ఆనం వారసుల‌ గ్రాఫ్ ఏంటి..?

Update: 2018-04-26 10:30 GMT

ద‌శాబ్దాల పాటు రాజ‌కీయాల‌ను శాసించిన, నెల్లూరు జిల్లాలో త‌మ‌కు తిరుగులేద‌ని నిరూపించిన ఆనం సోద‌రులు.. వివేకానందరెడ్డి, రామ‌నారాయ‌ణ రెడ్డిల్లో వివేకా క‌న్ను మూశారు. గ‌డిచిన 40 ఏళ్లుగా ఆయ‌న రాజ‌కీయాల్లో ఉన్నారు. వివేకా త‌న‌దైన శైలిలో చక్రం తిప్పారు. జిల్లాలో త‌న‌కు తిరుగులేద‌ని నిరూపించుకున్నారు. అయితే, ఆయ‌న ఇప్పుడు లేరు. అనారోగ్య కార‌ణాల‌తో 67 ఏళ్ల‌కే కాలం చేశారు. దీంతో నెల్లూరు రాజ‌కీయాలే మూగ‌బోయాయి. ఓ కంచు కంఠం ఇక వినిపించ‌ద‌ని తెలిసి.. నెల్లూరు మొత్తం క‌న్నీరు పెట్టింది. ప్ర‌తి వీధిలోనూ, ప్ర‌తి ఇంట్లోనూ వివేకాకు నివాళులు అర్పించా రు. అయితే, ఇక‌, ఇప్పుడు ఆనం వివేకా రాజ‌కీయ వార‌సుల ప్ర‌స్తావ‌న తెర‌మీదికి వ‌చ్చింది. వివేకా లేని లోటును ఈ వార‌సులు తీరుస్తారా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.

ఇద్దరూ అంత దూకుడు కాదు.....

ఆనం వివేకాకు ఇద్ద‌రు కుమారులు.. ఆనం చెంచు సుబ్బారెడ్డి, ఆనం రంగ మ‌యూర్ రెడ్డి. ఈ ఇద్ద‌రికీ రాజ‌కీయ ప్ర‌వేశం ఉంది. అయితే, వివేకాకు ఉన్న ఫాలోయింగ్ కానీ, ఆ దూకుడు కానీ వారికి ఎంత‌మాత్ర‌మూ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. వివేకా దూకుడుతోపాటు విజ్ఞ‌త కూడా ప్ర‌ద‌ర్శించే వారు. తాను ఏం చెప్పినా.. ఆచి తూచి వ్య‌వ‌హ‌రించేవారు. అందుకే కొన్నిసార్లు ఆయ‌న వివాదాస్పద వ్యాఖ్య‌లు చేసినా.. కూడా సంచ‌ల‌నంగా మారేవి. ఆయ‌న మీడియా ముందుకు వస్తే.. బ్రేక్ లేని ప్ర‌సారాలు కొన‌సాగేవి. మాట్లాడేది రెండు నిముషాలే అయినా.. సూటిగా సుత్తిలేని వ్యాఖ్య‌ల‌తో సంచ‌ల‌నం సృష్టించారు .అందుకే ఆనం వివేకానంద‌రెడ్డి నెల్లూరు రాజ‌కీయాల్లో నిలిచిపోయారని అంటారు ప‌రిశీల‌కులు.

తమ్ముడి కోసం.....

అయితే, ఆయ‌న‌కున్న హ‌వా కుమారులు సుబ్బారెడ్డికానీ, మ‌యూర్ రెడ్డికానీ అందుకున్నారా? అంటే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే మిగిలిపోయింది. త‌న కుమారుల‌ను రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చి.. త‌నంత వారిని కాక‌పోయినా.,. ఎంతో కొంత చేయాల‌ని ఆనం వివేకా భావించారు. అయితే, ఆయ‌న ఆశ‌లు మాత్రం తీర‌లేదు. వాస్త‌వానికి ఆనం.. 1999 నుంచి 2004 వరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొం దినా మంత్రి పదవిని ఆశించలేదు. తన తమ్ముడు రామనారాయణ రెడ్డికే ఆ పదవులు సిఫార్సు చేశారు. తాను నెల్లూరు రాజకీయాలకే పరిమితమయ్యారు. వైఎస్‌ రాజశేఖర రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం వివేకా నేదురుమల్లి కుటుంబానికి ఎదురుతిరిగారు. కొద్ది కాలంలోనే నేదురు మల్లి వర్గాన్ని రాజకీయంగా చిన్నాభిన్నం చేశారు. మాగుంట సబ్బరామిరెడ్డి హత్యానంతరం ఆ వర్గాన్ని పూర్తిగా తనతో కలుపుకుని మరింత బలపడ్డా రు.

గత ఎన్నికల్లో.....

జిల్లా వ్యాప్తంగా బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకు న్నారు. వివేకానంద చూపిన ఈ చాతుర్యమే ఆనం కుటుంబం పరపతి పెంచింది. మ‌రి ఆ రేంజ్‌లో ఆయ‌న కుమారులు వ్యూహాలు ర‌చిస్తున్నారా? ఆయ‌నలాగా రాజ‌కీయాల్లో పైకి వ‌చ్చేందుకు ఏమైనా ప్ర‌య‌త్నిస్తున్నారా ? అంటే అది కూడా క‌ష్ట‌మే. 2014 ఎన్నిక‌ల్లో చెంచు సుబ్బా రెడ్డి బ‌రిలోకి దిగాడు. ఈయ‌న గెలుపు కోసం ఆనం వివేకా రెడ్డి తీవ్రంగా ప్ర‌య‌త్నించాడు., అయిన‌ప్ప‌టికీ.. కేవ‌లం 2000 ఓట్లు మాత్ర‌మే ఆయ‌న‌కు ద‌క్కాయి. దీంతో డిపాజిట్లు సైతం కోల్పోయిన ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే ఆయ‌న ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. మొత్తంగా ఆనం ఫ్యామిలీ నుంచి రాజ‌కీయ వార‌సుల అరంగేట్రం ఉన్నా.. గెలుపు గుర్రం ఎక్కే ప‌రిస్థితి మాత్రం క‌నిపించ‌డం లేదు. ఇక‌, ఇప్పుడు వివేకా మృతి త‌ర్వాత ప‌రిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

ఆనం ఫ్యామిలీని ఓదార్చిన జగన్

Similar News