పవన్ జోరు : రెండు నెలల్లో రెండు ఓపెనింగ్‌లా?

Update: 2016-10-13 06:37 GMT

‘డబ్బులు కావాలంటే నేను సినిమాలు చేయాల్సిందే . నాకు ఇంకో పని తెలియదు. బతకడం కోసం సినిమాలు చేయాలి. సినిమాలు చేయడం మాత్రం ఆపేయను’ అనే మాటలు పవన్ కల్యాణ్ తన రాజకీయ ప్రసంగంలో భాగంగా చెప్పి ఉండొచ్చు గాక.. కానీ.. సాధారణంగా అయితే.. ఒక సినిమా పూర్తయిన తర్వాత గానీ మరో సినిమా చేసే అలవాటు లేని.. పవన్ కల్యాణ్ ఇప్పుడు వరుసగా రెండు నెలల్లో రెండు చిత్రాలను ప్రారంభించేస్తున్నారు. రెండు వరుస నెలల్లో రెండు చిత్రాల ఓపెనింగ్ లు అంటే.. తమ పవర్ స్టార్ జోరు చూసి అభిమానులు కూడా వెర్రెత్తిపోతున్నారు. ఆల్రెడీ ఒక చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉండడం కూడా వారి సంతోషానికి కారణంగా ఉంది.

ప్రస్తుతం పవన్‌కల్యాణ్ కాటమరాయుడు షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ బిజీ మధ్యలోనే తమిళ దర్శకుడు నేసన్ దర్శకత్వంలో సినిమాను విజయదశమి సందర్భంగా లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. కాటమరాయుడు కాగానే త్రివిక్రమ్ తో తమ హీరో చిత్రం మొదలవుతుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తోంటే.. నేసన్ చిత్రం మొదలైంది. అయితే ఫ్యాన్స్‌కు మరో శుభవార్త ఏంటంటే.. త్రివిక్రమ్ చిత్ర అటకెక్కిపోలేదుట. నవంబరులో ఈ చిత్రం కూడా ప్రారంభం కానుంది. కాటమరాయుడులో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. నవంబరు నెలాఖరు నుంచి త్రివిక్రమ్ చిత్రానికి డేట్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

సో మొత్తానికి పవన్ కల్యాణ్ మాంఛి జోరు మీద ఒక సినిమా తర్వాత మరో సినిమా పూర్తి చేయడం పై ఫోకస్ పెడుతున్నారన్నమాట. ఇది ఫ్యాన్స్ కు పండగే అనడంలో ఆశ్చర్యం ఏముంది?

Similar News