‘దిసీజ్ డైరక్టర్స్ మూవీ’ అంటుంటారు కొందరు. పెద్ద పెద్ద స్టార్లను, భారీ బడ్జెట్‌ను, గ్రాఫిక్స్ సపోర్ట్ ను అన్నింటినీ సమకూర్చి పెడితే.. దాన్ని హిట్ కొడితే ఇక అందులో ‘డైరక్టర్ మూవీ’ అని చెప్పుకునేంత ఘనత ఏముంది? అవేమీ లేకుండా కథ- కథనంతోనే హిట్ కొడితే అదీ లెక్క! అని వాదించే వాళ్లు కూడా ఉన్నారు. అయితే ‘ఫ్రం ది డైరక్టర్ ఆఫ్ జురాసిక్ పార్క్’ లాంటి ప్రచార క్యాప్షన్లతో ఇంగ్లిషులో సినిమాలు వస్తుండడం మనకు తరచూ కనిపిస్తుంది. అయితే తెలుగులో మనకు అప్పుడప్పుడూ అలాంటి ప్రచారం కనిపిస్తుంది... అలా విజయవంతం అయిన చిత్రాలు మాత్రం లేవు.
కేవలం దర్శకుడి పేరు, గతంలో ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు తప్ప మరో మార్కెటింగ్ ఎలిమెంట్ ఏదీ లేకుండా సినిమాను విడుదలకు తేవడం అంటే ఒక రకంగా సాహసమే. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ‘నాగభరణం’ నిర్మాతలు కూడా అలాంటి సాహసం చేశారు. వారు కేవలం కోడి రామకృష్ణ దర్శకత్వం అనే పాయింట్ ఒక్కటే ప్రచారం చేసుకుంటూ వచ్చారు.
ప్రధానంగా గ్రాఫిక్స్ మీదనే ఆధారపడిన చిత్రం అని ‘నాగభరణం’ టైటిల్ దగ్గరినుంచి ఏ చిన్న ట్రైలర్ పార్ట్ చూసినా అర్థమైపోతుంది. అది అసలే కన్నడ సినిమా. కన్నడంలో దివంగత స్టార్ విష్ణువర్దన్ పాత్రను గ్రాఫిక్స్ ద్వారా సృష్టించి తెరమీద కథ ను నడిపించారంటే.. ఆ పాయింట్‌కు తెలుగు ప్రేక్షకుల వద్ద ఉన్న వేల్యూ సున్నా. అందుకే నిర్మాతలు మొత్తం కోడి రామకృష్ణ బొమ్మ మీదనే ప్రచారం ప్లాన్ చేసుకున్నారు. అమ్మోరు , అరుంధతి వంటి చిత్రాలు తీసిన మహా దర్శకుడు అంటూ కోడి రామకృష్ణ గురించి ఊదరగొట్టారు. కానీ ఆ ప్రచారం రెండో రోజున థియేటర్ కు ప్రేక్షకులను రప్పించలేకపోయింది.
దర్శకుడి గురించి చేసిన ప్రచారం మొత్తం నిజమే కావొచ్చు. కానీ ఒక సినిమా విజయవంతం కావడం వెనుక కేవలం దర్శకుడి ఒక్కడి ప్రతిభ మాత్రమే ఉంటుందనుకోవడం భ్రమ- అనే సిద్ధాంతానికి ఇది నిదర్శనం. ఎందుకంటే ఆయన కెరీర్‌లో మరిన్ని గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ ఫ్లాప్ లు కూడా ఉన్నాయి. అయితే.. సూపర్ హిట్ లు అమ్మోరు, అరుందతి లాంటివే. ఈ రెండు చిత్రాలూ ఎంఎస్ ఆర్ట్ మూవీస్ వారివి. నిర్మాత ఎం. శ్యాంప్రసాద్ రెడ్డి కూడా సినిమా మేకింగ్ లో ఎంతో శ్రద్ధగా ఉంటారు గనుక మాత్రమే అలాంటి విజయాలు సాధ్యమయ్యాయి. మరో నిర్మాతతో ఆ రేంజి హిట్ ఇచ్చిన చరిత్ర కోడి రామకృష్ణకు లేదు. మరి అలాంటప్పుడు.. కేవలం దర్శకుడి పేరును నమ్ముకుని ఎంత బీభత్స క్యాంపెయినింగ్ చేసినా.. సినిమాను నిలబెట్టేది ఉండదని దీనితో నిరూపణ అవుతోంది.