అమీర్‌పేట మైత్రివనం వద్ద అగ్నిప్రమాదం
హైదరాబాద్ లోని అమీర్‌పేట మైత్రివనం నీలగిరి బ్లాక్‌లోని ఓ భవనంలో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది
హైదరాబాద్ లోని అమీర్‌పేట మైత్రివనం నీలగిరి బ్లాక్‌లోని ఓ భవనంలో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనం నాలుగో అంతస్తులో పలువురు విద్యార్థులు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. నాలుగో అంతస్తు బాల్కనీలో నిలబడి సహాయం కోరుతున్న విద్యార్థులను గమనించి రక్షణ చర్యలు ప్రారంభించారు. భవనం నుంచి దట్టమైన పొగ ఎగసిపడడంతో సిబ్బంది కొంతసేపు ఇబ్బంది పడ్డారు. అక్కడి దుకాణాలను వెంటనే అగ్నిమాపక సిబ్బంది మూసివేయించారు.
అందరూ సురక్షితమే...
నిచ్చెనలు, ముఖానికి మాస్కులు ఉపయోగించి అగ్నిమాపక సిబ్బంది బాల్కనీకి చేరుకుని విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మైత్రివనం వ్యాపార కేంద్రంగా ఉండటంతో అక్కడ ఐటీ కోర్సులు అభ్యసిస్తున్న పెద్ద సంఖ్యలో విద్యార్థులు, పరిసర ప్రాంతాల వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. మెట్రో స్టేషన్ వద్దనే ఈ ప్రమాదం సంభవించడంతో ట్రాఫిక్ కు కొంత ఇబ్బంది ఏర్పడింది.