కమలహాసన్ కూతురుగా మాత్రమే కాకుండా తమ కంటూ సొంత అస్తిత్వాన్ని సంపాదించుకుని ఇటు దక్షిణాది, అటు బాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా వెలిగిపోతున్నది శృతిహాసన్. తెలుగు తెరకు సంబంధించినంత వరకు శృతి హాసన్ ఇప్పటిదాకా క్రేజీ హీరోయిన్ గానే చెలామణీ అవుతోంది. ఆమెకు అన్నీ పెద్ద పెద్ద ప్రాజెక్టులే దక్కుతున్నాయి. సక్సెస్ ల బవాటలోనే పయనిస్తోంది.
అయితే తాజాగా ఆమె ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూను గమనిస్తే.. సినిమా రంగంలో చాలా మంది నటులు, టెక్నీషియన్లను తొలుస్తూ ఉండే ఒక పురుగు లాంటి ఆలోచన శృతిహాసన్ ను కూడా తొలుస్తున్నట్లుగా తెలుస్తోంది. అది మరేంటో కాదు. సినిమా నిర్మాతగా మారడం. అవును.. తాను త్వరలోనే సినిమా నిర్మాతగా కూడా మారబోతున్నట్లు ఈ హీరోయిన్ ప్రకటించింది.
తన సినిమాల ద్వారా మహిళల్లో ఎంతో కొంత మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటానని, అలాంటి పాత్రలను ఎంచుకుంటానని.. అయితే మహిళల్లో మరింతగా మార్పు తీసుకురావడానికి సొంతంగా సినిమా నిర్మాణంలోకి రాబోతున్నాను అని శృతి ప్రకటించింది.
అంటే ఆమె మాటల అర్థం.. లేడీ ఓరియెంటెడ్ మెసేజి ఉన్న సినిమాలపనే తన నిర్మాణంలో చేయబోతున్నట్లుగా అనిపిస్తోంది గానీ.. తీరా ప్రొడక్షన్ ప్రాక్టికాలిటీలోకి వచ్చేసరికి అన్ని కమర్షియల్ ఎలిమెంట్లు చొరబడిపోవచ్చు కూడా.
అయితే కొంతకాలం నటన లేదా ఇతర క్రాఫ్ట్ లలో ఉంటూ తర్వాత నిర్మాణంలోకి ప్రవేశించిన వారు చాలా మందే ఉన్నారు. ఇటీవలి కాలంలో చిన్న చిన్న కమెడియన్లు కూడా తాము అనేక చిత్రాలు చేసి సంపాదించుకున్న డబ్బులతో ఇలాంటి నిర్మాణం ప్రయోగాలు చేశారు. అయితే రిజల్ట్ అందరికీ ఒకే రీతిగా ఉండడం లేదు. మరి శృతి హాసన్ కూడా సాహసించి నిర్మాతగా మారాలనుకుంటున్న వేళ.. ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుదాం.