బీటేయడానికి బిడియానికి చైతూకు తేడా తెలీలేదా!

Update: 2016-10-08 12:13 GMT

నటన అనేది అంత చిన్న విషయం కాదు. కేవలం సన్నివేశాన్ని, 'యాక్షన్‌' అని ఒక పొలికేక పెట్టడానికి ముందు దర్శకుడు చెప్పే మాటలు వినడం మాత్రమే కాదు.. కథలోను, క్యారెక్టర్‌ లోను ఉన్న సోల్‌ ఆత్మ- ను మొత్తం అర్థం చేసుకుంటే తప్ప సరైన భావప్రకటన అనేది సాధ్యం కాదు. ఈ విషయంలో ఇద్దరికి పరిణతి ఉండడం ముఖ్యం. నటుడికి సరిగ్గా తెలియజెప్పి అందులో ఉన్న అసలు ఆత్మను ప్రతిబింబించే భావప్రకటన రాబట్టుకోవడం దర్శకుడి పని! అలాగే.. దర్శకుడు చెప్పిన దానిని అర్థం చేసుకుని, తను లీనమై ఆ భావాన్ని పలికించడం నటుడి పని.

సిద్ధాంతపరమైన ఈ ఉపోద్ఘాతం మొత్తం సోదిలాగా అనిపిస్తుంది గానీ.. ఇంతకూ విషయం ఏంటంటే.. 'ప్రేమమ్‌' చిత్రంలో కొన్ని కీలకమైన సన్నివేశాల్లో నాగచైతన్య సరైన భావప్రకటన చేయలేకపోయాడని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ప్రధానంగా మళయాళ 'ప్రేమమ్‌' కూడా చూసిన వారిలో ఈ ఫీలింగ్‌ ఎక్కువగా ఉంది.

ప్రధానంగా కాలేజీ లెక్చరర్‌తో ప్రేమలో పడే సన్నివేశాల్లో చైతూ , నివిన్‌ పౌలీ నటన ముందు తేలిపోయాడనేది పలువురి భావన. మలర్‌ అనే ముగ్ధమోహనమైన అమ్మాయి కళ్ల ముందు కనపడగానే.. ఆమె లెక్చరర్‌ అయితే కావొచ్చు గాక.. మనసు పారేసుకుంటాడు నివిన్‌ పౌలి. అయితే అక్కడినుంచి ఆమెను సైట్‌ కొడుతున్న ప్రతిసారీ.. అతనికి చాలా బిడియంలాంటి భావన కూడా కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎంత చెడ్డా ఆమె తనకు లెక్చరర్‌. అందుకే ఒకవైపు బిడియంగానే ఉంటూ, సైట్‌కొట్టే భావనను బాగా చూపించాడు. అయితే అక్కడే చైతూ ఫెయిలయ్యాడని జనం భావన!

బీటేయడం వరకు చక్కగా చేశాడు గానీ.. అసలైన ఫీలింగ్‌ను తన మొహంలో పలికించడంలో చైతూ ఫెయిలయ్యాడని అనుకుంటున్నారు. రీమేక్‌ ల జోలికి వెళ్లినప్పుడు.. మన నటులు మరింత హోంవర్క్‌ చేస్తే బాగుంటుందేమో.

Similar News