Sabarimala : శబరిమల ఆలయ బంగారం చోరీ కేసు.. అసలు నిజాలివేనా?
శబరిమల ఆలయంలో బంగారు మాయమైన కేసులో నేడు సిట్ కేరళ హైకోర్టుకు సమగ్ర నివేదికను సమర్పించనుంది
శబరిమల ఆలయంలో బంగారు మాయమైన కేసులో నేడు సిట్ కేరళ హైకోర్టుకు సమగ్ర నివేదికను సమర్పించనుంది. అయితే ఇప్పటి వరకూ కొందరిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ఈ నివేదికలో ఏ రకమైన విషయాలు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోని గర్భగుడి ద్వారాలకు మరియు ద్వారపాలకుల విగ్రహాలకు ఉన్న బంగారు పొర మాయమైన కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. కేరళ హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న ఈ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
మరమ్మతుల పేరుతో...
2019లో ఆలయ మరమ్మతుల పేరుతో గర్భగుడి తలుపులు, ద్వారపాలకుల విగ్రహాలను చెన్నైలోని ఒక ప్రైవేట్ సంస్థకు పంపారు. తిరిగి వచ్చిన తర్వాత వాటిపై ఉండాల్సిన బంగారు పరిమాణం గణనీయంగా తగ్గినట్లు అధికారులు గుర్తించారు. అంటే బంగారం మాయమయిందని అప్పటి వరకూ తెలియదు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టితో పాటు, ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు మాజీ అధికారులు మరియు వ్యాపారవేత్తలతో సహా మొత్తం 12 మందిని ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటివరకు అరెస్ట్ చేసింది.
మనీ లాండరింగ్ కింద...
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం, రాగి రేకులు మార్చలేదు కానీ వాటిపై ఉన్న బంగారు పూతను చాలా నేర్పుగా తొలగించినట్లు విచారణలో తేలింది.ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగి కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 21 చోట్ల సోదాలు నిర్వహించింది. సుమారు 400 గ్రాముల బంగారం మరియు నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరమ్మతుల నెపంతో శబరిమల ఆలయ పవిత్ర వస్తువుల నుండి బంగారాన్ని దొంగిలించినట్లు ఆరోపణలు వచ్చాయి, 8 బంగారు కడ్డీల నుంచి 31.7 కిలోల బంగారం దొంగిలించినట్లు తేలింది. సిట్, ఈడీలు మనీ లాండరింగ్ కోణంలో విచారణ చేస్తున్నాయి. ఈ కేసులో ఫిబ్రవరి 19న సిట్ తన సమగ్ర నివేదికను హైకోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించడంతో నివేదికలో ఏముంటాయన్నది నేడు తేలనుంది.