లండన్‌లో ఘనంగా TAL వార్షికోత్సవం – ఉగాది వేడుకలు సందడి
తెలుగు సంస్కృతికి ప్రతిబింబంగా వేడుకలు సంగీతం, జానపద కళలతో సందడి
లండన్, మార్చి 21: తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) 21వ వార్షికోత్సవం, ఉగాది వేడుకలు పశ్చిమ లండన్‌లోని SKLPC నార్త్ హాలులో ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూలల నుంచి వందలాది తెలుగు కుటుంబాలు పాల్గొని వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నాయి.
కన్వీనర్ వాసుదేవ రెడ్డి, చైర్మన్ రవి సబ్బా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ బోర్డు సభ్యులు అనిల్ అనంతుల, కిరణ్ కప్పేట, అశోక్ మడిశెట్టి, రవి మొచెర్ల, శ్రీదేవి అలెద్దుల, వెంకట్ నీలా, సత్య పెడిరెడ్డి నాయకత్వం వహించారు.
రెండు దశాబ్దాలుగా యూకేలో తెలుగు భాష, సంస్కృతి, సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న TAL ప్రయాణాన్ని ఈ వేడుకలు ప్రతిబింబించాయి.
కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా ప్రముఖ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ ప్రత్యేక సంగీత కార్యక్రమం నిర్వహించారు. తెలుగు సంగీతం, సాహిత్యానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు కల్చరల్ ఎక్సలెన్స్ అవార్డు అందించారు.
జానపద కళాకారులు రెలరే గంగా, నల్గొండ గద్దర్–కాసాల నర్సన్న తెలంగాణ జానపదాన్ని రంగస్థలంపై ఆవిష్కరించారు. ప్లేబ్యాక్ గాయకులు అఖిల చంద్ర, శ్రీనిక మహతి సంప్రదాయ, ఆధునిక గీతాలతో ప్రేక్షకులను అలరించారు.
కార్యక్రమాన్ని యాంకర్ రవి మరియు బృందం చక్కగా నిర్వహించారు. TAL కల్చరల్ సెంటర్ విద్యార్థుల ప్రదర్శనలు కొత్త తరం తెలుగు కళలను ఎలా ముందుకు తీసుకెళ్తుందో చూపించాయి.