గౌతమీపుత్ర శాతకర్ణి అనే పేరులోనే ఓ రకమైన రాజసం, గాంభీర్యం ఉట్టిపడుతుంది. పాత్రోచితమైన అంతే రాజసంతో నందమూరి బాలకృష్ణ శాతకర్ణి పాత్రలో ఒదిగిపోయారు. ఈ చిత్రంలో ఇదివరకు విడుదల అయిన ప్రోమో లో గానీ, స్టిల్స్ లోగానీ, తాజాగా విడుదలైన వాల్ పేపర్ లో గానీ.. బాలయ్య ఠీవిని చూసిన ఎవరైనా సరే.. ఈ మాట ఒప్పుకోకుండా ఉండలేరు. అంత ఘనంగా వాల్ పేపర్ అభిమానులను అలరించేలా విడుదల అయింది.
గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రానికి సంబంధించి షూటింగ్ పర్వం పూర్తయింది. గుమ్మడికాయ కొట్టేశారు. షూటింగ్ పర్వం పూర్తయిన సంగతి హేమమాలిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా హేమమాలిని అందులో పంచుకున్నారు. ఒకనాటి బాలీవుడ్ అందాల తార అయిన హేమమాలిని ఈ చిత్రంలో బాలకృష్ణ కు తల్లిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
షూటింగ్ పర్వం పూర్తయిన తర్వాత.. దర్శకుడు క్రిష్ బాధ్యత మరింత పెరిగినట్లే. ఎందుకంటే.. చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రాధాన్యం కూడా చాలానే ఉంటుంది. అంటే దర్శకుడు ప్రతిఫ్రేమునూ స్వయంగా తీర్చిదిద్దడం అన్నమాటే. సంక్రాంతి బరిలోకి ఘనంగా విడుదల కావడానికి రెడీ అవుతున్న శాతకర్ణి ని గ్రాఫిక్స్ పరంగా కూడా నభూతో న భవిష్యతి అనదగిన రీతిలోనే తీర్చిదిద్దడానికి యూనిట్ కష్టపడుతున్నారుట మరి. మొత్తానికి ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి కబురూ, ప్రతి ఫోటో అభిమానులకు విందే.