ప్రొడక్షన్ కంపెనీ: ఎన్. వీ.ఆర్ సినిమాస్
నటీనటులు: మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జె సూర్య, భరత్, ప్రియదర్శి, ఆర్ జె బాలాజీ
సంగీత దర్శకుడు: హరీష్ జై రాజ్
సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్
నిర్మాతలు: ఎన్.వి ప్రసాద్, ఠాగూర్ మధు
కథ, దర్శకత్వం: ఏ ఆర్ మురుగదాస్
మహేష్ బాబు హీరోయిజానికే కాదు ఆయన అందానికి కూడా అందరూ ఫిదా అయిపోతారు. గత ఏడాది బ్రహ్మ్మోత్సవం వంటి భారీ డిజాస్టర్ ఇచ్చినా కూడా మహేష్ బాబు సినిమా వస్తుందంటే ఎక్కడలేని సందడి వచ్చేస్తుంది. బ్రహ్మ్మోత్సవాన్ని ఏడు తరాల కుటుంబాల గురించి..... అందరు కలిసి వస్తే వచ్చే సంతోషం గురించి తెలియజెప్పిన మహేష్ ఇప్పుడు స్పైడర్ వంటి స్పై థ్రిల్లర్ సినిమాలో నటించాడు. బ్రహ్మ్మోత్సవం కథకి, స్పైడర్ కథ పూర్తి భిన్నమైనది. గత పదేళ్లుగా తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయని మురుగదాస్ మహేష్ బాబు తో స్పైడర్ వంటి సినిమాతో జట్టు కట్టడం, మొదటిసారి మహేష్ బాబుతో రకుల్ ప్రీత్ సింగ్ నటించడం, అలాగే దర్శకుడు ఎస్ జె సూర్య విలన్ గా ఈ స్పైడర్ లో నటించడం... అంతే కాకుండా తమిళ హీరో భరత్ మరో విలన్ గా కనిపించడం వంటి విషయాలతో స్పైడర్ మీద ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. బాహుబలి తర్వాతి అంతటి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై బోలెడన్ని అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. మహేష్ బాబు, ఎస్ జె సూర్యల మధ్య జరిగే మైండ్ గేమ్ ఈచిత్రానికి హైలెట్ అని చెప్పడమే కాదు.... స్పైడర్ ట్రైలర్ లో చూపించినట్టు ప్యూర్లీ స్పై థ్రిల్లర్ సినిమా ఇది. ఈ చిత్రం ద్వారా తమిళ్ లోకి డైరెక్ట్ గా మహేష్ అడుగుపెడుతున్నాడు. ప్రమోషన్స్ కూడా తమిళ్ లో ఇరక్కొట్టారు. తెలుగు లో మహేష్ బాబు అనే పేరు ఒక్కటి చాలు అని ప్రమోషన్ విషయం పెద్దగా పట్టించుకోక పోయినా బిజినెస్ పరంగా మాత్రం స్పైడర్ టాప్ ప్లేస్ లోనే వుంది. మరి సౌత్ లో టాప్ అండ్ ఇంటిలిజెంట్ డైరెక్టర్ గా పేరున్న మురుగదాస్, రజిని తర్వాత సూపర్ స్టార్ గా పేరున్న మహేష్ బాబు కలయిక ఎలా వుంది? మొదటి నుండి ఎంతో నమ్మకం పెట్టుకున్న ఈ చిత్ర కథ వీరి కాంబోని సెన్సేషనల్ చేయగలిగిందా? అసలు వీరి కాంబో అనౌన్స్ అయినప్పటినుండి ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచిన ఈ సినిమా విడుదల తర్వాత ఎటువంటి ఫీడ్ బ్యాక్ ని సొంతం చేసుకుంది? మహేష్ పెట్టుకున్న నమ్మకం నిజమైందా? దసరా బరిలో నిలబడి విజయం కోసం తహతహలాడుతున్న మహేష్, మురుగదాస్ లకు ఈ స్పైడర్ సినిమా ఎలాంటి విజయాన్ని అందించిందో మన సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
ఒక ఇంటిలెజెన్స్ బ్యూరోలో శివ( మహేష్ బాబు) పని చేస్తుంటాడు. తన దగ్గరున్న హై టెక్నాలజి ద్వారా ఫోన్ కాల్స్ ని ట్యాప్ చేస్తూ ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలియగానే వారిని కాపాడటానికి శివ విశ్వప్రయత్నాలు చేస్తాడు. శివకి మరో ముగ్గురు స్నేహితులు సాయం చేస్తుంటారు. ఒకొనొక సమయంలోనే భైరవ (ఎస్ జె సూర్య) జనాలందరిని ఒక సైకో మాదిరి చంపుకుంటూ వెళ్తుంటాడు. అయితే భైరవ కి ఒక తమ్ముడు ఉంటాడు. భైరవ తమ్ముడు భైరవ కన్నా ముందే కొంతమందిని చంపేస్తూ ఉంటాడు. మరి భైరవ నుండి అతని తమ్ముడి నుండి జనాలందరినీ శివ ఎలా రక్షించాడనేదే స్పైడర్ కథ... అసలు ఈ భైరవ ఎవరు? ఎందుకు జనాలందరినీ చంపాలనుకుంటాడు? భైరవ తమ్ముడు కూడా జనాలను చంపడంలో ఉద్దేశ్యం ఏమిటి? అసలు భైరవ నుండి అతని తమ్ముడు నుండి హైదరాబాద్ ప్రజలను శివ ఎలా కాపాడాడు? భైరవకి తన తమ్ముడికి జనాల మీద అంత కక్ష ఎందుకు?మహేష్, రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లాడతారా? అనే విషయాలు తెలియాలంటే స్పైడర్ ని వెండితెర మీద వీక్షించాల్సిందే.
నటీనటుల పనితీరు:
మహేష్ అందం, నటన స్పైడర్ సినిమాకు ప్రధాన ఆకర్షణే కాదు... బలం కూడా. మహేష్ బాబు మైండ్ బ్లోయింగ్ పెరఫార్మెన్సు తో ఆకట్టుకున్నాడు. తనదైన ఈజ్ తో శివ పాత్రలో మహేష్ బాబు పరకాయ ప్రవేశం చేసాడు. టక్ చేసుకుని ఎంతో క్లాస్ గా కనబడిన మహేష్ నటన ఆద్యంతం ఆకట్టుకుంది. స్పై ఏజెంట్ గా మహేష్ మెప్పించాడు. ఫేస్ ఎక్సప్రెషన్స్ తో చంపేశాడు. కాని పాటల్లో డాన్సుల పరంగా మాత్రం తన వీక్ నెస్ ని మరోసారి బయట పెట్టుకున్నాడు. అలాగే హీరోయిన్ రకుల్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు. పాత్రల కోసం హీరోయిన్ ని పెట్టాలి గనక పెట్టాం అన్నట్టుగా వుంది. అంతేకాదు మహేష్ - రకుల్ ల రొమాంటిక్ సీన్స్ కూడా తేలిపోయాయి. ఇక సూర్య సాలిడ్ యాక్టింగ్ తో అదరగొట్టేసాడు. మొదటిసారి విలన్ పాత్రలో నటించిన సూర్య నటన అద్భుతం అనిపించేలా వుంది. సైకో యాక్టింగ్ లో సూర్య ఆకట్టుకున్నాడు. చాలా సీన్స్ లో మహేష్ ను డామినేట్ చేసే విధంగా ఇతని నటన ఉండటం ప్రిన్స్ ఫాన్స్ కు ఇబ్బంది కలిగించే విషయమే అయినా ఒప్పుకోక తప్పదు. అలాగే మరో విలన్ భరత్ కూడా విలన్ తమ్ముడిగా చేసిన పాత్ర ఏమంత చెప్పుకోదగ్గ రీతిలో లేదు. పట్టుమని ఇరవై నిముషాలు కూడా లేని ఆ పాత్ర కథ పరంగా కొంత హెల్ప్ అయ్యింది. మితవారు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు:
దర్శకుడు మురుగదాస్ విషయానికి వస్తే ... ఆర్.మురుగదాస్ సినిమాల్లో బలమైన కథ, కథనం ఉంటాయి. ఈ సినిమాలో అవి కనపడవు. ప్రేక్షకులను ఆసక్తితో కట్టిపడేసే సన్నివేశాలను అందంగా మలచగల దర్శకుడు మురుగదాస్ ఈ సినిమాలో ఒకటి రెండు సన్నివేశాలు మినహా రక్తి కట్టించలేకపోయాయి. మురుగదాస్ స్పైడర్ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకునే సినిమా తీసాడా అనిపిస్తుంది. ఆ విషయం సినిమాలో చాలా చోట్ల స్పష్టంగా అర్ధమవుతుంది. అసలు విలన్ భైరవ పాత్రకు సెపరేట్ గా ఫ్లాష్ బ్యాక్ ఉండటం.....అది తెలుగు నేటివిటీకి దూరంగా తమిళ ఫ్లేవర్ లో ఏడుపులు, పెడబొబ్బలతో ఉండటం చూస్తే మాత్రం పక్కా తమిళ ఫ్లేవర్ అనిపించక మానదు. అసలు స్పైడర్ లో విలన్ పాత్రకు ఇంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు హీరోను పాత్రను కూడా అంతకన్నా బలంగా చూపిస్తే బావుండేది. కానీ సినిమా ఆద్యంతం హీరోకన్నా విలన్ డామినేషన్ ఎక్కువగా కనబడుతుంది. మహేష్ ని రా ఏజెంట్ గా చూపించడం అనే పాయింట్ చాలా బాగున్నా.... విలన్ సూర్య ఎవరి సపోర్ట్ లేకుండా.... మామూలు యువకుడు అంత అరాచకం చేయటం కన్విన్సింగ్ గా అనిపించదు. ఇక బలమైన ఎమోషన్స్ ఎక్కడా బూతద్దం పెట్టి వెతికినా కనపడవు బండరాయి విధ్వంసం, హాస్పిటల్ లో బాంబు బ్లాస్ట్ ఇవన్ని అలా అలా నడిచిపోయిన ఫీలింగ్ తెప్పిస్తాయి. ప్రీ క్లైమాక్స్ సీన్‌లో విలన్‌ను పట్టుకునే సందర్భంలో రియాలిటీ షో లాంటి సన్నివేశం, రోలర్ కోస్టర్ ఫైట్ సీన్ బావుంది. అసలు కథ బలంగా లేకపోవడంతో ఎన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ పెట్టినా ఉపయోగం ఉండదు అనే దానికి ప్రత్యక్ష సాక్షి స్పైడర్ సినిమానే. రమణ, గజినీ, తుపాకీ వంటి సినిమాలు చేసిన దర్శకుడేనా ఈ స్పైడర్ ని తెరకెక్కించింది అనిపిస్తుంది సినిమా చూసి బయటికి వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి. ఇక స్పైడర్ కి మ్యూజిక్ అందించిన హరీష్ జై రాజ్ తన సంగీతం తో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. మొదటినుండి స్పైడర్ పాటలన్ని తమిళ ఫ్లేవర్ లో ఉన్నాయని చెబుతున్నట్టే సినిమాలో కూడా అదే ఫీలింగ్స్ తెప్పించాయి పాటలన్ని. కానీ హేరీష్ జైరాజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం అదరగొట్టింది. ముఖ్యంగా విలన్, హీరో మధ్య వచ్చే సన్నివేశాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్ గా అనిపించింది. మరి బ్యగ్రౌండ్ స్కోర్ దంచడంలో మనోడి సిద్దహస్తుడులెండి. ఇక సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు. స్పైడర్ లోని ప్రతీ సన్నివేశాన్ని ఎంతో రిచ్‌గా చూపించారు సంతోష్ శివన్. నిర్మాతలు టాగోర్ మధు, ప్రసాద్ లు రాజీ పడిన దాఖలాలు ఎక్కడా కనిపించవు
విశ్లేషణ:
మురుగదాస్ - మహేష్ కలయికలో వచ్చిన స్పైడర్ చిత్రం ప్రేక్షకుడి అంచనాలు అందుకోవడంలో విఫలమైందనే చెప్పొచ్చు. సినిమా కథలో హీరో పాత్ర కన్నా విలన్ పాత్రకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది హీరో అభిమానులు అస్సలు జీర్ణించుకోలేరు. అసలు కథల తనకు సమానంగా విలన్ పాత్ర ఉందని తెలిసినా మహేష్ ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకోవడం అనేది సాహసోపేతమైన నిర్ణయం అని చెప్పాలి. మరి మురుగదాస్ స్పైడర్ చిత్రం మొదలుపెట్టినప్పటినుండి తెలుగులో కన్నా తమిళానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడమే కాదు... తమిళనటులకే స్పైడర్ లో ఎక్కువగా చోటివ్వడం దగ్గర నుండి సినిమా ప్రమోషన్స్ వరకే కాదు... సినిమాని కూడా తమిళ ఫ్లేవర్ లోనే తెరకెక్కించి తానూ తమిళానికి ఎంతగా ఇంపార్టెన్స్ ఇచ్చానో చూసారా అన్న చందాన స్పైడర్ ని తీర్చిదిద్దాడు. ఇక హీరో పాత్ర స్పైడర్ లో ఎంతగా ఎలివేట్ అయ్యిందో విలన్ పాత్ర కూడా అంటే ఎలివేట్ అవుతుంది. సినిమా చూసి బయటికి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు హీరో మహేష్ గురించి, విలన్ సూర్య గురించే మాట్లాడుకుంటారు తప్ప మిగతా ఏ కేరెక్టర్ వాళ్ళకి గుర్తు రాదు. సో దీని బట్టి మహేష్ పెరఫార్మెన్సు కోసం, సూర్య విలనిజం కోసమే స్పైడర్ ని ఒకసారి వీక్షించొచ్చు.
ప్లస్ పాయింట్స్: మహేష్ బాబు, ఎస్ జె సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్: స్టోరీ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, లాజిక్ లేని సన్నివేశాలు, కామెడీ, సెకండ్ హాఫ్, క్లైమాక్స్
రేటింగ్: 2 .25 /5