రాష్ట్రంలో మారుతున్న రాజకీయాల పుణ్యమా అని.. సామాజిక వర్గాలకు మహర్దశ పడుతోంది. ఇప్పటి వరకు చట్ట సభల సీట్ల విషయంలో ఇస్తే.. తీసుకుందాం.. అనే రేంజ్‌లో ఉన్న కొన్ని సామాజిక వర్గాలకు ఇప్పుడు కోరకుండానే పెద్ద పీట పడుతోంది. వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలూ అన్ని సామాజిక వర్గాలకు పెద్ద పీట వేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కూడా సామాజిక వర్గాలకు ప్రాధాన్యం పెంచుతోంది. గత ఎన్నికల్లో పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల విషయంలో స్పష్టంగా కనిపించడంతో నష్టనివారణ చర్యలకు వైసీపీ అధినేత జగన్ దిగారు. దీనిని వచ్చే ఎన్నికల్లో అధిగమించాలని జగన్ వ్యూహ రచన చేసుకున్నట్టు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో దెబ్బతిన్న....
ముందుగా ఆయన తన ప్రణాళికను పశ్చిమ గోదావరి జిల్లా నుంచే ప్రారంభించారు. గత ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ కనీసం బోణీ కూడా కొట్టేలేదు. వాస్తవానికి టీడీపీకి కంచుకోట వంటి అనంతపురంలో రెండు చోట్ల విజయాన్ని సాధించిన వైసీపీ.. పశ్చిమలో మాత్రం ఒక్క చోట కూడా ఆధిక్యాన్ని చూపించలేకపోయింది. కాపు వర్గానికి టికెట్లు ఇచ్చినా కూడా వైసీపీ అనుకూలంగా ఇక్కడ ప్రజలు తీర్పు చెప్పలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ జిల్లాతోపాటు తూర్పులోనూ మరిన్ని సీట్లు సాధించాలని పట్టుదలతో ఉన్న జగన్.. ఆదిశగానే చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలోనూ తూర్పు గోదావరిలో అభ్యర్థులకు సామాజిక వర్గాల వారిగా ప్రాధాన్యం పెంచాలని నిర్ణయించుకున్నారు జగన్. జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే.
సమీకరణలను మారుస్తూ....
ఈసారి అసెంబ్లీ స్థానాల్లో ఏడింటిని కాపులకు, ఐదు స్థానాలు బీసీలకు, మూడు స్థానాలు రెడ్లకు ఇవ్వడానికి నిర్ణయించి నట్టు సమాచారం. ఎస్సీలకు 3 రిజర్వు స్థానాలున్నాయి. ఎస్టీకి ఒక స్థానం ఉంది. గత ఎన్నికల్లో శెట్టిబలిజలకు మూడు స్థానాలు కేటాయించారు. ఈ సారి రెండు స్థానాలు ఇవ్వడానికి నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానాన్ని బీసీలకు ఇవ్వనున్నట్టు ప్రకటించడంతో పాటు పార్లమెంట్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా మార్గాని భరత్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఇక్కడ కమ్మ వర్గానికి చెందిన బొడ్డు భాస్కరరామారావు కుమారుడు పోటీ చేశారు. ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో 4 అసెంబ్లీ స్థానాలు తూర్పుగోదావరి జిల్లాలోను, మూడు పశ్చిమగోదావరి జిల్లాలోను ఉన్నాయి.
టిక్కెట్లు ఖరారుచేశారని....
అందులో అనపర్తి రెడ్డి వర్గానికి రిజర్వు చేసినట్టు సమాచారం. ఇక రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం సీట్లు కాపు వర్గానికి ఇవ్వనున్నారు. రాజమహేంద్రవరం అర్బన్ బీసీ వర్గానికి చెందిన తూరుపు కాపు వర్గానికి ఇవ్వనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో గోపాలపురం, కొవ్వూరు ఎస్సీ రిజర్వుడు స్థానాలు కాగా నిడదవోలు స్థానాన్ని కాపు వర్గానికి చెందిన జీఎస్ శ్రీనివాసనాయుడుకు ఇవ్వనుంది. అంటే రాజమహేంద్రవరం లోక్‌సభ పరిధిలో ముగ్గురు కాపులు, ఇద్దరు ఎస్సీలు, 1 బీసీ కాపు, 1 రెడ్డికి వైసీపీ టిక్కెట్లు లభించనున్నాయి. ఇప్పటికే అనపర్తి నుంచి డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, రాజానగరం నుంచి జక్కంపూడి విజయలక్ష్మి, లేదా ఆమె కుమారుడు జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం రూరల్ నుంచి ఆకుల వీర్రాజు, రాజమహేంద్రవరం అర్బన్ నుంచి రౌతు సూర్యప్రకాశరావుకు ఇంచుమించు టిక్కెట్లు ఖరారు చేసినట్టుగానే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.