సుప్రీం కోర్టు వివాదంలో జోక్యం చేసుకునేందుకు పార్లమెంటు సిద్ధమవుతోందా? క్రమేపీ ఆ దిశలోనే అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఇందుకు సంబంధించి డిస్కషన్ జరగవచ్చని ఢిల్లీ వర్గాల సమాచారం. జడ్జిల వివాదంలో నేరుగా కాకుండా సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, న్యాయ శాఖల పార్లమెంటరీ స్థాయిసంఘం రూపంలో జోక్యం ఉండవచ్చని తెలుస్తోంది. ఈ స్టాండింగ్ కమిటీ సోమవారం సమావేశం అవుతోంది. సాధారణ అజెండాలో ఎన్నికల సంస్కరణల అంశం ఉంది. అయితే అసాధారణ పరిస్థితుల్లో తమ పరిధిలోని శాఖల విషయంలో కూడా సభ్యులు అప్పటికప్పుడు టేబుల్ అజెండాగా సబ్జెక్టును లేవనెత్తే అవకాశం ఉంటుంది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో న్యాయపరమైన అంశాలపై దృష్టి సారించే సబ్ కమిటీ సుప్రీం వివాదాన్ని లోతుగా పరిశీలించే అవకాశం ఉన్నట్లు ఢిల్లీలోని కేంద్రప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలు తీవ్రమైనవి కావడానికి తోడు పర్యవసానాలు కూడా తీవ్రమైనవేనని శాసనకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అత్యున్నత పార్లమెంటరీ వ్యవస్థ జోక్యం చేసుకున్నా తప్పులేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సందు దొరికింది...
సాధారణంగా రాజ్యాంగంలోని మూడు ప్రధాన అంగాలైన ప్రభుత్వం, పార్లమెంటు, న్యాయవ్యవస్థ దేనికది స్వతంత్రంగా పనిచేస్తుంటాయి. ప్రభుత్వం పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటుంది. న్యాయవ్యవస్థ పనితీరు మాత్రం కొంచెం భిన్నం. రాజ్యాంగమే దానికి ప్రమాణం. పార్లమెంటు చేసిన చట్టాలను సైతం రాజ్యాంగ విరుద్దమంటూ కొట్టేసే అధికారం సుప్రీం కోర్టు, హైకోర్టులకు ఉంటుంది. అభిశంసన తీర్మానాల ద్వారా న్యాయమూర్తులను తొలగించే అధికారం మాత్రం పార్లమెంటుకు ఉంటుంది. పనితీరులో జోక్యం చేసుకునే అధికారం ఉండదు. అయితే తాజా వివాదంలో సుప్రీం పనితీరును, పాలన విధానాన్ని అందులోని సీనియర్ మోస్టు న్యాయమూర్తులే ప్రశ్నించడంతో పార్లమెంటరీ వ్యవస్థకు ఒక అవకాశం దొరికింది. ఎక్కడ వేలు పెట్టగలరో అన్వేషించి సుప్రీం కు సుద్దులు చెప్పే వీలుందేమోననే రంధ్రాన్వేషణకు రంగం సిద్ధమవుతోంది. బీజేపీకి చెందిన ఎంపీ భూపేందర్ యాదవ్ నేతృత్వంలోని 30 మంది సభ్యుల స్టాండింగు కమిటీ న్యాయ,సిబ్బంది వ్యవహారాలు, ప్రజాఫిర్యాదులపై పని చేస్తోంది. పరిధి విషయంలో కొంత సందిగ్ధత ఉంది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న తీవ్ర వ్యాఖ్య సుప్రీం జడ్జిలు చేయడం అసాధారణం. అందువల్ల భారత సార్వభౌమాధికారాన్ని పరిరక్షించాల్సిన వ్యవస్థగా సంక్షోభానికి దారి తీసిన పరిస్థితులు, పూర్వాపరాలపై పార్లమెంటరీ ప్యానెల్ అధ్యయనం చేసి పార్లమెంటుకు నివేదిక ఇవ్వవచ్చు.
రూల్స్ ...రూల్డ్ అవుట్...
కఠినమైన నియమాలు, క్రమశిక్షణ సుప్రీంకోర్టులో అంతర్భాగంగా ఉంటూ వచ్చాయి. విమర్శలు, ఆరోపణలు ఎప్పుడూ బహిర్గతం కాలేదు. ప్రత్యేకించి న్యాయవ్యవస్థలో ఉన్నతస్థాయిలో నెలకొన్నఅవగాహన కోర్టు ధిక్కారం వంటి ఆంక్షలు కారణంగా అంతర్గత, బాహ్య సంక్షోభం తలెత్తలేదు. కానీ సీనియర్ మోస్టు న్యాయమూర్తులు ధిక్కార స్వరం వినిపించి సీజేఐ పనితీరునే తప్పుపట్టడంతో న్యాయవర్గాలు తల పట్టుకోవాల్సి వచ్చింది. సుప్రీంకు ఉన్న విస్తృతాధికారాల కారణంగా ప్రభుత్వం, పార్లమెంటు నేరుగా జోక్యం చేసుకుని సరిదిద్దలేని పరిస్థితి. సీజేఐని నిందించిన న్యాయమూర్తులపై కోర్టు ధిక్కార, క్రమశిక్షణ చర్యలు తీసుకొనేందుకు అవకాశం ఉంది. కానీ ఇది సంక్షోభాన్ని మరింత ముదిరిపోయేలా చేస్తుంది. దాంతో వెనక్కి తగ్గారు. సంప్రతింపులు, రాజీ, సర్దుబాటు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇప్పటికే సీజేఐ, అసంతృప్త న్యాయమూర్తుల మధ్య రెండు విడతలుగా చర్చలు సాగినా.. సమస్య పూర్తిగా కొలిక్కి రాలేదు. రాజ్యాంగంలో అతికీలకమైన న్యాయవ్యవస్థ ప్రభుత్వానికి, పార్లమెంటుకు లోకువ అయిపోయే ప్రమాదం ఉందని న్యాయకోవిదులు ఆందోళన చెందుతున్నారు. రాజ్యాంగంలో పార్లమెంటు సర్వోన్నతమైనది. కానీ అక్కడ వివిధ రాజకీయ పార్టీల ప్రయోజనాలతో కూడిన రాజకీయాలు రాజ్యం చేస్తుండటంతో ఏకగ్రీవ, ఏకాభిప్రాయాలకు ఆస్కారం తక్కువ. అదే సుప్రీం కోర్టులో ధర్మాసనం చెప్పింది చెల్లుబాటవుతుంది. ఈరకంగా నిర్ణయాత్మకంగా మారింది సుప్రీం కోర్టు. తాజా వివాదం ఈ సాధికారతకు గండి కొడుతుందనే భయం నెలకొంటోంది.
నిష్ణాతుల నీడలో....
సుప్రీం పనిలో పూర్తిగా ఇన్ వాల్వ్ అయ్యే అధికారం పార్లమెంటుకు లేదు. న్యాయమూర్తులను అభిశంసన వ్యవహారాల్లో మినహా పార్లమెంటు కూడా సమన్ చేయలేదు. అయితే సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ను పిలిచేందుకు పార్లమెంటరీ కమిటీకి అధికారం ఉంది. తాజా పరిణామాలపై రిజిస్ట్రార్ ను పిలిచి వివరాలు సేకరించవచ్చు. రోజువారీ పాలన వ్యవహారాల్లో స్పష్టత లేకపోతే పార్లమెంటు విధివిధానాలను కూడా రూపొందించవచ్చు. సీజేఐ బాధ్యతలు, కొలీజియం అధికారాలు, సీనియర్ జడ్జిల పవర్స్ వంటి వాటిని నిర్దేశించవచ్చు. నేరుగా జోక్యం కాకపోయినా ఇది ఒకరకంగా న్యాయవ్యవస్థను చట్రంలో బంధించడమే. ఇంతవరకూ తమంతతామే ఈ విధివిధానాలను సుప్రీం కోర్టు అమలు చేసుకుంటూ వస్తోంది. పార్లమెంటరీ కమిటీ తాజా వివాదాన్ని అద్యయనం చేసినంత మాత్రాన న్యాయవ్యవస్థకు చేటు కాలం దాపురిస్తుందని కూడా చెప్పలేం. ప్యానెల్ లో సుఖేందు శేఖర్ రే, కల్యాణ్ బెనర్జీ, వివేక్ తంఖా, మజీద్ మెమన్; సంపత్ వంటి న్యాయనిష్ణాతులు ఉన్నారు. మొత్తం 30 మంది సభ్యులు ఉన్న ప్యానెల్ లో 15 మంది వరకూ ప్రతిపక్ష సభ్యులున్నారు. అందువల్ల ఏకపక్షంగా రిపోర్టు వచ్చే అవకాశం లేదు. అయితే అజెండాలో లేని అంశం కావడం వల్ల సభ్యులు అత్యవసర అజెండాగా ప్రస్తావనకు తెస్తే ఛైర్మన్ ఆమోదించాల్సి ఉంటుంది. అప్పుడే రిపోర్టుకు, అధ్యయనానికి అవకాశం ఏర్పడుతుంది.
-ఎడిటోరియల్ డెస్క్