చరిత్ర కాలగర్భంలో మరో యేడాది కలిసిపోయింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ హిస్టరీలోను మరో యేడాది ముగుస్తోంది. ప్రతి యేడాది లాగానే ఈ యేడాది కూడా ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. కొన్ని హిట్లు కొట్టాయి. కొన్ని ప్లాప్ అయ్యాయి. మెగా హీరోల విషయానికి వస్తే 2017 సంవత్సరం పెద్ద పీడకలే అనుకోవాలి. ఈ యేడాది మెగా హీరోల సినిమాలు అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాలేదు. సంక్రాంతి కి చిరు పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా వచ్చింది.
తమిళ్‌లో హిట్ అయిన విజయ్ కత్తికి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా హిట్ అయ్యి , రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. అయితే కొందరు మాత్రం సినిమాపై పెదవి విరిచారు. బాలయ్య వందో సినిమాకు చారిత్రక సినిమా తీసి హిట్ కొడితే చిరు రీమేక్ సినిమా తీయడం ఏంటని విమర్శించారు. ఇక ఫిబ్రవరిలో వచ్చిన మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ విన్నర్ డిజాస్టర్ అయ్యింది. రూ.30 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ఇక సాయి గెస్ట్ రోల్ చేసిన నక్షత్రంది ఇంకా ఘోరం. ఈ సినిమా తొలి ఆటకే ప్రేక్షకులు లేరు. ఇక యేడాది చివర్లో వచ్చిన జవాన్ కూడా ప్లాపే అయినా పై రెండు సినిమాలతో పోలిస్తే కాస్త బెటర్.
మార్చిలో వచ్చిన పవన్ కాటమరాయుడు సినిమా డిజాస్టర్లకే డిజాస్టర్ అయ్యింది. సినిమా కొన్న బయ్యర్లు నిలువునా మునిగితే, ప్రేక్షకులు కాదు పవన్ వీరాభిమానులే ఈ సినిమా ఎందుకు తీశాడా ? అని థియేటర్లలోనే తలలు పట్టుకున్నారు. ఈ సినిమా ఏకంగా రూ.30 కోట్లకు పైగా భారీ నష్టాలను మిగిల్చింది. ఇక బన్నీ డీజే సినిమా యావరేజ్ టాక్ వచ్చినా బయ్యర్లకు నష్టాలే మిగిల్చింది. రొటీన్ కథతో వచ్చిన డీజే కూడా అంచనాలు అందుకోలేకపోయింది. సినిమాకు హైప్ తీసుకువచ్చినా బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది.
ఇక వరుణ్ తేజ్ మిస్టర్ ఘోరంగా బాక్సాఫీస్ దగ్గర విఫలమైతే, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా మాత్రం వరుణ్ కెరీర్‌లోనే సూపర్ డూపర్ హిట్ అయ్యింది. శేఖర్ డైరెక్షన్, సాయి పల్లవి నటన కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి. ఈ సినిమా రూ.50 కోట్ల షేర్ కొల్లగొట్టడం విశేషం. ఇక చెర్రీ నటించిన ఒక్క సినిమా కూడా ఈ యేడాది రిలీజ్ కాలేదు. అయితే తన తండ్రి ఖైదీ నెంబర్ 150 సినిమా నిర్మాతగా భారీ లాభాలు కొట్టి సక్సెస్ అయ్యాడు. యేడాది చివర్లో 28న గురువారం అల్లు శిరీష్ నటించిన ఒక్క క్షణం పాజిటివ్ బజ్‌తో రిలీజ్ అయింది. ఏదేమైనా మెగా హీరోల సినిమాల్లో చిరు ఖైదీ నెంబర్ 150, ఫిదా మినహా మిగిలిన సినిమాలు సక్సెస్ అవ్వలేదు. ఈ యేడాది మెగా హీరోలకు కలిసి రాలేదు.