ఇజం హిట్ అయితేనే పూరీతో జూనియర్ సినిమా

Update: 2016-10-15 01:13 GMT

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతిభతో, కథలో బలంతో ఎవ్వరికీ నిమిత్తం లేదు. ఎందుకంటే.. వాటిని తూకం వేసి నిర్ణయించగల శక్తి ఎవ్వరి వద్ద కూడా లేదు. అందుకే అందరూ సక్సెస్ వెంట పడి పరుగెత్తుతూ ఉంటారు. ఒక దర్శకుడు ఒక సినిమా హిట్ కొట్టాడంటే.. అతను చేయగల జోనర్ అవునా కాదా అనికూడా చూసుకోకుండా.. అతనితో తమకు నచ్చిన ఒక సినిమా చేయించుకుని.. అతని ఖాతాలో ఫ్లాప్ పడేలా చేసే ప్రబుద్ధ నిర్మాతలు కూడా ఎందరో ఉన్నారు. అయితే హీరోలు ఎంతగా ఆచితూచి వ్యవహరించడంలోనూ కాంబినేషన్ల ఎంపికలో ఈ ‘సక్సెస్’కే ప్రాధాన్యం ఇస్తుంటారన్నది నిజం.

ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే పనిచేస్తున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత తదుపరి చేయబోయే చిత్రం ఏదో ఆయన ఎంచుకోవాల్సి ఉంది. నిజానికి ఈ సరికే ఆ ప్రక్రియ మొత్తం పూర్తయి ఉండాలి.. ఒక సినిమా విడుదల అయ్యే సమయానికే.. తర్వాత చేయబోయే చిత్రం ఏదో నిర్ణయం అయిపోయిఉంటే.. హీరోకు కెరీర్ గ్రాఫ్ చురుగ్గా కదులుతున్న ఫీలింగ్ ఉంటుంది. అయితే గ్యారేజ్ విడుదల అయ్యాక ఇంకా.. నెక్ట్స్ చిత్రం గురించి ఎన్టీఆర్ ఒక నిర్ణయానికి రాలేదు. పూరీ జగన్నాధ్, త్రివిక్రమ్ చెప్పిన కథలు విన్నారని ఒక ప్రచారం ఉంది. అయితే త్రివిక్రం కథను ఓకే చేసినా కూడా.. వెంటనే అది పట్టాలెక్కే అవకాశం లేదు. ఇక పూరీ జగన్ కథ ను పరిగణించవచ్చు.

కాకపోతే.. ఇప్పుడు నందమూరి కల్యాణరామ్ హీరోగా పూరీ రూపొందిస్తున్న ‘ఇజం’ చిత్రం విడుదలయ్యాక దాని ఫలితాన్ని బట్టి... పూరీకి నెక్ట్స్ ఛాన్స్ ఎన్టీఆర్ ఇవ్వచ్చునని ఒక ప్రచారం జరుగుతోంది. ఇజం హిట్ అయితే గనుక.. వెంటనే పూరీ- జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా ఎనౌన్స్‌మెంట్ కూడా వచ్చేస్తుందని అనుకుంటున్నారు. అదే ఇజం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టిందంటే మాత్రం.. పూరీ జగన్ పెద్ద హీరోలు ఊసు వదిలేసి.. మళ్లీ.. మరో లోబడ్జెట్ ప్రయోగం చేసుకోవాల్సి ఉంటుందని పరిశ్రమలో వ్యాఖ్యానిస్తున్నారు.

Similar News