ఏపీలో బద్ద విరోధులైన రెండు పార్టీల నాయకులు అపుడే గొప్ప స్నేహితుల్లా మారిపోయారు. కలసిమెలసి తిరుగుతున్నారు. రాజకీయాల్లో వారు వీరు ఎవరూ ఉండరన్న సూక్తిని నిండుగా వంటబట్టించుకున్న తమ్ముళ్ళు ఇపుడు ఖద్దరు నాయకులతో కులాసాగా కబుర్లు చెబుతున్నారు. విశాఖలో జరిగిన కాంగ్రెస్ కార్యక్రమానికి వచ్చిన పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రభుత్వ అతిధి గృహంలో జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావును కలుసుకున్నారు. ఇద్దరు గాఢాలింగనం చేసుకుంటూ రెండు పార్టీల క్యాడర్ కి కొత్త సంకేతాలు పంపించారు. ఇక ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకోవడం విశేషం.
గంటాది ఆ ఖద్దరే.....
టీడీపీ ద్వారానే రాజకీయాల్లోకి వచ్చిన గంటా శ్రీనివాసరావు తరువాత కాలంలో ప్రజారాజ్యం, అట్నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. రెండేళ్ళ పాటు ఆయన కాంగ్రెస్ లో మంత్రిగా పని చేశారు కూడా. అప్పట్లో రఘువీరారెడ్డి కూడా కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్నారు. ఇద్దరు కూడా ఒకే పార్టీలో చాలాకాలం ఉండడం వల్ల సాన్నిహిత్యం తో పాటు తాజాగా జరుగుతున్న పరిణామాలు కూడా ఇద్దరినీ మరో మారు దగ్గర చేశాయని అంటున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఏపీలోనూ ఆ పొత్తును కొనసాగించాలని అనుకుంటోంది. ఈ మేరకు అధినేత చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు కూడా.
సీనియర్ నేతలు...
ఇటీవలే కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి వెళ్ళి మరీ వచ్చిన బాబు కేంద్రంలో కాంగ్రెస్ వస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. ఇక బాబుదే పొత్తుల ఇష్టమని చెబుతున్న సీనియర్ మంత్రులు కూడా కాంగ్రెస్ తో వెళ్ళడమే మంచిదని అంటున్నారు. ఈ విషయంలో మంత్రి గంటా కూడా గతంలో కాంగ్రెస్ తో పొత్తులకు అనుకూలంగా మాట్లాడి తన మద్దతు ప్రకటించారు. ఈ నేపధ్యంలో రఘువీరా గంటా కలయిక అధిక ప్రాధ్యాన్యం సంతరించుకుంది.
క్యాడర్లో అయోమయం.....
కాగా మంత్రి గంటా వెంట ఉన్న టీడీపీ కార్యకర్తలకు మాత్రం ఇదంతా అయోమయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ అంటేనే కస్సుమని లేచే క్యాడర్ ఇపుడు అదే కాంగ్రెస్ తో తమ నాయకులు చెట్టాపట్టాల్ వేయడాన్ని సహించలేకపోతున్నారు. అయితే నాయకులు తీసుకున్నంత తేలిగ్గా పొత్తుల ఎత్తునలు వారు తీసుకోలేకపోతున్నారు. దాంతో ఇదంతా మామూలు కలయిక అంటూ కొట్టి పారేస్తున్నారు. ఐతే పీసీసీ అధ్యక్షుడు, కీలకమైన మంత్రి ఇద్దరూ ఒక్కటై మాట్లాడుకోవడం, అదీ ఎన్నికల వేల, మారుతున్న రాజకీయ సమీకరణల నేపధ్యం నుంచి చూసినపుడు మాత్రం కచ్చితంగా హస్తం సైకిల్ పొత్తు ఖయమన్న మాట గట్టిగా వినిపిస్తోంది.