కష్టపడేవారికి గుర్తింపు ఖాయమనే మాట అధికార పార్టీ టీడీపీలో మరోసారి రుజువు కాబోతోంది! పార్టీని అన్ని సమయాల్లో నూ అభివృద్ది చేసి.. ప్రజల్లో పార్టీకి మరింత గుర్తింపు వచ్చేలా చేయడంలో అలుపెరుగని కృషి చేస్తున్న నాయకుడు, బెజవాడ టీడీపీ అధ్యక్షుడు బుద్దా వెంకన్న కు చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు వచ్చిన వార్తలతో బెజవాడ టీడీపీలో ఆనందోత్సాహాలు నిండాయి. బీసీ వర్గానికి చెందిన బుద్దా.. నగరంలో టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచారు. ఆయన ఏ కార్యక్రమం పెట్టినా. పార్టీ శ్రేయస్సునే దృష్టిలో ఉంచుకుంటున్నారు తాను బీసీ వర్గానికి చెందిన నాయకుడు అయినా కూడా అన్ని వర్గాలను సమానంగా చూస్తూ.. పార్టీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్తున్నారు.
పశ్చిమం నుంచి....
పార్టీ నేతల్లో అసంతృప్తులు రాకుండా ఆధిపత్య పోరు లేకుండా గడిచిన అయిదేళ్లుగా ఆయన పార్టీని నడిపిస్తున్నారు. అంతేకాదు, విపక్ష పార్టీలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ.. వారికి కంటిపై నిద్రలేకుండా కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన గ్రాఫ్ ఇంతింతై... అన్న చందంగా దూసుకుపోయింది. ఈ క్రమంలో ఆయనను వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున నిలబెట్టాలని బాబు నిర్ణయించుకున్నట్టు సమాచారం. విజయవాడలో మొత్తం మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు ఓసీ వర్గాలకు చెందిన నాయకులు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేయాలని నిర్ణయించుకున్న చంద్రబాబు ఆదిశగా బీసీ వర్గానికి చెందిన బుద్దాను విజయవాడ పశ్చిమం నుంచి పోటీ చేయించాలనే తలంపుతో ఉన్నట్టు తెలిసింది.
బీసీలకు ఒక సీటు ఇచ్చి...
అధికారికంగా ఆయన పేరు బయటకు రాకపోయినా... ఖచ్చితంగా ఆయనకు సీటు ఇస్తారనే వ్యాఖ్యలు మాత్రం వినిపిస్తు న్నాయి. విజయవాడ సెంట్రల్‌లో ఓసీ వర్గం కాపు కులస్తుడు బొండా ఉమా, తూర్పులోనూ ఓసీ సామాజిక వర్గానికి చెందిన గద్దె రామ్మోహన్‌లు ఉన్నారు. ఈ క్రమంలో బీసీలకు ఒక సీటు ఇవ్వడం ద్వారా బెజవాడలోని బీసీ వర్గాన్ని టీడీపీకి అనుకూలంగా మార్చుకునేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ కి ఫైర్‌బ్రాండ్‌గా ఉన్న బుద్దాకు ఇవ్వడమే సమంజసమని అంటున్నారు. ఈయన ఒక్కపార్టీకే కాదు.. బాబు కుటుంబానికి కూడా వీర విధేయుడు. గతంలో బాబు తనయుడు లోకేష్.. రాజకీయాల్లోకి వస్తానని ప్రచారం జరిగినప్పుడు తొట్టతొలిగా స్పందించారు బుద్దా వెంకన్న.
కష్టపడ్డందుకేనా?
లోకేష్ కోసం అవసరమైతే.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీని త్యాగం చేస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు. పార్టీని దూసుకుపోయేలా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. బాబు మనసులోను, తన సీటును త్యాగం చేస్తానని చెప్పి లోకేష్ మనసులోనూ స్థానం సంపాయించుకున్న బుద్దాకు టికెట్ ఇచ్చేందుకు తండ్రీ కొడుకులు ఇద్దరూ సానుకూలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పశ్చిమ టికెట్ బుద్దాకు కన్ఫర్మ్ అవుతుండడంతో విజయవాడ టీడీపీ శ్రేణుల్లో ఆనందం కనిపిస్తోంది. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తోందని నాయకులు అంటుండడం మరింత విశేషం. మరి వైసీపీ నుంచి వచ్చిన జలీల్ భయ్యా పరిస్థితి ఏంటన్నది చూడాల్సి ఉంది.