సంప్రదాయం.. ఆధునికత..ప్రణవ్ చాగంటి ప్రయత్నం.. సక్సెస్ దిశగా
సంప్రదాయం, ఆధునికత పరస్పరం ఢీకొంటున్న నేటి కాలంలో వాటికి వంతెనగా నిలుస్తున్న స్వరం ప్రణవ్ చాగంటి
సంప్రదాయం, ఆధునికత పరస్పరం ఢీకొంటున్న నేటి కాలంలో వాటికి వంతెనగా నిలుస్తున్న స్వరం ప్రణవ్ చాగంటి. ‘అభినవకవి’గా పేరొందిన ఆయన కేవలం ర్యాపర్ గానీ, కవి గానీ కాదు. తరం తరాల కథలను చెప్పే కథనకారుడు. సాంప్రదాయ తెలుగు సాహిత్య స్పందనను ఈరోజు జీవన సత్యాలతో మిళితం చేస్తున్నాడు. అతని ప్రయాణం సాధారణంగా జరగలేదు. సహజ పరిణామంగా రూపుదిద్దుకున్నాయి. నాటి పద్యాల కొలమానం, హిప్‌హాప్ స్వేచ్ఛా ప్రవాహం కలుస్తాయి. సామాజిక అన్యాయం నుంచి పానీపూరి ఆనందం దాకా అతని పదాల్లో స్థానం దక్కించుకుంటాయి.
రెండింటినీ కలిపేందుకు...
రెండింటినీ కలపాలని ప్రయత్నించిన ప్రతి కళాకారుడిని ఒకే ప్రశ్న వెంటాడుతుంది. శతాబ్దాల నాటి ఛందస్సు, ర్యాప్ అనిశ్చిత ఉత్సాహం ఎలా కలుస్తాయి? నంది తిమ్మన, అష్టదిగ్గజాల కాలం పద్యశైలి ర్యాప్‌తో ఎలా ఒదిగిపోతుంది? అభినవకవి సమాధానం స్పష్టం. “కవిత్వానికి ఛందస్సు ఉంది. ర్యాప్‌కూ తనదైన తాళం ఉంది” అని ఆయన చెబుతాడు. ఉత్పలమాల, చంపకమాల వంటి ప్రాసలతో కూడిన తెలుగు పద్యానికి సహజ లయ ఉందని చెబుతాడు. ర్యాప్ నిర్మాణ పరంగా స్వేచ్ఛగా కనిపించినా, అది కూడా లయపైనే నడుస్తుందని అంటాడు. రెండింట్లోనూ తాళం ఉంది. లయ ఉంది. అందుకే ఈ వంతెన సాధ్యమని అనిపించిందని చెప్పాడు.
“నా కథలు నేనే చెప్పాలి”
తన లక్ష్యం అనుకరణ కాదని, పదమూడో శతాబ్దంలో పాలకురికి సోమనాథుడు తన కథలు చెప్పాడు. 15–16వ శతాబ్దాల్లో శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజాలు తమ కథలు చెప్పారు. నేను నా కథలు చెప్పాలనుకుంటున్నాను” అని అన్నాడు. పరికరం మారింది గానీ, లయబద్ధ భాషతో కథ చెప్పే మూలసూత్రం మాత్రం మారలేదని చెప్పాడు. ర్యాప్ తనను అభిమానిగా కాకుండా ఆధారంగా మలిచిందని అభినవకవి అంటాడు. సమాజంలో జరిగేదంతా తనను బాధపెడుతుందని తెలిపాడు. “చుట్టూ జరుగుతున్న విషయాలు నన్ను కలచివేసేవి. బయటపెట్టే మార్గం కావాలనిపించింది” అని గుర్తుచేశాడు. రచన ఆ మార్గమైంది. అన్యాయం, అనుభవాలను పదాల్లో పెట్టినప్పుడల్లా హృదయంలోని భారమొకింత తగ్గేదని అన్నాడు.
హ్యాష్‌ట్యాగ్ నుంచి...
2015లో #AbhinavaKavi అనే హ్యాష్‌ట్యాగ్‌గా మొదలైన పేరు, ఇప్పుడు అతని వ్యక్తిత్వంగా మారింది. #NaaRaNaaRaTeluguBhaasha వంటి ట్యాగ్‌లతో పాటు సరదాగా పెట్టిన ఆ పేరు తర్వాత పెద్ద బాధ్యతగా మారిందని తెలిపాడు. “ఇది స్టేజ్ పేరు మాత్రమే కాదు. ఇది నా గుర్తింపు. బాధ్యత కూడా” అని అన్నాడు. తెలుగు భాష రూప సౌందర్యం, శ్రావ్యత అన్నీ కలిసిన ప్రతీకగా ‘అభినవకవి’ నిలవాలని భావిస్తున్నానని చెప్పాడు. తెలుగు సముద్రం లోతైనదని, ఇంకా ఎన్నో అంతరాలు అన్వేషించాల్సి ఉందని అన్నారు. ఆ ప్రయాణంలో తన సంగీతం ఓ నౌకలా మారిందని పేర్కొన్నాడు. ఆధ్యాత్మిక ర్యాప్‌లు, సామాజిక విమర్శలు, హైదరాబాద్ చాయ్‌పై సరదా గీతాలు… అన్నీ ఆ ప్రయాణంలో భాగమని చెప్పాడు. సంప్రదాయం మ్యూజియంలో పెట్టే వస్తువు కాదని, నేటి స్వరాలను మలిచే హృదయ స్పందన అని ప్రణవ్ చాగంటి చూపిస్తున్నాడు.