ప్రీరిలీజ్ : ‘బాహుబలి-2’ తర్వాత ‘నమో వేంకటేశాయ’

Update: 2016-11-24 07:50 GMT

నిర్మాణంలో ఉన్న సినిమాలు ముందే నెట్ లోకి వచ్చేయడం అనేది ఇటీవలి కాలంలో చాలా విచ్చలవిడిగా మారిపోయింది. సినిమాలు పూర్తిగా కాకపోయినా.. ఆయా చిత్రాలకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు.. కొన్ని నిమిషాల నిడివితో.. సినిమా విడుదలకు బాగా ముందుగానే నెట్ లో ప్రత్యక్షం అవుతున్నాయి. వీటికి సంబంధించి పెను వివాదాలు కూడా రేగుతున్నాయి. సినిమా గ్రాఫిక్స్ చేస్తున్న వాళ్లు, ఎడిటింగ్ జరుగుతున్న స్టుడియోల్లో పనిచేస్తున్న వాళ్లు ఇలాంటి ఆకతాయి పనికి పాల్పడుతూ.. సినిమాకు నష్టం చేస్తున్నట్లుగా గతంలోనూ కొన్ని సందర్భాల్లో తేలింది.

తాజాగా బాహుబలి 2 కు సంబంధించిన కొన్ని యుద్ధ సన్నివేశాలు ఇంటర్నెట్ లో ప్రత్యక్షం అయ్యేసరికి సహజంగానే యూనిట్ నివ్వెరపోయింది. దీనిపై నిర్మాతలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. పర్యవసానంగా అన్నపూర్ణ స్టుడియోలో గ్రాఫిక్స్ వర్క్ జరుగుతుండగా అక్కడి ఒక ఉద్యోగి దానిని లీక్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అతను విజయవాడలో ఉండగా అక్కడ అరెస్టు చేశారు.

అయితే ట్విస్టు ఏంటంటే.. బాహుబలి సినిమా కొన్ని నిమిషాల భాగాన్ని ముందే ఇంటర్నెట్ లో పెట్టిన ఈ గ్రాఫిక్ డిజైనర్ వద్ద, అక్కినేని నాగార్జున తో రూపొందుతున్న ఓం నమో వేంకటేశాయ సినిమా భాగాలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలుసుకుని నివ్వెరపోయారు. అంటే మరికొన్ని రోజుల్లో ఓం నమో వేంకటేశాయ చిత్ర భాగాలను కూడా ఇంటర్నెట్ లో ప్రీరిలీజ్ చేసేయడానికి రంగం సిద్ధం చేసేశారన్నమాట.

అయినా ఒకవైపు సినిమాలను ప్రమోట్ చేసుకునే ట్రెండ్ లో వస్తున్న మార్పుల్లో భాగంగా.. సినిమాలోని చిన్న భాగాన్ని.. అధికారికంగానే నెట్ లో విడుదల చేసేస్తున్నారు. భేతాళుడు చిత్రం విషయంలో అదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. అయితే.. సాంకేతికంగా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న స్టుడియోల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. ఇలాంటి టెక్ దొంగలు.. క్లిప్ లను తస్కరించి ‘ప్రీ రిలీజ్’ చేసేస్తున్నారు. వీరికి కఠిన శిక్షలు పడితే తప్ప.. భవిష్యత్తులో ఇలాంటి ఆకతాయి వేషాలు ఆగే అవకాశం ఉండదు.

Similar News