విన్నింగ్ రేసులో కాంగ్రెస్...!

Update: 2017-12-06 18:29 GMT

కాషాయ కోటలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా కోలుకుంటోంది. గత రెండు దశాబ్దాలుగా కమలదళానికి కేంద్రబిందువుగా నిలిచిన గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ గట్టి సవాల్ విసురుతోంది. అసలు ఉనికే లేని స్థాయి నుంచి అధికారపార్టీ అస్తిత్వాన్ని రూపుమాపే స్థాయికి చేరుకుంది హస్తం పార్టీ. తొలిదశ ఎన్నికలకు కొన్ని గంటల ముందు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోంది. తాజా సర్వేలతో ఇనుమడించిన ఉత్సాహంతో సాగుతోంది వందేళ్లకు పైగా చరిత్ర గల పురాతన పార్టీ.

మూడున్నరేళ్ల క్రితం అడ్రస్ గల్లంతు...

మూడున్నరేళ్ల క్రితం 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో హస్తం పార్టీ అడ్రస్ గల్లంతయింది. చరిత్రలో తొలిసారిగా రెండంకెల స్థాయిలో లోక్ సభ సీట్లను గెలుచుకుని చతికల పడింది. అసలు ఈ పార్టీకి మనుగడ ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా మహాత్ముని జన్మస్థలమైన గుజరాత్ లో పార్టీ అడ్రస్ గల్లంతయింది. మొత్తం 26 లోక్ సభ నియోజకవర్గాలకు గాను కనీసం ఒక్క చోట కూడా విజయం సాధించలేక పోయింది. మోడీ ప్రభావాన్ని మౌనంగా చేష్టలుడిగి చూసింది. మొత్తం 182 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 165 చోట్ల బీజేపీ ఆధిక్యం సాధించింది. కాంగ్రెస్ కేవలం 17స్థానాల్లోనే లోక్ సభ ఎన్నికల్లో ఆధిక్యాన్ని కనబర్చింది. ఈ ఫలితాలతో కంగుతిన్న కాంగ్రెస్ సమీప భవిష్యత్తులో కోలుకుంటుందా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమయ్యాయి. నాయకులు కూడా నిర్వేదంలో మునిగిపోయారు. జాతీయ నాయకత్వం కూడా ప్రేక్షకపాత్రకే పరిమితమైంది. 2015లో జరిగే స్థానిక సంస్థలు, జిల్లా, పంచాయతీ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్న ఆందోళన అప్పట్లో నెలకొంది. అన్యమనస్కంగానే రంగంలోకి దిగినప్పటికీ అనూహ్యమైన, అద్భుతమైన ఫలితాలను సాధించింది. నగరపాలక, పురపాలక సంస్థల ఫలితాలు అసంతృప్తిని మిగిల్చినప్పటికీ జిల్లా, బ్లాక్, పంచాయతీల్లో ఘనవిజయం పార్టీకి జవసత్వాలు నింపింది. భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించింది.

ఉద్యమాలు ఉపయోగపడ్డాయా?

నోట్లరద్దు, జీఎస్టీ, పాటీదార్ల రిజర్వేషన్ల ఉద్యమం, దళిత నాయకుడు జిగ్నేశ్ మెవాని, ఓబీసీల నాయకుడు అల్ఫేశ్ ఠాకూర్ ఉద్యమాలు కాంగ్రెస్ కు పరోక్షంగా ఉపయోగపడ్డాయి. ఈ పేరుతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అవకాశం దొరికింది. దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటైన గుజరాత్ నోట్ల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొంది. వ్యాపారులు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలను ఈ నిర్ణయం ఉక్కిరిబిక్కిరి చేసింది. వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరైన రాష్ట్రంలో ఈ వ్యాపారం బాగా దెబ్బతినింది. మోడీకి ఇబ్బంది కలిగించిన మరో నిర్ణయం జీఎస్టీ. వివిధ రకాల పన్నులు గల ఈ చట్టం సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచింది. చిన్నపాటి వ్యాపార సంస్థలు మూతపడేందుకు కారణమైంది. ప్రజల్లో వ్యక్తమైన నిరసనలను గమనించిన మోడీ ప్రభుత్వం జీఎస్టీలో కొన్ని మార్పులు చేసినప్పటికీ ప్రజలను సంతృప్తి పరచలేకపోయింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేంద్రమైన గుజరాత్ లో జీఎస్టీ ప్రభావం మరీ ఎక్కువగా ఉంది.

వ్యతిరేకులను దగ్గరకు చేర్చుకుని....

హార్థిక్ పటేల్, జిగ్నేశ్ మెవానీ, అల్ఫేశ్ ఠాకూర్ ల ఉద్యమాలు హస్తం పార్టీకి అందివచ్చిన అవకాశాలుగా పేర్కొనవచ్చు. వారికి, వారి డిమాండ్లకు ప్రాధమికంగా కాంగ్రెస్ అంగీకరించి వారిని అక్కున చేర్చుకుంది. వీరి వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకూ ప్రయోజనం కలుగుతుందన్న అంశాన్ని పక్కన పెడితే అధికార బీజేపీపై ఒత్తిడి తెచ్చేందుకు బాగా ఉపయోగపడింది. వారికి మద్దతు ఇవ్వడం ద్వారా ఆ యా వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు అవకాశం ఏర్పడింది. జిగ్నేవ్ మెవాని దళితవాదాన్ని, అల్ఫేశ్ ఠాకూర్ ఓబీసీ ఉద్యమాన్ని మినహాయిస్తే హార్థిక్ పటేల్ రిజర్వేషన్ల ఉద్యమం ద్వారా ఆది నుంచి బీజేపీకి మద్దతిస్తున్నపటేల్ సామాజిక వర్గం పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత సరేసరి. ప్రభుత్వ వ్యతిరేకత లేదని చెప్పలేనని స్వయంగా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్ర్రకటనను తేలిగ్గా తీసుకోలేం.

సర్వేల్లోనూ మెరుగుపడిన కాంగ్రెస్....

తాజా సర్వేల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసే విధంగా ఉన్నాయి. మొదట్లో సర్వేలు మోడీ వైపు మొగ్గు చూపినప్పటికీ ఆ పరిస్థితిలో మార్పు వచ్చినట్లు తాజా అంచనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పోటీ తీవ్రంగా ఉన్నట్లు లోక్ నీతి సీఎన్డీఎస్, ఎబీపీ న్యూస్ సర్వే చెబుతోంది. రెండుపార్టీలూ 43 శాతం ఓట్లను సాధించనున్నట్లు వెలవడుతున్న సర్వేలు కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోస్తున్నాయి. బీజేపీ 91-99, కాంగ్రెస్ 78-76 స్థానాలు సాధించవచ్చని ఈ సర్వే స్పష్టంచేస్తోంది. గతంలో ఇదే సంస్థ నిర్వహించిన సర్వేలో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యాన్ని ఇచ్చింది. ఆగస్టు, సెప్టంబరు, అక్టోబరుల్లో చేసిన సర్వేల్లో కాంగ్రెస్ వెనకబాటులో ఉన్నట్లు పేర్కొంది. నవంబరు సర్వేలో మాత్రం కాంగ్రెస్ కొంత పుంజుకున్నట్లు బీజేపీ కొంత వెనుకబడినట్లు పేర్కొంది. మొత్తం మీద కీలక సమయం వచ్చేసరికి విపక్ష కాంగ్రెస్ పుంజుకుంటున్నట్లు వస్తున్న వార్తలు ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. దాదాపు రెండున్న దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉన్న పార్టీకి ఇది ఊరట కలిగించే పరిణామమే.

 

-గుజరాత్ నుంచి ‘తెలుగు పోస్ట్’ ప్రత్యేక ప్రతినిధి

Similar News