ప్రాచీన కాలం ఋషులంటే వీర్యదాతలేనా?

Update: 2016-10-28 00:53 GMT

హైందవ ధర్మంలో ఋషులు అనే కాన్సెప్టుకు ఎంతో విలువ ఉంది. ఇవాళ్టికి కూడా హిమాలయాల్లోనూ పవిత్ర పుణ్యక్షేత్రాల్లోను కంటికి కనిపించని రూపాల్లో ఋషులు తపస్సు చేసుకుంటూ ఉంటారనే ఆధ్యాత్మిక విశ్వాసాలు ఉన్నవారు నమ్ముతూ ఉంటారు. అలాంటిది ఋషులు అనే విశ్వసాన్నే అవమానించేలా ‘నరుడా డోనరుడా’ చిత్రలో డైలాగులు ఉన్నాయని హిందూ వర్గాల్లో ఆందోళనలు రేకెత్తుతున్నాయి.

సుమంత్ హీరోగా హిందీ చిత్రం రీమేక్ గా ‘నరుడా డోనరుడా’ అనే చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. ఆడియో విడుదల కూడా పూర్తయిన ఈ చిత్రం.. ప్రస్తుతం విడుదలకు ముస్తాబు చేస్తున్నారు. కొన్ని రోజులుగా టీవీ ఛానెళ్లలో దీని తాలూకు ప్రమోలో హోరెత్తిస్తున్నాయి.

ఈ చిత్రం ‘వీర్యదానం’ అనే కాన్సెప్టుకు సంబంధించినది. పిల్లలు లేని తల్లుల కోసం వీర్యం డొనేట్ చేసే యువకుడిగా ఇందులో సుమంత్ పాత్ర పోషిస్తున్నారు. అయితే అతడిని ఈ పనికి ప్రేరేపించే పాత్రను తనికెళ్ల భరణి పోషిస్తున్నారు. చిత్ర ప్రోమోలను గమనిస్తే.. ప్రాచీన కాలంలోని ఋషులను అవమానించే విధంగా ఇందులో డైలాగులు మనకు కనిపిస్తాయి.

తనికెళ్ల భరణి సుమంత్ తో ‘‘పూర్వకాలంలో మన ఆడాళ్లకు పిల్లల్లేరనుకో.. ఋషుల వద్దకు వెళ్లే వాళ్లు.. వాళ్లు అనుగ్రహించే వాళ్లు.. అంతే గర్భం వచ్చేసేది’’ అంటూ.. ఋషులు స్త్రీలోలులు, వీర్యదానం ద్వారా పిల్లల్ని పుట్టించేవాళ్లు అనే దురర్థాలు వచ్చేలా సినిమా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ డైలాగును సినిమానుంచి తొలగిస్తే.. హిందువుల మనోభావాలు గాయపడకుండా ఉంటాయని పలువురు కోరుతున్నారు.

 

Similar News