Sudan : సూడాన్ యుద్ధం మరింత తీవ్రం.. ఆసుపత్రిపై దాడిలో 64 మంది మృతి
సూడాన్ పశ్చిమ దార్ఫూర్ ప్రాంతంలో గత వారం ఆసుపత్రిపై జరిగిన దాడిలో కనీసం 64 మంది ప్రాణాలు కోల్పోయారు
This is a locator map for Sudan with its capital, Khartoum
సూడాన్ పశ్చిమ దార్ఫూర్ ప్రాంతంలో గత వారం ఆసుపత్రిపై జరిగిన దాడిలో కనీసం 64 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో కనీసం 13 మంది చిన్నారులు ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ శనివారం వెల్లడించింది. తూర్పు దార్ఫూర్‌లోని అల్ దాఈన్ టీచింగ్ ఆసుపత్రిపై శుక్రవారం జరిగిన ఈ దాడిలో మరో 89 మంది గాయపడ్డారు. ఈ ఘటనతో ఆసుపత్రి పూర్తిగా పనికిరాని స్థితికి చేరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ గెబ్రేయేసస్ ఎక్స్ వేదికగా తెలిపారు. 2023 ఏప్రిల్‌లో సైన్యం, ప్రత్యర్థి పరామిలటరీ బలగం ‘రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్’ మధ్య అధికార పోరు మొదలై దేశవ్యాప్తంగా యుద్ధంగా మారింది. అప్పటి నుంచి సూడాన్ తీవ్ర అశాంతిలోకి వెళ్లింది.
సైన్యమే కారణమని...
ఆసుపత్రిపై దాడికి సైన్యమే కారణమని రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను సైన్యం ఖండించింది. సమీప పోలీస్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకున్న దాడి అని ఇద్దరు సైనిక అధికారులు తెలిపారు. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడేందుకు అనుమతి లేకపోవడంతో తమ పేర్లు వెల్లడించవద్దని వారు కోరారు. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 40 వేల మందికి పైగా మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితి అంచనా. అయితే వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని సహాయ సంస్థలు చెబుతున్నాయి.
రెండు వేల మందికిపైగా...
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి వైద్య సదుపాయాలపై దాడుల్లో రెండు వేల మందికి పైగా మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.“ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఇకైనా సూడాన్‌లో హింస తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది” అని గెబ్రేయేసస్ అన్నారు.