నందమూరి బాలక్రిష్ణ తన నట జీవితంలో డిక్టేటర్ చిత్రంతో 99 చిత్రాలు పూర్తి చేసుకున్న సంగతి విదితమే. ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాత్ర గౌతమీ పుత్ర శాతకర్ణి. 100 అనే సంఖ్య పక్కన పెడితే చారిత్రకంగా ఎంతో కీర్తి ఉన్న పాలకుడు గౌతమీ పుత్ర శాతకర్ణి. అంతటి ఘన కీర్తి ఉన్న పాత్ర కాబట్టి బాలయ్యకు ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించిన బి.గోపాల్, సింగీతం శ్రీనివాస్, బోయపాటి శ్రీను లతో పాటు రాష్ట్రంలో వ్యవసాయాన్ని నమ్ముకున్న నేటి రైతు ఎదుర్కుంటున్న కష్టాల నేపథ్యంలో సాగే కథను సిద్ధం చేసిన క్రిష్ణ వంశీని పక్కన పెట్టి జాగర్లమూడి రాధాక్రిష్ణ (క్రిష్)కి తన 100 వ సినిమా దర్శకత్వం చేసే అవకాశం కలిపించాడు బాలయ్య.
శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న గౌతమీ పుత్ర శాతకర్ణి రాయల్ లుక్ మరియు టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు ఐయ్యింది. నందమూరి బాలక్రిష్ణ రాజు వేషంలో కనిపించనున్న రాయల్ లుక్ ఈ నెల 9 న విడుదల చేయబోతోంది చిత్ర బృందం. విజయ దశమి సందర్భముగా 11 వ తేదీన ఉదయం 8 గంటలకు టీజర్ విడుదల చెయ్యబోతున్నారు. సెంటిమెంట్స్ బలంగా నమ్మే బాలక్రిష్ణ రాయల్ లుక్ మరియు టీజర్ విడుదలకు కూడా పండితులతో ముహూర్తం చూపించి ఖరారు చేసినట్టు తెలుస్తుంది.
నందమూరి బాలక్రిష్ణ సరసన శ్రీయ శరన్ నటిస్తున్న ఈ చిత్రానికి చిరంతాన్ భట్ సంగీతం సమకూరుస్తున్నారు. 2017 సంక్రాంతికి ప్రేక్షకుల ముందు చిత్రాన్ని తీసుకురావటానికి చిత్ర బృందం కృషి చేస్తుంది.