రాజ్యాంగ విధులకు బద్ధుడుగా ఉండాల్సిన, దేశ రెండో పౌరుడు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చిక్కుల్లో పడ్డారా ? ఆయన చుట్టూ రాజకీయ దుమారం అలుముకుంటోందా? ప్రతిపక్షాల నుంచి నిరసన స్వరం తీవ్రమవుతోందా? రానున్న రోజుల్లో వెంకయ్య సంధికాలాన్ని ఎదుర్కోనున్నారా? అంటే ఔననే అంటున్నారు జాతీయ రాజకీయాల విశ్లేషకులు. మరి ఈ విషయం ఏంటో చూద్దాం. ఏపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఇంతింతై.. అన్నట్టుగా ఎదిగిన వెంకయ్య.. తన స్వయం కృషితో ఎన్నో పదవులు అలంకరించారు. రాజకీయాల్లో ఎలా ఉండాలో కాదు, రాజకీయాలు ఎలా చేయాలో కూడా తెలిసిన నేతగా ఆయన పండిపోయారు. అయితే, ఇటీవల మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో కేంద్రంలో కీలక స్థానంలోనే ఉన్నప్పటికీ.. వెంకయ్యను ఏరికోరి దేశ రెండో పౌరునిగా పంపించింది బీజేపీ అధిష్టానం.
వివాద రహితుడిగా...
దీనిపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేకపోయినా.. గాంధీల వారసుడు ఆయన మునిమనవడు గోపాల కృష్ణ గాంధీ పోటీలో నిలిచినా అంతిమంగా ఉపరాష్ట్రపతి సీటును వెంకయ్యే సాధించారు. ఎలాంటి వివాదాలకూ పోని, అవినీతి ఎరుగని నేతగా గుర్తింపు పొందిన వెంకయ్య.. ఈ పదవికి మరిన్ని వన్నెలు తెస్తారని అందరూ అభిలషించారు. దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెంకయ్యకు అభినందనలు వెల్లువెత్తాయి. మాతృభాష, మాతృమూర్తిపై మమకారం ఉండాలని పదే పదే చెప్పుకొచ్చే.. వెంకయ్యకు ఇప్పుడు తన జీవితాన్ని ఉప రాష్ట్రపతి వరకు తీసుకువెళ్లిన మాతృక అయిన రాజకీయాలే తిప్పలు పెడుతున్నాయి! నిజానికి ఉపరాష్ట్రపతిగా అత్యంత పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
జేడీయూ వ్యవహారంలో...
ప్రస్తుతం వెంకయ్య రాజ్యంగ విధుల్లో ఉన్నారు. సో.. రాజకీయాలకు తావులేకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అయితే, ఈ పదవిని చేపట్టి పట్టుమని పది నెలలు కూడా కాకుండానే ఉపరాష్ట్రపతి వెంకయ్య చుట్టూ రాజకీయ దుమారం నెలకొంది. జాతీయ పార్టీలైన సీపీఐ, సీపీఎం సహా పలు విపక్ష పార్టీల అధినేతలు వెంకయ్యపై విరుచుకుపడుతున్నారు. వెంకయ్య రాజ్యాంగ విశ్వసనీయతనే వారు ప్రశ్నిస్తుండడం గమనార్హం. జరిగిన పరిణామంలోకి వెళ్తే.. బిహార్ అధికార పార్టీ జేడీయూ మాజీ అధినేత శరద్ యాదవ్. ఆ పార్టీకే చెందిన అన్వర్ అలీలు.. ప్రస్తుతం పార్టీకి అసమ్మతి నేతలుగా మారారు. గడిచిన కొన్నాళ్ల కిందట రాష్ట్రంలో సీఎం నితీశ్ కుమార్ అర్ధంతరంగా ప్రధాని నరేంద్రమోడీతో పొత్తుకు సిద్ధం కావడంతో అప్పటి వరకు కాంగ్రెస్, ఆర్జేడీలతో ఉన్న పొత్తును నితీశ్ తెగతెంపులు చేసుకున్నారు. ఈ పరిణామాన్ని అప్పట్లో శరద్, అలీలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో వారు జేడీయూకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదిలావుంటే, ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన జేడీయూ వ్యతిరేక ర్యాలీలో వీరు పాల్గొన్నారు. దీనిని అదునుగా భావించిన జేడీయూ నేతలు వీరిద్దరిపై రాజ్యసభ ఛైర్మన్ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఫిర్యాదు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, వీరిని అనర్హులుగా ప్రకటించాలని కోరారు. అంతే! గంటల వ్యవధిలోనే వెంకయ్య ఈ ఇద్దరినీ అనర్హులుగా ప్రకటించేశారు. ఈ విషయమే జాతీయ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.
వీరిపైనే ఎందుకు...?
ఇప్పటికే అనేక పార్టీల్లో నేతలు గోడదూకుళ్లకు అలవాటు పడిపోయారు. వారిపైనా ఇప్పటికే రాజ్యసభ ఛైర్మన్ వద్ద అనర్హులుగా ప్రకటించాలంటూ పిటిషన్లు వందల సంఖ్యలోనే ఉన్నాయి. వాటన్నింటినీ వదిలేసిన వెంకయ్య.. కేవలం శరద్, అలీలపై నిముషాలు , గంటల వ్యవధిలో చర్యలు తీసుకోవడాన్ని.. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్రంగా దుయ్యబట్టారు. అనర్హులను చేయాలంటే.. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న వారిపైనా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేయడం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇక, సీపీఐ జాతీయ కార్యవర్గం నేత నారాయణ కూడా ఇదే డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లోని బీజేపీయేతర పార్టీల నేతలు సైతం ఇదే డిమాండ్ వినిపిస్తున్నారు. మొత్తంగా ఇది చినుకు చినుకు గాలి వానలా మారే పరిస్థితి కనిపిస్తోంది.
-ఎడిటోరియల్ డెస్క్