అరచేతిలో కొత్త సినిమా

Update: 2017-10-01 07:30 GMT

కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చిత్రాలు తీసి విడుదల చేస్తుంటే ఇప్పుడు ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో ఆ సినిమాలు అరచేతిలో వున్న మొబైల్స్ లో ప్రత్యక్షం అవుతున్నాయి. ఈ పరిస్థితి తెలుగు పరిశ్రమను కుదిపేస్తోంది. ఫోర్ జి డేటా అందరికి అందుబాటులోకి రావడంతో తమ వద్ద వున్న పైరసీ వీడియోలు క్షణాల్లో ప్రపంచం చుట్టేస్తూ చిత్ర నిర్మాణదార్లను , బయ్యర్లను ముంచేస్తున్నాయి . థియేటర్లు ప్రేక్షకులు లేక కళావిహీనంగా కనిపిస్తున్నాయి. చిత్రం ఏదైనా కావొచ్చు ఒక షో ప్రదర్శన పూర్తి అయ్యేలోపు మార్కెట్ లో పైరసీ వీడియో దర్శనం ఇవ్వడం సిల్వర్ స్క్రీన్ కి శాపంగా పరిణమించింది.

టికెట్ ధరలు అందుబాటులో లేకపోవడమేనా?

సాధారణంగా సినిమాలు ఇష్టపడే వారు క్వాలిటీ తో కూడిన చిత్రాన్ని వెండితెరపై సకుటుంబ సమేతంగా చూడాలనే భావిస్తారు. కానీ సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేనంతగా టికెట్ ధరలు చుక్కలు తాకడం పైరసీ భూతాన్ని మరింత పెంచి పోషిస్తుంది. ఒక కుటుంబం మొత్తం సినిమా చూసి రావాలంటే ఆ నెల్లో ఇంటి బడ్జెట్ భారీగా తేడా వస్తుంది. సుమారు వెయ్యి నుంచి రెండువేలరూపాయలు ఇంటిల్లిపాది సినిమా కోసం ఖర్చు చేసే పరిస్థితిని ఎవరు ఇష్టపడరు. ఇక్కడే పైరసీ రూపంలో వారికి కావాలిన చిత్రాలు డౌన్లోడ్ చేసుకు వీక్షించే అవకాశానికి ఎగబడుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మొబైల్స్ రూపంలో వచ్చేయడంతో వాటిలో న్యూస్ , ఎంటర్టైన్మెంట్ ఇలా ప్రతిదీ చూసే అలవాటు పెరిగిపోయింది . షేర్ ఇట్ , వాట్స్ అప్ మెసెంజర్ వంటి చాట్స్ ద్వారా లింక్ లు అందరికి స్ప్రెడ్ అయ్యి వైరల్ గా మారుతున్నాయి.

టికెట్ ధరలు తగ్గిస్తే సినిమాలే తీయలేరా ...?

ప్రస్తుతం టాలీవుడ్ నే తీసుకుంటే టికెట్ ధరలు తగ్గిస్తే సినిమాలే తీయలేని దుస్థితికి దిగజారింది . తారల రెమ్యునరేషన్ పెరిగిన వివిధరకాల ఖర్చులు , విదేశీ లొకేషన్లు పబ్లిసిటీ కి పెట్టే ఖర్చు తడిసి మోపెడు అవుతున్నాయి. చిన్న బడ్జెట్ తో సినిమాలు ఎవరైనా తీసే సాహసం చేసినా ధియేటర్ ల మాఫియా వారి చిత్రం విడుదలకు బ్రేక్ వేస్తుంది. దాంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీసి తక్కువ డబ్బులకు టికెట్ ధర పెడితే తమ పరిస్థితి ఘోరంగా ఉంటుందన్నది నిర్మాతల వాదన . ఈ నేపథ్యంలో తక్కువ బడ్జెట్ తో సినిమా తీసిన వారికి ఒకరకమైన కష్టాలు ఎక్కువ బడ్జెట్ తో సినిమా తీసిన వారికి పైరసీ భూతం పట్టి పీడిస్తున్నాయి.

వారంలోపు కలక్షన్ వస్తే వచ్చినట్లు ...

చిత్రం విడుదైలైన వారం రోజుల్లోపు కలెక్షన్ వస్తే ఆ సినిమా గట్టెక్కినట్లు లేనిపక్షంలో ఇక అంతే సంగతులు . ఒకేసారి అన్ని థియేటర్లలో కొత్త సినిమా ప్రదర్శించడం ప్రేక్షకులకు టికెట్స్ దొరకలేదనే భావన లేకుండా జాగర్తలు తీసుకునే ఫార్ములా ప్రస్తుత ట్రెండ్. ఆ సమయంలో చిన్న సినిమాలు విడుదలకు సిద్ధమైతే థియేటర్లకు నో ఛాన్స్ . వారు తమ విడుదలను వాయిదా వేసుకోవడం లేదా కొన్ని పరిమిత సెంటర్లలో మాత్రమే ప్రదర్శించడం జరుగుతుంది. ఇది పరిశ్రమకు తీరని చేటు తెస్తుంది .

అడ్డుకోలేని యంత్రాంగం ....

పైరసీ నిరోధానికి ప్రత్యేక యంత్రాంగం కానీ అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని బ్రేక్ వేయడంలో చిత్రపరిశ్రమ విఫలం అవుతుంది . అడపాదడపా దాడులు చేసినా ఫలితం శూన్యమే. కాపీ రైట్ యాక్ట్ చట్టం అమల్లో పోలీస్ శాఖలో ప్రత్యేక యంత్రాంగం లేదు . ఇవన్నీ పైరసీదారులకు కలిసి వస్తున్నాయి .దాంతో మార్కెట్లో కొత్త సినిమా విడుదల కావడమే ఆలస్యం అరచేతి లో వుండే మొబైల్ కి వచ్చి పడిపోతుంది . ప్రేక్షకుడు ధియేటర్ వరకు వెళ్లి సినిమా చూడాలి అంటే అది బాహుబలి రేంజ్ లో ఉంటే కానీ అటువైపు వెళ్ళే అవకాశాలు తక్కువే . దీనిపై సినీ ఇండస్ట్రీ లోతుగా చర్చించి ఐక్య కార్యాచరణ మొదలు పెట్టకపోతే భవిష్యత్తులో ఇప్పటికే మొదలైన షార్ట్ ఫిల్మ్ ట్రెండ్ కి చాలా మంది మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి .

Similar News