లేదు. దీంతో కావూరి రాజకీయ ప్రస్థానం ఏంటనే వ్యాఖ్యలు తెరమీదికి వస్తున్నాయి.
నిత్య అసంతృప్తి వాదిగానే.....
కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయన నిత్యం అసంతృప్త వాదిగానే మిగిలారు. మన్మోహన్‌సింగ్ ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి రాకపోవడంపై నేరుగా అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాకే లేఖ రాసి.. తర్వాత విస్తరణలో సహాయ మంత్రిగా పదవిని పొందారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎంపీ నియోజక వర్గం నుంచి వరుసగా రెండుసార్లు 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే, పదవిలో ఉండగా తన సొంత వ్యాపారాలకే ఎక్కువ మొగ్గు చూపించారనే అపవాదును కావూరి ఎదుర్కొన్నారు. అదేవిధంగా రెండు మూడు బ్యాంకుల నుంచి తన పారిశ్రామిక అవసరాలకు నిధులు తీసుకుని ఎగ్గొట్టారనే ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి.
బీజేపీలో ఉన్నా.....
దీంతో హైదరాబాద్‌లోని కావూరి నివాసాల ఎదుట బ్యాంకుల అధికారులు నిరసనలు కూడా చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక, రాజకీయాల విషయానికి వస్తే.. 2014 వరకు కాంగ్రెస్‌లో ఉన్న కావూరి.. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ పార్టీకి రాం రాం చెప్పారు. అయితే అంతకు ముందే తన మనవడు భరత్ సినీనటుడు బాలయ్యకు అల్లుడు కావడంతో ఈ యాంగిల్లో టీడీపీ తరపున ఏలూరు ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు చేశారు. అయితే చంద్రబాబు మాగంటి బాబు వైపే మొగ్గు చూపడంతో కావూరు ఆశ నెరవేరలేదు. తర్వాత వెంటనే ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తనను కేంద్రంలోని నామినేటెడ్ పదవిలోకి అయినా లేక రాజ్య సభ కైనా పంపాలని ఆయన బీజేపీ అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నారు. కానీ, కావూరి విజ్ఞప్తి బుట్టదాఖలైంది. దీంతో కొన్ని రోజుల వరకు మీడియా ముందుకువచ్చిన ఆయన ఆ తర్వాత పూర్తిగా రావడం మానేశారు.
పోటీకి దూరంగా.....
ప్రస్తుతం హైదరాబాద్‌లోనే మకాం ఉంటున్న కావూరి.. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెప్పుకొంటున్నారు. మరో పక్క, కాంగ్రెస్ తరఫున ఇప్పటికే కావూరికి రాయబారం కూడా నడించిందని, ఆయన సున్నితంగా తిరస్కరించారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏలూరు టికెట్ సహా.. ఒకవేళ గెలవకపోతే.. రాజ్యసభకైనా పంపేందుకు తాము సిద్ధమేనని కాంగ్రెస్ వర్తమానం పంపించింది. అయినా కావూరి తన నిర్ణయం మార్చుకోలేదని సమాచారం. మరి ఆయన ఎలాంటి టర్న్ తీసుకుంటారో చూడాలి.