చివరికి సునీల్ కూడా యేసేశాడు

Update: 2016-10-09 12:21 GMT

సినిమాలు విడుదల అయిన తర్వాత.. వివిధ ప్లాట్‌ఫారమ్స్ మీద ఆ చిత్రం బాగోగుల గురించి వచ్చే రివ్యూలు, సమీక్షలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వెబ్ సైట్లలో సినిమాల మీద వచ్చే రివ్యూలను బట్టి విదేశాలలో సినిమా బిజినెస్ జరుగుతూ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. క్రమంగా స్వదేశంలో సినిమా జయాపజయాల మీద కూడా వెబ్‌సైట్లలో వచ్చే రివ్యూలు చాలా ప్రభావం చూపించడం మొదలైంది. రివ్యూ తేడాగా ఉంటే సినిమాల కలెక్షన్లు ఢామ్మని పడిపోవడం, రివ్యూలు పాజిటివ్ గా ఉంటే.. ఓపెనింగ్స్ వరకు దిగుల్లేకుండా కలెక్షన్లు రావడం రివాజుగా మారింది. అందుకే.. చాలా ఫ్లాప్ సినిమాల మేకర్స్ తమ సినిమాలు దెబ్బతిన్న తర్వాత.. సినిమా రివ్యూలు నెగటివ్ గా పెట్టారంటూ ఆడిపోసుకోవడం కూడా ఒక కల్చర్ గా మారిపోయింది.

ఫరెగ్జాంపుల్ రాంగోపాల్ వర్మనే తీసుకుంటే టాలీవుడ్ లో ప్రతి సినిమా జర్నలిస్టు కూడా ఆయనను ఒక అద్భుతమైన టెక్నీషియన్ గా ఒప్పకుంటారు. ఆయన గురించి రాయాల్సి వస్తే.. తిరుగులేని దర్శకుడిగానే రాస్తారు. అలాంటి రాతలన్నిటినీ చక్కగా ఎంజాయ్ చేసే రాంగోపాల్ వర్మ, తను తీసే చెత్త సినిమాల గురించి నెగటివ్ రివ్యూ లు వస్తే మాత్రం సహించలేరు. కావాలనే నెగటివ్ రివ్యూలు పెట్టారంటూ.. ట్వీట్ లు ఇతర మాధ్యమాల ద్వారా ఆక్రోశం కక్కుతుంటారు. చాలా మంది దర్శకులు, నిర్మాతల వరస ఇంతే. తము తీసిన కొన్ని మంచి చిత్రాల గురించి మంచి రివ్యూలు వస్తే ఏమీ అనుకోరు గానీ.. బాలేదని రివ్యూ వస్తే మాత్రం తెగ బాధపడిపోతారు.

మరి సంగతి ఏంటో గానీ.. ‘ఈడు గోల్డ్ ఎహె’ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్న హీరో సునీల్ కూడా ఇప్పుడు వెబ్ సైట్ ల రివ్యూల మీద విమర్శలు గుప్పిస్తున్నాడు. ‘‘సంగతేంటో గానీ.. తొలినుంచి నా సినిమాలకు రివ్యూలు సరిగా రావు.. కలెక్షన్లు మాత్రం బాగా వస్తాయి’’ అని చెప్పుకుంటున్నాడు. ఇటీవల విడుదల అయిన జక్కన్న వంటి చిత్రం బాక్సాఫీసు వద్ద అంత ఘోరంగా చీదేసిన తర్వాత.. ఇంకా.. కలెక్షన్లు బాగా వస్తుంటాయని ఆయన ఎలా చెప్పగలుగుతున్నారో ఏంటో మరి. ఇంతకీ ఆయన కమింగ్ చిత్రానికి రివ్యూలు బాగా రాయాలని ఆయన హెచ్చరిస్తున్నారా? లేదా, రివ్యూలు తిట్టిపోసినా సరే సినిమాకు తప్పకుండా రండి అని జనానికి విన్నవించుకుంటున్నాడా అనేది బోధపడడం లేదు.

చూడబోతే రామూ లాగానే సునీల్ కూడా మంచి సినిమాలు అందించలేకపోతున్న ప్రయత్నంలో.. మీడియా మీద సెటైర్లు వేసేసినట్లు కనిపిస్తోంది.

Similar News