నవతరం హీరోల్లో స్పోర్టివ్ నేచర్ బాగా ఉన్న హీరో నందమూరి కల్యాణ రామ్. నందమూరి కల్యాణ రామ్ ఎక్కడా, ఎప్పుడూ ఇతర హీరోలతో పోల్చుకుని తన సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నట్లుగానీ, వారి రికార్డులను అధిగమించాలని కనీసం ప్రయత్నిస్తున్నట్లు కూడా అనిపించదు. చాలా వరకు తనకు నచ్చిన కథలను తన సొంత నిర్మాణంలోనే చేసుకుంటూ అటు మంచి నిర్మాతగానూ, ఓ మోస్తరు హిట్ హీరోగానూ కల్యాణరామ్ చెలామణీ అయిపోతుంటారు. అయితే ఆయన ప్రస్తుతం పూరీజగన్నాధ్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ఇజం కోసం నానా కష్టాలు పడ్డారు మరి! ఈ చిత్రంలో పాత్ర కోసం సిక్స్ ప్యాక్ అవసరం ఉండడంతో.. కల్యాణ్‌రామ్ నానా కష్టాలు పడి ఆ ఫిజిక్ ను సాధించారు. అయితే ఆయన కష్టాలకు సంబంధించిన వీడియోను మేకింగ్ ఆఫ్ సిక్స్ ప్యాక్ పూరీ జగన్ యూట్యూబ్ లో విడుదల చేసి.. నందమూరి అభిమానుల్ని ఆకట్టుకుంటున్నారు.
ఈ వీడియో చూస్తే మాత్రం పాత్ర కోసం పూరీ జగన్ నందమూరి కల్యాణ్ రామ్ ను ఎంత యాతన పెట్టాడో కదా అని అనిపించక మానదు. దీన్ని గమనించినప్పుడు ఇజం చిత్రంలో బాక్సర్ పాత్రను హీరో పోషిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే సిక్స్ ప్యాక్ కోసం కల్యాణ రామ్ కు జిమ్ వర్కవుట్లు మాత్రమే కాకుండా.. స్పెషల్ ట్రయినర్ ను సెట్ లోకూడా ఉంచుకుని, షూటింగ్ సెట్ లు, లొకేషన్లలో కూడా అవసరాన్ని బట్టి అదే పనిగా వర్కవుట్లు చేయించినట్లుగా తెలుస్తుంది. అంటే షూటింగ్ షాట్ గ్యాప్ మధ్యలో కూడా కల్యాణ రామ్ కు విశ్రాంతి లేకుండా చేశారని అనిపిస్తుంది.
ఈ చిత్రంలో తను చేసిన సిక్స్ ప్యాక్ గురించి కల్యాణ్ రామ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ.. బహుశా తెలుగులో సిక్స్ ప్యాక్ చేసిన చివరి హీరోను నేనేనేమో అని తన మీద తనే ఛలోక్తి విసురుకున్నారు. కావచ్చు కానీ.. ఈ మేకింగ్ ఆఫ్ సిక్స్ పాక్ వీడియో చూస్తే మాత్రం.. చాలా మంది హీరోలకంటె బెస్ట్ గా ఆ అపియరెన్స్ సాధించిన హీరో కూడా కల్యాణ రామే అని చెప్పకతప్పదు…