వా...జీ...వా...జీ...నిజమేనా శివాజీ...?

Update: 2018-03-23 02:30 GMT

హీరో శివాజీ తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన వ్యక్తి. చిన్న బడ్జెట్ సినిమాలకు హీరోగా కొన్ని చిత్రాల్లో నటించిన శివాజీ అవకాశాలు క్షీణించడంతో రాజకీయ రంగం వైపు ఆసక్తి చూపించారు. తమకు రేటింగ్స్ కి అవసరమైనప్పుడు పనికొస్తాడని ఒక ఛానెల్ ప్రతి అంశంలో శివాజీని ప్రమోట్ చేసే బాధ్యతను నెత్తిన పెట్టుకుంది. ముందు బిజెపి లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ శివాజీని ఆ పార్టీ భరించలేక వదిలిపెట్టింది. తన పార్టీపైనే తరచూ విమర్శలు చేస్తూ మీడియా లో హల్చల్ చేసేవారు శివాజీ. రాష్ట్ర విభజన తరువాత సొంత పార్టీపై విమర్శలు చేసి చేసి పార్టీని వదిలేశారు. రాష్ట్ర విభజన సమయంలో శివాజీ టివి చర్చల్లో చేరిపోయారు. ఆ తరువాత ఏపీకి ప్రత్యేక హోదా తదితర అంశాల్లో సెలబ్రిటీ స్టేటస్ తో ఉద్యమం లో ప్రజల హక్కుల కోసం పోరాడే వ్యక్తిగా సదరు ఛానెల్ ఆయన్ను తీర్చిదిద్దింది.

ఆపరేషన్ ద్రావిడతో మరోసారి వార్తల్లోకి ...

టార్గెట్ బిజెపి గా వుండే శివాజీ కి పెద్దగా రేటింగ్స్ గతంలోనూ ఇప్పుడు కూడా లేవు. ఏపీలో హీటెక్కిపోతున్న రాజకీయాల నేపథ్యం కొత్త కోణాలను మీడియా పోటీ ప్రపంచంలో చూపాల్సిన తరుణంలో శివాజీని మరోసారి హీరో చేసే కార్యక్రమాన్ని ఆ ఛానెల్ తయారు చేసి జనం మీద ప్రయోగించింది. తన ఊహాగానాలతో శివాజీ స్ట్రింగ్ ఆపరేషన్ చేసి సమాచారం తెలుసుకున్న స్థాయిలో ఒక సరికొత్త ఆవిష్కరణ చేపట్టి విజయవంతం అయ్యింది. ఇప్పుడు తెలుగు మీడియా లో ఇన్నాళ్లకు శివాజీకి రేటింగ్ పలికింది. ఆయన స్వప్నం ఆ ఛానెల్ రేటింగ్ రెండు తీరిపోయాయి. టిడిపి చెప్పిన ఆపరేషన్ గరుడ కు మరికొంత స్కెచ్ గీసి ఆపరేషన్ ద్రావిడ పేరుతో ఒక ఆసక్తికర కధనాన్ని వండి వార్చేసి స్క్రిప్ట్ శివాజీ చేతిలో పెట్టారు ఛానెల్ పెద్దలు. దక్షిణాది రాష్ట్రాల్లో ఛానెల్ విస్తరించి ఉండటం దక్షిణాదిన పాగా వేయాలని బిజెపి చేస్తున్న ప్రయత్నాలు ప్రజలందరికి తెలిసివున్న నేపథ్యంలో ఈ ఎత్తుగడ అందరిని బాగా ఆకట్టుకుంది. సహజంగా నటుడు కావడంతో సీరియస్ గా ఆపరేషన్ ద్రావిడ అందులో అంతర్భాగం అయిన గరుడను వివరించడంలో ఆయన సక్సెస్ అయ్యారు.

ఈ ఎపిసోడ్ టార్గెట్ మోడీ, జగన్, పవన్ ....

ఈ ఎపిసోడ్ లో ప్రజల్లో మోడీ, జగన్, పవన్ పార్టీలు లక్ష్యంగా కనిపిస్తాయి. అయ్యో పాపం టిడిపి అనే రీతిలో స్క్రిప్ట్ సాగుతుంది. ఆ పార్టీని కేంద్రం సిబిఐ కేసులతో ఇరుకున పెట్టడం, ఆ పార్టీ కి వెన్ను దన్నుగా ఉండే వారు నేతల ఆర్ధిక మూలాలు దెబ్బతీయడం, వ్యాపారాలు దెబ్బ కొట్టడం మొత్తంగా టిడిపి ని భూస్థాపితం చేయడానికే మోడీ బిజెపి కంకణం కట్టిందనేది ప్రధాన స్టోరీ లైన్. ఇది అచ్చతెలుగులో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు బిజెపితో రాం రాం చెప్పాక డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నదే. బాబు అనుకూల మీడియా లో వస్తున్న కథనాలే. కొత్తదనం ఏమి లేదు. కాకపోతే కొన్ని ఛానెల్స్ శ్రమ పడి ప్రింట్ మీడియా లో జనానికి అర్ధమైందో లేదో అని దృశ్య మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి శివాజీ ద్వారా చెప్పించి తీసుకువెళ్లారు అని విశ్లేషకులు భావిస్తున్నారు. కొసమెరుపు ఏమిటి అంటే సదరు శివాజీ ఈ ప్లాన్ తాను బయటపెట్టేయడంతో కొత్త స్కెచ్ తో వస్తుందని, ఏపీలో బిజెపి బలపడటం టిడిపి ని కనుమరుగు చేయడం అనే లక్ష్యంలో ఏమార్పూ ఉండదని ముక్తాయించారు. బిజెపి ఆపరేషన్ ద్రావిడకు 4800 కోట్ల రూపాయలు కేటాయించిందని ఆరోపించారు.

దేనికీ ఆధారాలు లేవు ....

కథ... స్క్రీన్ ప్లే ....దర్శకత్వం అన్ని తానై శివాజీ తీసిన ఈ షార్ట్ ఫిలిం కి దేనికి ఆధారాలు చూపకపోవడం మరింత విశేషం. అంత డబ్బు ఎందుకు ఖర్చు చేస్తారో? ఎలా చేస్తారో ? చూపలేదు . దేనికి ఎంత ఖర్చు పెట్టారు? ఇంకా దేనిమీద ఎన్నివందల కోట్ల రూపాయలు ఖర్చు ఎలా అవుతుందో? చెప్పలేక పోయారు. ఏడాదిగా ఇది నడుస్తుందని చెబుతున్న శివాజీ ఇన్ని రోజుల తరువాత ఇది చెప్పడం మరింత హాస్యాస్పదంగా కనిపిస్తుంది. సాక్ష్యాలు ఆధారాలతో మీడియా ముందుకు వచ్చినా సవాలక్ష ప్రశ్నలు సంధించే వారే దీనికి వెనుక రూపకల్పన చేయడంతో శివాజీ చిత్రం ఇప్పుడు అటు ఛానెల్స్ లోను ఇటు సామాజిక మాధ్యమాల్లో బాహుబలి రేంజ్ లో ఆడుతుంది. ఎపి రాజకీయాలు తోలుబొమ్మలాటలా మారిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరింత మంది కొత్త కొత్త ఆపరేషన్లు మాకే తెలిశాయంటూ ఇలానే తెరపైకి వచ్చేయడం ఖాయంగా మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఛానెల్ కి ఎవరో ఒక సెలబ్రిటీ వారికి కధలు ఇతర మసాలాలు అందించేవారు ఎలానూ ఉంటారు కాబట్టి అలాగే ఒక ఛానెల్ లో రేటింగ్ వస్తే పక్క ఛానెల్ ఫార్ములా కాపీ పేస్ట్ పనిలో బిజీ కాబట్టి ఈ ధోరణి మరింత ప్రబలుతుందంటున్నారు విశ్లేషకులు.

Similar News