సినిమాలో హీరోగా చేస్తావా అని అడిగితే.. అష్ట వంకర్లు ఉన్న వ్యక్తి కూడా.. మనకు తగ్గ కథ వీరి వద్ద ఉన్నదేమోలే అనుకుంటూ రెడీ అయిపోతాడు. మరి అందానికి కూడా ఐకాన్ లాగా ఉండే వ్యక్తికి అలాంటి ప్రపోజల్ వస్తే ఎలా స్పందిస్తాడు? ఏమో మరి.. తెలుగు సినిమా రంగంలో పేరుమోసిన నిర్మాత డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు.. తనను హీరోగా చేస్తానంటూ వచ్చిన ఆఫర్ కు టెంప్ట్ అవుతారో లేదో చూడాలి. ఇంతకూ ఆయనకు ఈ ఆఫర్ ఇచ్చిందెవరో తెలుసా.. సినీ నిర్మాణానికి చాలా కాలంగా దూరంగా ఉన్న మాజీ హీరో, జయభేరి ప్రొడక్షన్స్ అధినేత, తెలుగుదేశం ఎంపీ మాగంటి మురళీ మోహన్!!
తొలి తెలుగు టాకీ దర్శకుడు హెచ్ ఎం రెడ్డి స్మారక అవార్డును శుక్రవారం దిల్ రాజుకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి తెదేపా ఎంపీ మురళీ మోహన్ అతిథిగా హాజరయ్యారు. నిర్మాతగా దిల్ రాజు నైపుణ్యాలను ప్రశంసించిన మురళీ మోహన్, ఆయన చాలా అందంగా హీరోలా ఉంటారని ప్రస్తావిస్తూ.. దిల్ రాజు ఒప్పుకుంటే ఆయనను హీరోగా పెట్టి తాను సినిమా తీస్తానంటూ వేదిక మీదే ప్రకటించారు.
అయితే తమాషా ఏంటంటే.. దిల్ రాజు.. నిర్విరామంగా చిత్రాలు చేస్తూ ఉండే నిర్మాత. తనకు హీరోగా చేసే మోజు ఉంటే.. తనే హీరోగా ఎప్పుడో చేసుకుని ఉండేవాడు. కానీ.. తనే తీసుకోవడం వేరు. ఇండస్ట్రీలో మరో పెద్ద నిర్మాత ఆఫర్ ఇచ్చి తీయడం వేరు. మరి మురళీమోహన్ ఇచ్చిన హీరో ఆఫర్ కు దిల్ రాజు టెంప్ట్ అవుతారో లేదో చూడాలి.