టాలీవుడ్‌లో 2017 యేడాది కాలగర్భంలో కలిసిపోతోంది. ప్రతి యేడాది లాగా ఈ యేడాది కూడా ఎన్నో హిట్లు, ఎన్నో సూపర్ హిట్లు, ఎన్నో ప్లాపులు వచ్చాయి. హిట్ల విషయానికి వస్తే బాహుబలి - ది కంక్లూజన్ సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాటి చెప్పింది. రూ.1800 కోట్ల వసూళ్లు సాధించి, ఇండియాలోనే ఇప్పటి వరకు ఏ సినిమాకు రానన్ని వసూళ్లతో పాటు ఎవ్వరికి అందనంత ఎత్తులో నిలిచింది. ఈ సినిమా సాధించిన రికార్డులు రాసేందుకు భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేకమైన పేజీలు పెట్టుకోవాల్సిందే. ఇక ఈ యేడాది టాప్ -10 సినిమాల విషయానికి వస్తే ఇలా ఉన్నాయి.
1. బాహుబలి ది కంక్లూజన్ :
బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది. కంటెంట్ పరంగానే కాదు వసూళ్ల పరంగా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా ఈ సినిమా పొందింది. బాహుబలి - ది బిగినింగ్‌లా కాకుండా ఈ సినిమా అందరి మెప్పుపొందింది. భారతీయ ప్రేక్షకులు అందరూ వేన్నోళ్ల కీర్తించిన ఈ సినిమా మన సినిమాలు హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోవని నిరూపించింది. ఈ సినిమా కెప్టెన్ అయిన దర్శకధీరుడు రాజమౌళితో పాటు ఆయన టీంకు ప్రతి ఒక్క భారతీయుడు హ్యాట్సాప్ చెప్పాల్సిందే.
2. అర్జున్ రెడ్డి :
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్‌రెడ్డి అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్‌రెడ్డి సినిమా కంటెంట్ పరంగా కొత్తగా లేకపోయినా యూత్‌ను మెప్పించడంలో మాత్రం ఓ చిన్న విప్లవమే క్రియేట్ చేసింది. ఈ సినిమా తెలుగు భాష అవతల కూడా చర్చనీయాంశం అయ్యింది. ఇతర భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేసేందుకు రీమేక్ రైట్స్ కోసం నిర్మాతలు బాగా పోటీ పడ్డారు. రూ.5 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.30 కోట్ల షేర్ రాబట్టి చిన్న చిత్రాల్లో పెద్ద హిట్‌గా నిలిచింది.
3. ఫిదా :
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా రూ.7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ఏకంగా రూ.50 కోట్ల షేర్ రాబట్టింది. సాయి పల్లవి నటన, తెలంగాణ మాండళికంలో ఆమె పలికిన సంభాషణలు సినిమాకు హైలెట్. ఈ సినిమా కూడా ఓవర్సీస్‌లో రికార్డులు క్రియేట్ చేసింది.
4. శతమానం భవతి :
సంక్రాంతికి మూడు సినిమాల పోటీలో వచ్చిన శతమానం భవతి బాలయ్య, చిరు కెరీర్ ల్యాండ్ మార్క్ సినిమాలను తట్టుకుని సూపర్ హిట్ అయ్యింది. ఈ యేడాది కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమా నిలిచింది.
5. ఖైదీ నంబర్ 150 :
9 ఏళ్ల విరామం తర్వాత చిరు నటించిన ఖైదీ నెంబర్ 150 సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అయ్యింది. కోలీవుడ్ హిట్ సినిమా కత్తికి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాకు వివి.వినాయక్ దర్శకత్వం వహించారు. రూ.100 కోట్లకు పైగా వసూళ్లను ఈ సినిమా సాధించినట్టు నిర్మాతలు ప్రకటించారు.
6. గౌతమీపుత్ర శాతకర్ణి :
బాలకృష్ణ వందో సినిమాగా తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను దర్శకుడు క్రిష్ ఓ అద్భుతంగా మలిచాడు. తక్కువ బడ్జెట్‌తో 79 రోజుల్లో తెరకెక్కిన ఈ సినిమా రూ.65 కోట్ల షేర్ రాబట్టింది. తెలుగు సినిమా చరిత్రలో ఇది కూడా ఒక ప్రత్యేకమైన చిత్రమే. బాలయ్య అసమాన నటన.. క్రిష్ దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రానికి ఆకర్షణగా నిలిచాయి.
7. జై లవకుశ :
యావరేజ్ కంటెంట్‌తో వచ్చిన జై లవకుశ రూ.78 కోట్ల షేర్ రాబట్టి అందరికి షాక్ ఇచ్చింది. ఎన్టీఆర్ అసమాన నటనా ప్రతిభా పాటవాలే ఈ సినిమాను ఈ రేంజ్‌లో హిట్ చేశాయి. జై, లవ, కుశగా మూడు పాత్రల్లో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించాడు.
8. ఘాజి :
దేశవ్యాప్తంగా ప్రశంసలందుకున్న మరో సినిమా ఘాజీ. సంకల్ప్ రెడ్డి అనే కొత్త దర్శకుడు నీటి లోపల సబ్ మెరైన్ నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగుతో పాటు హిందీ తమిళంలోనూ ఈ చిత్రం మంచి విజయం సాధించింది. రానాకు ఇది తొలి సోలో హిట్.
9. నేను లోకల్ :
యావరేజ్ కంటెంట్‌తో వచ్చిన నాని నేను లోకల్ మంచి విజయాన్ని అందుకుంది. నానికి ఈ సినిమా వరుసగా ఆరో హిట్ అందించడంతో నాని డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు.
10. ఇక పై సినిమాలతో పాటు నిన్ను కోరి - రారండోయ్ వేడుక చూద్దాం - గరుడ వేగ - గురు - నేనే రాజు నేనే మంత్రి - మహానుభావుడు లాంటి సినిమాలు కూడా సక్సెస్ అయ్యాయి.