టాలీవుడ్ రివైండ్ 2017 - 1: డిజాస్ట‌ర్ల‌కే డిజాస్ట‌ర్లు

Update: 2017-12-29 08:17 GMT

2017 చాలా అనుభూతుల్ని ఇచ్చింది. ఎన్నో హిట్లు, బ్లాక్ బ‌స్ట‌ర్లు, వివాదాలు వీటికి తోడుగా ప్లాపులు. ప్లాపులంటే మామూలు ప్లాపులు కాదు.. డిజాస్ట‌ర్ల‌కే డిజాస్ట‌ర్లు. ఈ ప్లాపులు ఇచ్చిన వారిలో స్టార్ హీరోలు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ - మ‌హేష్‌బాబు - బాల‌కృష్ణ - నాగార్జున - గోపీచంద్ - సాయిధ‌ర‌మ్‌తేజ్ - వ‌రుణ్‌తేజ్ ఉన్నారు. ఈ సినిమాలు నిర్మాత‌లు, ప్రేక్ష‌కుల పాలిట శ‌రాఘాతంగా మారాయి. ఈ యేడాది ప్లాపుల ను రివైండ్ చేసుకుంటే నాగార్జున హీరోగా తిరుమ‌ల వెంక‌టేశ్వ‌రుడి భ‌క్తుడు హ‌థీరాంబాబా జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన ఓం న‌మో వేంక‌టేశాయ‌ అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. రాఘవేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా బిజినెస్ రూ.35 కోట్లు అయితే కేవ‌లం రూ.12 కోట్ల‌కు లోపుగానే వ‌సూళ్లు రాబ‌ట్టి విఫలమైంది.

ఇక నాగ్ న‌టించిన మ‌రో సినిమా రాజు గారి గ‌ది 2 సినిమాలో నాగ్ కోడ‌లు స‌మంత కూడా న‌టించింది. ఈ సినిమా వెండితెర మీద, బుల్లితెర మీద కూడా తుస్సుమనిపించింది. ప‌వ‌న్ కాట‌మ‌రాయుడు సినిమాను కాట‌మ‌రాడ్ అని కామెంట్లు చేశారు. త‌మిళ్‌లో హిట్ అయిన రొటీన్ రొడ్డ కొట్టుడు సినిమాను ప‌వ‌న్ ఇక్క‌డ ఎందుకు రీమేక్ చేశాడో ? ఎవ్వ‌రికి అంతుప‌ట్ట‌లేదు. ఇక మెగా సాయిధ‌ర‌మ్ తేజ్ విన్న‌ర్ - న‌క్ష‌త్రం - జ‌వాన్ ప్లాపుల ఖాతాలో చేరిపోయాయి. ఈ సినిమాల దెబ్బ‌తో సాయి మార్కెట్ కుదేలైంది. వ‌రుణ్‌తేజ్ మిస్ట‌ర్ ఘోరమైన ప్లాప్‌.

బాల‌య్య పైసా వ‌సూల్ సినిమాకు పైస‌ల్ నిల్ అన్న క్యాప్ష‌న్ స‌రిపోతుంది. గోపీచంద్‌కు 2017 పీడ‌క‌ల‌గా మిగిలింది. గౌత‌మ్ నంద‌, ఆక్సిజ‌న్ ఘోర‌మైన డిజాస్ట‌ర్లు. ఆర‌డుగుల బుల్లెట్ ఇంకా అడ్రస్ లేదు. మంచు ఫ్యామిలీ విష‌యానికి వ‌స్తే మనోజ్ గుంటూరోడు, ఒక్క‌డు మిగిలాడు, విష్ణు స్పీడున్నోడు, లక్ష్మీప్ర‌స‌న్న ల‌క్ష్మీబాంబ్ మామూలు ప్లాపులు కాదు. రాధాతో శ‌ర్వానంద్‌, లైతో నితిన్‌, యుద్ధం శర‌ణం గ‌చ్చామితో నాగ‌చైత‌న్య‌, ఉంగ‌రాల రాంబాబుతో సునీల్‌, క‌థ‌లో రాజ‌కుమారి, బాల‌కృష్ణుడుతో నారా రోహిత్ ప‌చ్చి రొడ్డు కొట్టుడు సినిమాల తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి త‌ల‌నొప్పి తెప్పించారు.

ఈ ప్లాపుల సంగ‌తి ఇలా ఉంటే ప్రిన్స్ మ‌హేష్‌బాబు స్పైడ‌ర్ ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో అతి పెద్ద డిజాస్ట‌ర్ల జాబితాలో నాలుగో ప్లేస్‌లో ఉన్న‌ట్టు ట్రేడ్ వ‌ర్గాల లెక్క‌లు చెప్పాయి. గ‌తేడాది బ్ర‌హ్మోత్సం ఎలాంటి అట్ట‌ర్ ఫ్లాప్‌గా నిలిచిందో, ఈయేడాది స్పైడ‌ర్ అలాంటి ఫ‌లితాన్నే ఇచ్చింది. రూపాయి పెట్టుబ‌డి పెడితే పావ‌లా కూడా స్పైడ‌ర్‌కు రాలేదు. మ‌రి 2018 అయినా ఇలాంటి డిజాస్ట‌ర్ల‌ను త‌ప్పించుకుంటుందేమో ? చూడాలి.

Similar News