చిన్న చిత్రాలు ప్రొడక్షన్ లో ఉండగా.. ఎన్ని తగాదాలు జరిగినా, ఎన్ని మార్పు చేర్పులు చోటు చేసుకున్నా పట్టించుకునే వారెవ్వరూ ఉండరు. అదే సమయంలో పెద్ద స్టార్ల సినిమాల విషయం వేరు. వారు అసలే ఆచితూచి ప్రతి స్టెప్ వేస్తుంటారు గనుక.. అక్కడ చిన్న మార్పు జరిగినా దానికి చాలా పెద్ద కారణమే ఉంటుందనుకుని ఇండస్ట్రీ మొత్తం అటువైపు ఆసక్తిగా చూస్తుంది. మెగాస్టార్ 150 వ చిత్రం విషయంలో కూడా అదే జరుగుతోంది. ఆ చిత్రం ఐటం సాంగ్ నుంచి కేథరిన్ ను తప్పించి లక్ష్మీరాయ్ తో చేసిన వ్యవహారం ఇప్పటికీ హాట్ గానే డిస్కషన్స్ లో నడుస్తోంది.
తాజాగా మెగాస్టార్ చిరంజీవితో కలసి నటించాలనుకోవడం తనకు ఎంతో కాలంగా ఉన్న కోరిక అని, ఇప్పుడు అది తీరుతోందని ట్వీట్ చేయడం ద్వారా రాయ్ లక్ష్మి వార్తల్లోకి వచ్చింది. చిరుతో కలసి స్టెప్పులు వేయడం చెప్పలేనంత అనుభూతిని ఇస్తోందని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. సెట్‌లో చిరంజీవితో ఉన్న ఫోటోను కూడా ఆమె షేర్ చేసుకుంది. పన్లోపనిగా.. చిరు కూతురు సుస్మిత తనను చాలా అందంగా తయారు చేసిందంటూ.. ఆమె మేకప్ ప్రావీణ్యం గురించి కితాబులు ఇచ్చేసింది.
అయితే ఈ ట్వీట్ చూసిన తర్వాతే.. లారెన్స్ పాత్ర గురించి నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. లక్ష్మీరాయ్‌కు ఎంతో కాలంగా ఉన్న చిరుతో నటించే కోరికను తీర్చడానికి లారెన్స్ ప్లాన్డ్ గానే కేథరిన్ ను సీన్లోంచి తప్పించాడా అనే చర్చ జరుగుతోంది. అందుకే కాబోలు అచ్చంగా లారెన్స్ బాటలోనే... చిరు కోటరీని పొగడ్తల్లో ముంచేసే పనిలో లక్ష్మీరాయ్ పడ్డట్లుగా ఉన్నదని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.